పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఈ వేడుకకు సంబంధించి వేదిక, పారిశుధ్యం, త్రాగు నీరు, సీటింగ్, తదితర ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వివిధ శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంద్రాగస్టు వేడుకకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. ఎక్కడ కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రశంసాపత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువు లోపు పంపించాలని ఆదేశించారు.
ప్రభుత్వం ఈనెల 15 నుంచి అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేసేందుకు నిర్ణయించినందున సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్తగా చేయూత పెన్షన్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పెన్షన్ల కోసం ఇదివరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 31వ తేదీలోగా అర్హులైన వారందరూ పెన్షన్ల కోసం సంబంధిత వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేయడంలో అలసత్వం చూపకుండా నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.