వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
తెలంగాణ వార్త, ఏప్రిల్ 11 :- రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాలలో నేరుగా సూర్య కిరణాలూ తాకే స్థలాలలో పని చేసే వారు వడదెబ్బకు గురి కాకుండా ఉండేలా నివారణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లోని వి సి హాల్ లో జాతీయ కార్యక్రమం వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై అనే అంశంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రఘునాథ స్వామితో కలిసి అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య హాజరయ్యారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, నేరుగా సూర్య కిరణాలూ తాకే స్థలాలలో పని చేసే వారు వడదెబ్బకు గురి కాకుండా ఉండేలా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య, విద్య, డిసాస్టర్ మానెజ్మెంట్ అథారిటీ, వ్యవసాయ, పశు సంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ, కాలుష్య నివారణ, మున్సిపల్ కమీషనర్ శాఖల వారు సమన్వయంతో పని చేయాలన్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు కూడళ్ల దగ్గర, పార్కుల వంటి స్థలాల వద్ద చలి వేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి త్రాగు నీటిని, చలి వేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. బయటికి వెళ్లే ప్రతి ఒక్కరు తలపై టోపీ, టవల్ ధరించాలని, ఓఆర్ఎస్ పౌడర్ కలిపిన నీటిని వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను యూపిహెచ్సి, పిహెచ్సి కేంద్రాలకు ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో పంపిణి చేయించాలన్నారు. వడదెబ్బ తగిలిన వారికీ శీతల పానీయాలు కాకుండా, మంచి నీళ్లు, ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు వెంటనే త్రాగించి, నీడ ఉండే ప్రదేశాలలో ఉండేలా చూడాలన్నారు. ముగాజీవాలకు, పక్షులకు మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం వడ దెబ్బ నుండి రక్షించుకుందాం అనే గోడ పత్రికను అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాంబశివ రావు, డిఏఓ రేఖ, డిజిడబ్ల్యూఓ రేవతి, డిడబ్ల్యూఓ కృష్ణ రెడ్డి, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.