లంచం ఇవ్వలేదని కరెంట్‌ లైన్‌ కట్‌ చేసిన లైన్ మెన్

Jul 20, 2024 - 08:13
Jul 20, 2024 - 13:43
 0  9
లంచం ఇవ్వలేదని కరెంట్‌ లైన్‌ కట్‌ చేసిన లైన్ మెన్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- లంచం ఇవ్వలేదని కరెంట్‌ లైన్‌ కట్‌ చేశారు ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో ఓ లైన్‌మెన్‌ నిర్వాకం మండల ఏఈకి రాతపూర్వక ఫిర్యాదు చేసిన రైతు సూర్యాపేట/ఆత్మకూర్‌(ఎస్‌) ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటనలు జిల్లాలో నిత్య కృత్యంగా మారుతున్నా ఉద్యోగులు లంచం తీసుకోవడం మాత్రం మానడం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో కొంతమంది లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నా ఇవ్వలేని వారు మాత్రం అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఒరిగిపోయిన విద్యుత్‌ స్థంబాలను సరి చేసి అడిగిన లంచం ఇవ్వలేదని రైతు పొలానికి కరెంట్‌ కట్‌ చేసిన ఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కందగట్లలో జరిగింది.

 రైతు తన వ్యవసాయ క్షేత్రంలో కరెంట్‌ స్థంబం ఒరిగిందని సరి చేయాలని లైన్‌మెన్‌ను సంప్రదించగా బొల్లం వీరమల్లు తెలిపిన వివరాల ప్రకారం కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య సోలార్‌ కంపెనీ సమీపంలో తనకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన వర్షాలకు రెండు స్థంబాలు ఒరిగి ప్రమాదంగా మారడంతో గ్రామ లైన్‌మెన్‌ వెంకటయ్యకు సమాచారం ఇచ్చి సరిచేయాలని కోరారు. దీంతో ఈ నెల 14న సిబ్బందితో సహా లైన్‌మెన్‌ వెళ్లి సరిచేశారు. ఆ తర్వాత సాధారణంగా అయితే 20 వేలు ఖర్చు అవుతుందని 10 వేల వరకు లంచం ఇవ్వాలని రైతును డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని బ్రతిమలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టారు. అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15న తన పొలానికి విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 అప్పటి నుంచి బ్రతిమలాడుతున్నా వినకుండా డబ్బులు ఇవ్వాల్సిందేనని ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేసి తనను ఇబ్బంది పెడుతున్న లైన్‌మెన్‌ వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. ------ ఏఈ వివరణ ----- ఈ విషయమై ఆత్మకూర్‌(ఎస్‌) మండల ఏఈ గౌతమ్‌ను వివరణ కోరగా విచారణ చేసి జేఎల్‌ఎంపై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్‌ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవదన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవిలను డీడీ రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు.