పరిపాలన అంటే ప్రలోభాలు వాగ్దానాలు రాయితీలు కాదు.
అసమానతలు అంతరాలను అంతం చేసే ఎత్తుగడ.
అభివృద్ధి సంక్షేమాలను సమాంతరంగా నడిపే సాహసోపేత నిర్ణయం.
కనీస అవసరాలను కల్పించి మానవాభివృద్ధిని సాధించే మహోన్నత ఆశయం.
పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజా వ్యతిరేక విధానాలపై మోపే ఉక్కు పాదం.
---వడ్డేపల్లి మల్లేశం
పరిపాలన అంటే ప్రగల్బాలు పలకడం వాగ్దానాలు చేయడం హామీలు ఇవ్వడం ఇష్టం ఉన్నట్టుగా రాయితీలు ప్రకటించడం ఆచరణకు సాధ్యం కానీ వరాలు కుమ్మరించడం కానే కాదు. అది అత్యాశ అంతే కాదు అధికారానికి రావడం కోసం చేస్తున్న పెనుగులాట మరో రకంగా ప్రజలను ప్రజాస్వామికవాదులను చేస్తున్న మోసం దగా దోపిడీ అన్న తప్పులేదు. ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి గతంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలైన విషయం మనకు తెలుసు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గతంలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని దళితులకు మూడెకరాల భూమి ఉచితంగా ఇస్తామని ఇచ్చిన మాట నీటిమూటలే. పైగా ప్రజలను రైతులను దళితులను సామాన్యులను వంచించడమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పత్రిక విలేకరులు ప్రతిపక్షాలు, స్వపక్షాలను కూడా వంచించిన తీరు మనందరికీ తెలుసు. అంతేకాకుండా తెలంగాణలో 2023 డిసెంబర్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎనలేనటువంటి హామీలు వాగ్దానాలు గ్యారంటీలను ఇచ్చి ప్రతిపక్షాల యొక్క ఆగ్రహానికి వెనువెంటనే గురైన విషయం కూడా మనకు తెలుసు. అందుకే ఇదంతా పరిపాలనలో భాగం కానే కాదు ఇది కేవలం ఎన్నికల డ్రామా, ప్రజలను మోసం చేసే విధానం, పరిపాలనకు వికృత రూపమే ఈ హామీలు ప్రగల్పాలు. ఇవి పరిపాలనలో భాగం కానేకాదు పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గుణపాఠం తెచ్చుకొని హామీలను మానుకొని వాగ్దానాలకు తె రదించాలి.
సాహ సోపేత నిర్ణయం :-
***"****
అభివృద్ధి పలాలు సమాజం యావత్తు అనుభవించే విధంగా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం పరిపాలనలో ప్రధానమైన ఘట్టం. వంతెనలు ప్రాజెక్టులు కాలువలు నిర్మాణాలు గృహవసతీ , పట్టణాలు నగరాలు పరిశ్రమలు పారిశ్రామిక కేంద్రాలు నిర్మించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రజలందరికీ మహోన్నతమైనటువంటి సౌకర్యాలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ వైపుగా దృష్టి సారించిన ప్రభుత్వమే నిజమైనటువంటి సమయస్ఫూర్తి గల ప్రభుత్వం అనబడుతుంది. ఇక అల్పాదాయ వర్గాలు పెట్టుబడిదారీ సంపన్న వర్గాలతో పోటీ పడలేని పరిస్థితిలో వారిని పైకి తీసుకురావడానికి దారిద్రరేఖ దిగు వన గల వర్గాలను మానవాభివృద్ధి క్రమంలో చేర్చడానికి ఆదాయ ప్రాతిపదిక మీద సమానత్వాన్ని సాధించే క్రమంలో పేదవర్గాలకు ఊరట కల్పించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో పేదలకు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపన్న వర్గాలకు పురోగమి పన్ను విధించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం
సాహసోపేత నిర్ణయం తీసుకోవాలి. ఇది సత్తా గల ప్రభుత్వాలకే సాధ్యం. ముందుగా భూమిలేని పేదవర్గాలు, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు వలస కార్మికులు చేతివృత్తులు చిరు వ్యాపారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆ వర్గ ప్రయోజనం కోసం వారిని సర్వే చేసి ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వీరి డేటాను సమీకరించి వారికి సంస్థాపరంగానూ ప్రభుత్వపరంగానూ అవకాశాలను మెరుగుపరచడం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వాల యొక్క బాధ్యత.
