వయసు, తరగతుల పెరుగుదల సరే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకుంటే ఫలితం ఏముంది?
వయసు, తరగతుల పెరుగుదల సరే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకుంటే ఫలితం ఏముంది? సామాజిక, రాజకీయ, సంస్కృతిక అభివృద్ధి కూడా యువతకు అవసరమే! మూస పద్ధతిలో, దురలవాట్లకు బానిసలై, బాధ్యత లేని యువత ప్రమాదకరం
**********6********************)******
---వడ్డేపల్లి మల్లేశం 9014206412
ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశాలలో భారత్ అగ్రభాగంలో ఉన్నది అయితే ప్రయోజనం ఏమున్నది? పనిలో, గనిలో, కారఖానాలో, రాజకీయంలో, పాలనలో, పొలంలో చెమట చిందించే ప్రతి చోట ఉండాల్సిన యువత ఆడంబరాలకు వ్యసనాలకు సుఖాలకు మరిగి వికృత వేషధారణతో తాగుడుకు బానిసలై కుటుంబాలకు దూరం కావడమే కాదు మద్యం మత్తులో తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. దేశ పాలకులు తమ దేశంలో ఉన్న మెజారిటీ యువతను భారత దేశ అభివృద్ధి కోసం వినియోగించుకునే క్ర మంలో ప్రోత్సాహకర పరిస్థితులను కల్పించవలసిన బదులు క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లను బార్లా తెరిచి వేల సంఖ్యలో బ్రాందీ షాపులను అందుబాటులో ఉంచి నేరాలపై ఉక్కు పాదం మోపుతున్నామని చెబుతున్నప్పటికీ డ్రగ్స్ కు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయంటే దీని వెనుక ఉన్నదెవరు? దీనిని సొమ్ము చేసుకునే రాజకీయ పార్టీలు ముఠాల సహకారం లేకుండానే కొనసాగుతున్నాయా? ఒక రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు అవుతుంటే పక్క రాష్ట్ర పొలిమేరలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతున్నప్పుడు ఏ రకంగా కట్టడి సాధ్యమవుతుంది? ఇప్పటికీ భారతదేశంలో ఐదారు రాష్ట్రాలలో అమలవుతున్నప్పటికీ చిత్తశుద్ధిగా తమ ఆదాయాన్ని కోల్పోయినా తమ రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత ఇవ్వడానికి ఆశించిన ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఇబ్బంది అవుతున్నదంటే ఇది దేశవ్యాప్తంగా అమలై నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని ఆరాటం లేకపోవడమే కదా కారణం. ప్రతి చోటా యువత విచ్చలవిడిగా అన్ని కార్యకలాపాలలో పాల్గొంటూ హింసా వాదాన్ని ప్రోత్సహిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ సమాజంలో విచ్ఛిన్నకర శక్తుల సహవాసం మధ్య ఏ రకంగా శాంతి సాధ్యమౌతుంది?
ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న ఈ మొద్దు బారిన యువతకు సంబంధించిన సమస్యలను దేశానికి వదిలిపెట్టడం ఏమంత క్షేమకరం కాదు. ఒకవైపు అనేక పేద కుటుంబాలలో అద్వాన్న పరిస్థితుల్లో పెరిగినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఎన్నికై ఉద్యోగాలు సాధించి క్రమశిక్షణతో మర్యాదతో సామాజిక హోదాలో వి లసిల్లుతూ ఉంటే ఉన్నత మధ్యతరగతి కుటుంబాలలో నుండి వచ్చిన వాళ్లు మాత్రం జల్సాలకు అలవాటు పడి, బాధ్యతలను విస్మరించి, క్రమశిక్షణకు దూరమై, తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చి నటువంటి పిల్లలు ఎందరో! ముఖ్యంగా అమ్మాయిలు చదువులో పాల్గొంటూ పెళ్లిడు రాగానే ఓ అయ్య చేతిలో పెడితే హాయిగా బతుకుతూ పుట్టిన మెట్టినింటికి పేరు తె స్తున్నటువంటి సందర్భాలు చాలా కనపడుతూ ఉంటే దానికి భిన్నంగా మగ పిల్ల వాళ్ళది మాత్రం ప్రతి ఇంటికి ఓ చరిత్ర లాగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరూ దేశానికి భారమై, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఏ రకంగా ను దోహదపడకపోగా గుండాయిజం రౌడీయిజం తో రాజ్యమేలుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? ఈ యువతను ఇట్లా తయారు చేసినటువంటి వ్యవస్థ ఏది? ప్రస్తుత పాలన వ్యవస్థ ఇందుకు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది.
