వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ

జిల్లా సరఫరాల జిల్లా మేనేజర్ విమల
జోగులాంబ గద్వాల 29 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. వరి ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సరఫరాల జిల్లా మేనేజర్ విమల తెలిపారు. గురువారం గద్వాల మండలము, లత్తిపురం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రుతుపవనాలు ముందుగానే వచ్చినందున వర్షాలు కురియడం జరుగుతుందని, దీనివల్ల ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బంది అవుతుందన్నారు.అయినప్పటికీని రైతులకు నష్టం వాటిల్లకుండా వరి ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లర్లకు చేర వేయడం జరుగుతుందని తెలియజేశారు. వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు అదనంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు చేరవేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే ట్యాబ్ ల ద్వారా ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసి సంబంధిత రైతులకు 48 గంటలలో వారి డబ్బులు వారి ఖాతాకు నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో అందుబాటులో ఉన్న గోనె సంచులు, తార్పాలిన్లను ఆమె పరిశీలించారు.
కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.