ఎత్తుగడలో ప్రభుత్వం కీలక పాత్ర వహించాలి :-
ఈ దేశ సంపద ప్రజలందరికీ చెందాల్సినది పోయి కొద్ది సంపన్న కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండడం రాజ్యాంగ రీత్యా దుర్మార్గం నేరం వ్యతిరేకం శాపం కూడా. అందుకు ఆ స్థితికి కారకు లై న పాలకులకు ఎంత కఠిన శిక్ష విధించినా తప్పులేదు. 77 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పరిపాలనలో ప్రస్తుతము దేశ సంపద 40 శాతం ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో ఉన్నదంటే దానికి పాలకులు బాధ్యులు కాదా ఈ అసమానతలు అంతరాలను కొనసాగించాలని చూస్తున్నటువంటి ఆగంతకులైనటువంటి పాలకులకు కఠిన శిక్ష విధించాల్సిందే. రాజ్యాంగం అందుకు అనుమతించి సర్వోన్నత న్యాయస్థానం శిక్ష విధించాలి. గత పది ఏళ్లలో దేశంలో 14 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దుచేసి కేంద్రం పెట్టుబడిదారులకు వ0త పాడితే ఇటీవల బడ్జెట్లో కేంద్రం సంపన్న వర్గాల యొక్క పన్ను రాయితీ నీ ప్రకటించడం ద్వారా సంపన్న వర్గాలకు ఊడిగం చేయడమే కాదు అసమాన తలను మరింత పెంచి పోషించడం ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అంతేకాదు అశాంతికి పోరాటాలకు వర్గ సంఘర్షణకు దారితీస్తుందని సోయి లేకపోతే ఎలా? ఇప్పటికీ 15% జనాభా దారిద్రరే క దిగువ న జీవిస్తుంటే పేదరికం ఉపాధి అవకాశాల లేమి కారణంగా కోట్లాది ప్రజానీకం రెండవ శ్రేణి పౌరులుగా అనాధలుగా జీవిస్తుంటే పాలకులకు ఇసుమంత కూడా రోషం లేకపోతే ఎలా ? ఆసమానతలు అంతరాలను నిర్మూలించే క్రమంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా దేశ సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేసే క్రమంలో ఉదాత్తమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడమే నిజమైన పాలన. లేకుంటే ఆ పరిపాలన ప్రజల చేతిలో బలి కాక తప్పదు .
మానవాభివృద్ధి ప్రభుత్వ బాధ్యత కాదా?
కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ చదువు వైద్యం విద్యుత్ శక్తి ఇతర అవసరాలను సమకూర్చుకోలేనటువంటి దుస్థితిలో కోట్ల కుటుంబాలు ఈ దేశంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ అమర్త్యసేన్ కనీస అవసరాలను తీర్చుకోగలిగిన మానవాభివృద్ధిని సాధించకపోతే ఆ ప్రభుత్వానికి అర్థం లేదు అది పరిపాలన కానే కాదు అని నిష్కర్షగా విమర్శించిన తీరు పాలకులకు గుర్తు రాకపోతే ఎలా? అన్నపు రాశులు ఒకచోట ఆకలి మంటలు మరొకచోట, భవనాలు ఆస్తులు అంతస్తులు ఒకచోట బక చిక్కిన డొక్కలు మాడిన మనుషులు మరొకచోట ఇంత దౌర్భాగ్యమైనటువంటి వివక్షత ఈ దేశంలో కొనసాగుతుంటే ఇది మానవాభివృద్ధి ఎలా అవుతుంది?/ కనీస అవసరాలకు కూడా నోచ నటువంటి కోట్లాదిమందిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కూడా మనసొప్పని పాలకులకు కఠిన శిక్ష విధించాల్సిందే.
