ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.*
ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.* నేడు ఒకరిని అరెస్టు చేస్తే నాకేమీ అనుకుంటే వరుసగా అదే పని చేస్తారు.* ప్రతిఘటించి, ప్రశ్నించి, ప్రజల పక్షాన పని చేస్తే కన్నెత్తి చూడరు. అంతిమ లక్ష్యం కూడా అదే కదా!*
*************************************
---వడ్డేపల్లి మల్లేశం 90142 06412
ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో విస్తృత రాజ్యాంగం కలిగి ప్రజాస్వామిక విలువలకు ప్రతిరూపమని భావించబడుతున్న భారత రాజకీయ చరిత్రలో ఆచరణలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య విలువలు తెల్లబోతున్నాయి. రాజ్యం పరంగా పెట్టుబడిదారీ వర్గం పరంగా, భారతదేశంలో నిలువెల్లా పెనవేసుకొని ఉన్న కుల మత కోణంలో హింస వివక్షత అణచివేత ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేయడం, హక్కుల కోసం చేసే పోరాటాలను తుంగలో తొక్కడం ఆనవాయితీగా మారిపోయింది. న్యాయవ్యవస్థ ఎంతో బలమైన రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అవసరమైతే శాసించిన సందర్భాలు అనేకం అలాంటి న్యాయ వ్యవస్థను కూడా భయపెట్టడానికి వెనుకాడని రాజకీయ యంత్రాంగం ఈ దేశంలో ఉందని మేధావులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నప్పుడు ఇక సాధారణ ప్రజలకు ప్రజాస్వామ్య శక్తులకు రక్షణ ఎలా ఉంటుంది? వివక్షత వంచన ఏ రూపంలో కొనసాగిన ప్రతిఘటించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అది సహజం కూడా. విద్య, సంస్కృతి, విలువలు ఆ పోరాట చైతన్యాన్ని అందించడంలో కీలక భూమిక పోషిస్తాయి. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదని ఆదేశిక సూత్రాలలో పొందుపరచుకొన్న ఆచరణలో మాత్రం దేశ సంపద 40 శాతం ఒక్క శాతం పెట్టుబడిదారు ల చేతుల్లో బలవుతూ ఉంటే రాజ్యాంగానికి ఆచరణకు ఉన్న తేడాను ఇప్పటికి పసిగట్టకపోతే ఎలా? ప్రజలను కంటిపాపలుగా పరిపాలన చేస్తామని మాట ఇచ్చి అధికారానికి వచ్చిన పాలకవర్గాలు అధికారం సొంతమైన తర్వాత తిరిగి 5 ఏళ్ల వరకు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ఈ రకంగా ఉల్లంఘనల కు పాల్పడవచ్చు, పెట్టుబడిదారులను రక్షించవచ్చు, ఎగవేత దారులకు ప్రోత్సాహాన్ని అందించవచ్చు అనే పద్ధతిలో కొనసాగినప్పుడు సామాన్య ప్రజానీకానికి ఈ దేశంలో రక్షణ ఎలా ఉంటుంది?