కనుమరుగవుతున్న సంస్కారం, మర్యాద, మన్నన
*********************************
నేటి తరం అంతా చదువుకోవడంలో ముందు వరసలో ఉన్నారు అభ్యంతరం లేదు కానీ అది నామ మాత్రంగానే కొనసాగుతూ ఉంటే విలువలు, క్రమశిక్షణ మర్యాదకు సంబంధం లేకుండా ఇంట బయట పెరగడాన్ని మనం జీర్ణించుకోకూడదు. .కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, బంధుత్వాలకు దూరంగా యాంత్రికంగా పెరుగుతూ కేవలం విలాసాలు ఆర్భాటాలకు మాత్రమే పాకులాడుతున్నటువంటి నేటి యువత తమ కర్తవ్యాలను ఏ రకంగా నిర్వహించగలరు?. విద్య అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ను సాధించేదే అని తత్వవేత్తలు హెచ్చరిస్తే మూర్తిమత్వ వికాసానికి దూరంగా, అనాగరికంగా బ్రతుకుతూ, పెద్ద చిన్న తేడా లేకుండా మర్యాద మన్ననకు దూరంగా ఆటవికుల కంటే హీనంగా బతుకుతున్నటువంటి నవతరాన్ని చూసి సిగ్గుపడాలా? లేక ఏడవాలో? అర్థం కావడం లేదు. ఇది కేవలం ఒక ఇంటి సమస్య కాదు దేశమంతా ఎదుర్కొంటున్న సమస్య ఆ కారణంగానే అనేక హత్యలు ఆకృత్యాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యం దేశమంతా తాండవిస్తున్నాయి. కేంద్ర మంత్రుల కొడుకులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటే వీళ్ళ పెరుగుదల ఏ రకంగా ప్రారంభమైనదో అర్థం చేసుకోవచ్చు. నేటి విద్యా విధానం లో యాంత్రికమైన పద్ధతులకు అవకాశం అధికంగా ఉన్న కారణంగా మానవీయ విలువలు కనుమరుగై ఇలాంటి వికృత క్రూర మనస్తత్వం కలిగిన వాల్లు గా ఎదగడాన్ని మనం మొగ్గలోనే తుంచి వేయాల్సిన అవసరం చాలా ఉన్నది. .కనీస మానవ సంబంధాలు కొనసాగించకుండా, విలాసాలకు డబ్బును అక్రమంగా సంపాదించుకొని, డ్రగ్స్ మద్యానికి అలవాటు పడుతూ, ప్రభుత్వాలు కల్పించినటువంటి అసాంఘిక అవకాశాలను వినియోగించుకుంటున్న యువతది నేరమా? లేక పాలకులు దీనికి బాధ్యత వహించాలా? ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సామాజిక రాజకీయ అనర్థాలకు యువత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటే ఆ అకృత్యాలు జరగడానికి కారణం క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, మద్యం డ్రగ్స్, మద్యపానం, ధూమపానం అని మానసిక నిపుణులు అభిప్రాయపడుతూ పాలకులను హెచ్చరిస్తూ ఉంటే ప్రభుత్వాలే అనుమతించి పెంచి పోషించి యువతకు అలవాటు చేసినప్పుడు యువత ఈ దేశాభివృద్ధిలో ఏ రకంగా పాల్గొంటుంది? . విచ్చలవిడిగా తల్లిదండ్రులనే ప్రతిఘటిస్తున్నటువంటి పిల్లలు, మర్యాద మన్న న లేకుండా దు రలవాట్లకు పాల్పడుతున్న యువత, తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు, పనిచేసుకొని బ్రతుకుమన్నందుకు అవమానంతో కుంగిపోయిన కొందరు, తమ తోటి వాళ్లు చేస్తున్నటువంటి పని లేదా సంస్కారాన్ని గ్రహించకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నటువంటి యువతను తల్లిదండ్రులు కట్టడి చేయడం లేదు, సమాజము అదుపు చేయడం లేదు, పోలీసు వ్యవస్థ కూడా తగిన శిక్ష అమలు చేయడం లేదు. ఇక పాలకులైతే వారికి తగినటువంటి వసతులను వాతావరణాన్ని కల్పించి రెచ్చగొడుతున్న తీరు మనందరికీ తెలిసిందే .
కఠిన చర్యలు చాలా అవసరం
**********************************
సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువత పైన ఉక్కు పాదం మోపాల్సిందే. పోలీసు న్యాయ వ్యవస్థ ఉమ్మడిగా యువతను కట్టడి చేయడంతో పాటు సామాజిక సంక్షోభాన్ని నివారించే క్రమంలో ప్రశాంత పరిస్థితులను కల్పించడం ద్వారా అభివృద్ధికి బీజం వేయాల్సిన అవసరం ఉంది. శక్తివంతమైన యువత వివిధ విభాగాలలో తమ పనులను కొనసాగించడం ద్వారా ఉత్పత్తిలో భాగస్వాములు అయితే దేశం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. దేశం స్వావలంబన వైపు నడిచి ఉత్పత్తులు అధికం కావడంతో దిగుమతుల సంఖ్య భారీగా తగ్గి దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. ఈ దుస్థితి నుండి గట్టెక్కాలంటే విద్యను సమూలంగా సంస్కరించడంతోపాటు సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. అంతేకాదు యువతకు దురలవాట్లను అందుబాటులో లేకుండా కట్టడి చేయడం ద్వారా దేశ రక్షణ బాధ్యతలను ఆలోచింప చేయడం ద్వారా సమున్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించే క్రమంలో యువత కీలకమని ఇప్పటికైనా గుర్తిస్తే చేజారిన పరిస్థితుల నుండి కొంతవరకైనా గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం సభ్యులు, హుస్నాబాద్ జిల్లా సిద్ధిపేట తెలంగాణ )