అవసరాలను గుర్తించడం, ఆదాయాల మార్గాలను సమకూర్చడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రజా సంపదను పేద వర్గాలకు వివిధ రూపాలలో సమకూర్చడం ద్వారా ఆ కుటుంబాలను జనజీవన స్రవంతీలోకి థీ సుకురావడం ద్వారా మానవాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికవేత్తలు సామాజికవేత్తలు సామాజిక నిపుణుల సహకారాన్ని పరిశీలించకుండా ఒంటెద్దు పోకడలో వ్యవహరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ప్రజల చేతిలో పరాభవాన్ని ఎదుర్కోక తప్పదు.
ప్రజా వ్యతిరేక విధానాల పైన ఉక్కు పాదం :-
ప్రభుత్వాలు ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడినప్పుడు ప్రజలకు బాధ్యత వహించవలసి ఉంటుంది ఆ క్రమము లోపల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి అసమానతలు అంతరాలను సరిదిద్దే క్రమంలో కఠిన నిర్ణయాలను తీసుకునే క్రమము లోపల పెట్టుబడిదారీ పారిశ్రామికవేత్తలకు వంత పాడకుండా ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలి. కానీ ఇటీవలి కాలంలో పెట్టుబడిదారీ వర్గాల కోసం మాత్రమే పాలకవర్గాలు పనిచేస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బు రాయితీలు ప్రకటనలు ప్రచార సామాగ్రికి దాసోహమై ఎన్నుకున్న ప్రజలకు దూరమవుతున్నారు. అంతే స్థాయిలో ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్న విషయాన్ని కూడా మనం గమనించక తప్పదు. మద్యం మత్తు పానీయాలు కల్తీ వ్యాపారం ధూమపానం క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, అశ్లీల అత్యాచార శృంగార విభిన్న ప్రదర్శన అంశాలు రాజ్యమేలుతుంటే సామాజిక రుగ్మతలు ఈ దేశంలో పెచ్చు మేరి పోతున్న కూడా పట్టించుకోనటువంటి పాలకవర్గాలకు పోలీసు వ్యవస్థ తొత్తులుగా మారిన సందర్భంలో తాత్కాలికంగా ప్రయోజనం పొందవచ్చు.
కానీ ప్రభుత్వాలు మారిన సందర్భంలో పోలీసు వ్యవస్థ పైన కొత్త ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపడాన్ని గనక గమనిస్తే పోలీసు వ్యవస్థ ఏ పాలకులకు అనుగుణంగా కాకుండా చట్టానికి అనుగుణంగా పని చేస్తేనే మంచిది అనే విషయం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా హెచ్చరించిన విషయాన్ని గమనించవలసి ఉంటుంది .చట్టసభల్లో నేరస్తులు నేర చరిత్ర గల వాళ్లు ఒకవైపు కొనసాగుతుంటే కేవలం ఆరోపణ పేరుతో కోట్లాదిమంది పేద వర్గాలను నేరస్తులుగా చిత్రీకరించి విచారణ ఖైదీలుగా చేస్తున్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతున్నది. ఇక మేధావులు బుద్ధి జీవులు సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్లు ప్రజల పక్షాన పని చేసినటువంటి పాపానికి మానవ పౌర హక్కుల సంఘాల బాధ్యులను ఇస్టారాజ్యంగా అణచివేత నిర్బంధం పేరుతో శిక్షించిన తీరు ఇటీవల కాలంలో హృదయ విదారకం . యూపీఏ హయాంలో అమల్లోనికి వచ్చినటువంటి ఉపా చట్టాన్ని ఎత్తివేయడంతో పాటు ప్రజల యొక్క పౌర ప్రజాస్వామిక హక్కులను కాపాడ డానికీ ప్రభుత్వాలు గ్యారెంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది .అది మాత్రమే నిజమైన పాలన కానీ ప్రశ్నించి ప్రతిఘటించి నిలదీసే ప్రజాస్వామిక శక్తులను అణచివేయడమే పరిపాలన అనుకుంటే అందుకు తగిన మూల్యం పాలకవర్గాలు చెల్లించుకోక తప్పదు అని ఆధునిక ప్రజాస్వామ్యంలో పాలకవర్గాలు గుర్తించడం చాలా అవసరం. ఇది ఒక ప్రాంతానికి రాష్ట్రానికి పరిమితం కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాలకవర్గాలకు ఇదే నిబంధన వర్తిస్తుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)