అన్ని పార్టీలది అదే ధోరణి:-
******************************
ఒక రాజకీయ పార్టీ అధికారంలో కొనసాగినప్పుడు చేసిన చట్టాలు ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నాయో లేదా ప్రజల హక్కులకు విగాథం కలిగించే రీతిలో ఉన్నాయా ఆలోచించే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది కదా! సకాలంలో ఆలోచించి ప్రతిఘటించక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే తానులోని ముక్కల వలె సర్దుకుపోయి ఆ పార్టీ దిగి ఈ పార్టీ రాగానే మళ్లీ అధికారాన్ని చలాయించడానికి నియంతృత్వాన్ని కొనసాగించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదంటే పాలనలో ఏమాత్రం తేడా లేకుండా మూసలో పోసిన విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య శక్తులను అణచివేస్తూ పత్రికా మీడియా రచయితలు కవులు, కళాకారులు మేధావులు జర్నలిస్టులను నోరు మెదపకుండా చేసే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతున్న ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యానికి మనం ఇచ్చుకున్న నిర్వచనాన్ని అయినా మార్చాలి లేకుండే పరిపాలనలో మౌలిక మార్పులకైనా సిద్ధ పడాల్సిన అవసరం ఉంది కదా! పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిని అధికారపక్షం ప్రమాదకారిగా చిత్రీకరించిన సందర్భం ఏ రకంగా సామాన్య ప్రజానీకాన్ని రక్షిస్తుందో భరోసా ఇస్తుందో ఆలోచిస్తే ఒళ్ళు గగూర్పొడిచే వాస్తవాలు బయటపడతాయి కదా! వాక్ స్వాతంత్రం అంటే ప్రధానికి రాష్ట్రపతికి సామాన్య మానవునికి కూడా ఒకే రకమైన స్వేచ్ఛ ఉంటుందనే కదా దీని అర్థం. అలాంటప్పుడు తన భావాన్ని వ్యక్తం చేయడానికి, అనుమానాలను నివృత్తి చేసుకో చేసుకోవడానికి, హక్కులను సాధించుకోవడానికి, ప్రభుత్వాలను ఆలోచింప చేయడానికి సామాన్యుల నుండి అసామానుల వరకు వేసే ప్రతి అడుగు అడిగే ప్రతి ప్రశ్న వ్యతిరేకంగా తోచినప్పుడు ఇక ప్రజల మను గడ ఎలా? కనీస సౌకర్యాలకు నోచని అశేష పేద మధ్యతరగతి ఆదివాసి విభిన్న వర్గాల వారు నిరుపేదలు ఆకలి అని తమ ఆరాటాన్ని ప్రశ్నించకుండా అడగకుండా పాలకులు పంచిపెట్టగలరా? అది చరిత్రలో సాధ్యమైందా? స్వతంత్ర పోరాటంలో దేశాన్ని సాధించుకోవడానికి ఎందరో అమరులైతే కానీ నిజరూపం దాల్చలేదు. ఆ తర్వాత అనేక ప్రాంతీయ పోరాటాలు రైతు ఉద్యమాలు తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం రాష్ట్ర ఆవిర్భావాల కోసం జరిగినటువంటి ప్రజా పోరాటాలు సమానత్వం స్వేచ్ఛ ఆస్తుల పంపకం పేదరిక నిర్మూలన కోసం జరిగినటువంటి అనేక ఉద్యమాలు కూడా క్రమంగా పాలకులను ఆలోచింప చేయడం ద్వారా సాధించిన పరిణామక్రమానికి ప్రతిరూపం నేటి పరిస్థితులు ఆర్థిక స్వావలంబన దేశాభివృద్ధి కాదా? నాడే ప్రశ్నించకుండా ఉంటే స్వాతంత్రం వచ్చేదా? తెలంగాణలో సాయుధ పోరాటం లేకుంటే భూస్వామ్య వ్యవస్థ ముసుగులో కొనసాగిన నిజాం రాచరిక పాలన అంతమయ్యేదా? అనేక రాష్ట్రాలు ఏర్పడడానికి జరిగిన పోరాటాన్ని ప్రతిఘటన అనుకుంటే రాష్ట్రాలు సా కారం అయ్యేవా? సుమారు నాలుగు దశాబ్దాలుగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పురుడు పోసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ప్రతి చోటా ప్రతిఘటన, ప్రశ్న, విమర్శ, ఎత్తుగడ, హక్కుల కోసం ఆరాటం పోరాటం అనివార్యమని అర్థమవుతూనే ఉంది కదా!
