ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారునికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది : కే సురేంద్రమోహన్
ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారునికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెక్రటరీ, మార్కెటింగ్ డైరెక్టర్ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక సూర్యాపేట జిల్లా ప్రత్యేక అధికారి కే సురేంద్రమోహన్ అన్నారు.
శనివారం ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సమీక్షించారు.
ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి , సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారునికి అందుతున్నది, లేనిది తెలుసుకోవడంతోపాటు, అలాగే వివిధ పథకాల అమలులో ప్రజలకు అవగాహన కల్పించి సమస్యలను తెలుసుకునేందుకు 99 రోజులపాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. ప్రభుత్వ పథకాల ఫలితాలు లబ్ధిదారులకు అందాలంటే అన్ని పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, అప్పుడే లబ్ధిదారులకు సరైన విధంగా లబ్ధి చేకూరుతుందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర రంగాలలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం, లబ్ధిదారుల నుండి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం, ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి అధికారులు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎక్కడైతే ప్రజలకు విద్య, వైద్యం సక్రమంగా అందుతుందో అక్కడ పేదరికం ఉండదని అన్నారు.
సూర్యాపేట జిల్లాలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రమ పద్ధతిలో విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్ తో పాటు, అధికారులందరినీ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని, ఎట్టి పరిస్థితులలో లబ్ధిదారున్ని మర్చిపోకూడదని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులతో ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆయా శాఖల అధికారులు రొటీన్ పనుల పై కాకుండా అదే పనిని ఇతర ప్రాంతాలలో ఎలా చేస్తున్నారో అధ్యయనం చేసుకొని సాధ్యమైనంత ఎక్కువ లాభాన్ని ప్రజలకు చేకూర్చేందుకు కృషి చేయాలని, ఇందుకుగాను వినూత్నంగా ఆలోచన చేయాలని తెలిపారు. ఇందుకు సమర్థవంతమైన షెడ్యూల్ ను, ప్రణాళికను రూపొందించుకోవాలని, అప్పుడే ఆశాజనక ఫలితాలు వస్తాయని చెప్పారు . పథకాల అమలులో వివిధ శాఖలు సమ్మిళితంతో అమలు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన విద్య , వైద్యం ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలు అమలులో జిల్లాలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తూ ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన - ప్రణాళిక అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిందని, నిధులు లేకున్నప్పటికీ జిల్లాలో సమర్థవంతమైన కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. అధికారులు ఆర్థిక విషయాలు పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటూ పథకాలను అమలు చేయాలని , ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందో ఈ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో వందకు వంద శాతం విజయవంతం అవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇదే విధంగా ముందు ముందు జిల్లాలో ఏ కార్యక్రమాన్ని పెట్టినా అందరూ సమిష్టిగా కలిసి విజయవంతం చేయుటకు కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు వ్యవసాయ శాఖ యాప్ ల మీద అవగాహన కల్పించాలని, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా రైతులు ఆర్గానిక్ పంటలు పండించే విధంగా వ్యవసాయ, హా ర్టికల్చర్ అధికారులు అవగాహన కల్పించాలని, వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు చేసి రైతులు ఏ విత్తనాలు, ఏ ఎరువులు వాడితే లాభంగా ఉంటుందో అవగాహన కల్పించాలని, రైతు వేదికలలో రైతులకు సన్న వడ్ల సీడ్, ఫెర్టిలైజర్స్ అందించాలని, దీనికి నోడల్ ఆఫీసర్ గా అదనపు కలెక్టర్ ఉంటారని, రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన కల్పించి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించాలని, అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం, యూరియా యాప్, సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18001237157 ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. అదే విధంగా సంక్షేమ హాస్టల్స్ లో సంక్షేమ అధికారులు వారానికి ఒక సారి సందర్శించి బడ్జెట్ మీద ఆధారపడకుండా మానవతా దృక్పథంతో ఫ్యాన్లు రిపేర్ చేయించడం, చెప్పులు లేని విద్యార్థులకు చెప్పులు కొనివ్వాలని సంక్షేమ అధికారులకు సూచించారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా సూర్యాపేట జిల్లాలో 99 రోజులపాటు ఆయా అంశాల వారిగా చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారికి వివరించారు.
అనంతరం ఆయా శాఖలకు సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను జిల్లా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారికి వివరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ప్రత్యేక అధికారి కి జిల్లా కలెక్టర్ తో పాటు, జిల్లా ఎస్పీ కె నరసింహ ఇతర అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం పై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రత్యేక అధికారి తిలకించి చాలా బాగా చేశారని అభినందించారు.
చివరిగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిని సత్కరించి తమరు సూచించిన ఆదేశాలు జిల్లాలో తప్పకుండా అమలు చేస్తామని, ముందు ముందు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా విజయవంతం చేయడం జరుగుతుందని, తమరి ఆదేశాలు తప్పకుండా అమలు చేస్తామని అన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్, జెడ్పి సీఈవో శిరీష, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డి ఆర్ డి ఏ సన్యాసయ్య , డి ఇ ఓ అశోక్, సిపిఓ కిషన్ నాయక్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.