సామాజిక బాధ్యతగా ఆలోచించాలి
*****************************
ఇటీవల కాలంలో ముఖ్యంగా మీడియా ప్రతినిధులపై, కవులు కళాకారులు మేధావులు హక్కుల సంఘాలు ఉద్యమకారులు బుద్ధి జీవుల పైన ప్రయత్న పూర్వకంగా ప్రణాళికబద్ధంగా జరుగుతున్న దాడులు చర్యలు అరెస్టులు అణచివేతను గమనిస్తే ప్రజా చైతన్యము ద్వారా ప్రజాసామిక విలువలను బలోపేతం చేసుకొని స మ సమాజ స్థాపన దిశగా పోయే ప్రయాణానికి అడ్డుకట్ట వేయడమేనని అర్థమవుతుంది. రచయితలు తమ అభిప్రాయాలు రాస్తారు మేధావులు ఆలోచన చేస్తారు పత్రికా రంగం పరిశోధనాత్మక రచనల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. హక్కుల సంఘాలు ప్రయోగాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సమస్యలకు పోరాట రూపానికి అండ దండగా నిలబడతారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యవద్దంగా జరుగుతున్నదే కదా! తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలనే కనీస భావనకు విఘాతం కలిగించే ఏ చర్య కూడా ఈ విషయాలలో కనిపించడం లేదు కానీ పాలకులకు ఎందుకో ఇది నచ్చడం లేదు. ఒక రచయిత పాలకుల గురించి సహె తు కమైన సందర్భోచిత విమర్శ చేస్తే క క్షకట్టి శిక్షించడానికి అరెస్టు చేయడానికి దుష్ప్రచారం చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఇక్కడే ప్రజలు ప్రజాస్వామి కవాదులు ఆలోచించాలి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోని అధికరణముల ప్రకారంగా మనకు దఖలు పరచబడినటువంటి హక్కులను కాపాడుకునే క్రమంలో ప్రశ్నించడానికి వెనుకాడాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల మేరకే పాలకులు పరిపాలన చేయవలసి ఉంటుంది ప్రజలు తమ యొక్క ప్రతిస్పందన కనబరచవలసి ఉంటుంది. దీనికి ఏ వర్గం కూడా భిన్నంగా వ్యవహరిస్తే అది నేరమే అలాంటప్పుడు తమ హక్కుల కోసం తమ మనగడ కోసం ప్రజలు రచయితలు ప్రజల పక్షాన పోరాటం చేసేవాళ్లు హేతుబద్ధంగా ఆలోచించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసే క్రమం నేరం ఎలా అవుతుందో ఆ పని చేసిన వాళ్ళు ఎలా నేరస్తులు అవుతారో చిత్రంగా ఉంది కదూ! ఇక మిగిలింది పరిశీలన చేసి న్యాయ అన్యాయ విచారణ చేయవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థ పై మాత్రమే ఉంది. అనేక సందర్భాలలో పాలక పక్షాలను గట్టిగా మందలించి ప్రజల పక్షాన నిలబడిన కేసులు అనేకం ఈ దేశంలో. అదే సందర్భంలో ప్రజల కోసం పనిచేయకుండా నోళ్లు నొక్కిన సందర్భాలు కూడా లేకపోలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక రచయిత లేదా మేధావి కవి జర్నలిస్టు మాట్లాడితే కేసు పెట్టే ప్రయత్నం చేస్తే మిగతా సమాజం ఎందుకు మౌనంగా ఉండాలి? మన మాట వినిపించాలి మద్దతు అందించాలి లేకుంటే నేడు వాళ్ళ వంతు అయితే రేపు మన వంతు అనేది నగ్న సత్యం.ఈ దేశంలో ఎన్నో పోరాటాలతో ప్రభావితమై చైతన్యమై ప్రజాస్వామిక విలువలను పదిల పరుచుకున్న మనం కనీసం ఉన్న హక్కులు ఆ కాపాడుకోవడానికి ఒక్కటి కాకపోతే ఒక్కొక్కరిని వేరు చేయడానికి వెనుకాడరని తెలుసుకుంటే మంచిది. ప్రశ్నించిన వాడే నేరస్తుడు అయితే ప్రశ్నించవలసిన పరిస్థితిని కల్పించిన వాళ్ళు ఏమవుతారు? "ఎవరి పనిలో వారు నిమగ్నమై స్వార్థ చింతనకు బలై, ప్రశ్నించే మనస్తత్వం కొరవడి, బానిసగా బతకడానికి సిద్ధపడినటువంటి కొంతమంది, రకరకాల కారణాల వలన సమాజం నిస్తేజమైపోతున్నది ఇది ప్రజాస్వామిక విలువలకు మంచిది కాదు. ప్రజాస్వామ్య మ నుగడకు జాగరుకులైన ప్రజావళి చాలా అవసరం అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ లక్షణాలలో పొందుపరిచిన విషయం మన అందరికీ తెలుసు. అదే సందర్భంలో ప్రజలు మెచ్చిన పాలనకు భిన్నంగా నడుచుకుంటే ప్రజలు తమకు నచ్చిన పాలన తెచ్చుకోవడానికి పోరాటం చేయాల్సిందే అని నిర్వహమాటంగా చెప్పిన రాజ్యాంగ నిర్మాత మాటలకు అర్థం లేదా?"
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యులుహుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )