రాత్రికి రాత్రి కొట్టారంట..! అధికారులకు తెలవదంట..
హరితహారం చెట్ల రక్షణ పై నిర్లక్ష్యపు నీడలు...
సూర్యాపేట మున్సిపాలిటీలో ఇబ్బడి ముబ్బడిగా చెట్లను నరుకుతున్న వైనం ఒకరి మీద,ఒకరు చెప్పుకుంటూ బాధ్యతను దాటవేస్తున్న అధికారులు జిల్లా కేంద్రంలో గత పదేండ్ల కాలంలో పెంచిన హరితహారం మొక్కలు నేడు చెట్లుగా ఎదిగి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మొక్కలు నాటగానే కొన్నింటిని మేకలు తినగా ఇంకొన్ని పెరిగేసరికి తీగలకు అడ్డువస్తున్నాయని కరెంట్ వారు కొట్టేస్తున్నారు.అన్నింటిని తట్టుకొని ఇంకొన్ని పెరిగితే ఇండ్లకు, బొమ్మలను అడ్డువస్తున్నాయని ఎలాంటి అనుమతి లేకుండా మంచి గాలిని ఇచ్చే చెట్లను కొట్టి వేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పొయ్యిలో కట్టెలుగా మారి బూడిద అవుతున్నాయి.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో ఏపుగా పెరిగిన చెట్లను ఎవరికి చెప్పకుండా ఎవరికి వారు నరికి వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పే అధికారులు పెరిగిన చెట్లను సంరక్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. పట్టణంలోని పలు వార్డులో పెద్ద భవనాల యజమానులు ఎవరికి వారు తమ ఇంటికి అడ్డుగా ఉన్నాయని ఇష్టరాజ్యంగా చెట్లను నరికి వేస్తున్న ఈ విషయాన్ని స్థానికులు పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫారెస్ట్ అధికారులు అంటూ మున్సిపల్ అధికారులు, మున్సిపల్ అధికారులు అంటూ ఫారెస్ట్ అధికారులు,ఒకరిపై ఒకరు చెప్పుకొని సమస్యను గాలికి వదిలేస్తున్నారు. బడా కార్పొరేట్ దుకాణం వారు ఓ చెట్టును కొడితే లక్ష రూపాయల జరిమానా వేయ గా సంవత్సరం కాలం చెట్టు మీద చెయ్యి వేయటానికి ప్రజలు భయ పడ్డారు. అలాంటి అధికారులు ప్రస్తుతం ఏమయ్యారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ నెల 16న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 39 వార్డులో ఏపుగా పెరిగిన పెద్ద చెట్టును మధ్యకు నరికి వేయాగా ఈ విషయమై అధికారులకు తెలియజేసిన ఎలాంటి స్పందన లేదు. సదరు ఇంటి యజమాని ఎవరు కొట్టివేశారో తనకు తెలియదని చెబుతుండగా అధికారులు మాత్రం ఎవరో తెలియనప్పుడు మేము ఏం చేస్తామని దాటవేస్తున్నారు. అసలు వార్డుల్లో మున్సిపాలిటీ జవాన్ తో పాటు,అభివృద్ధి కమిటీ ఉన్న ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా అధికారులు మా బాధ్యత లేదనడం హాస్యాస్పదంగా ఉంది. హరితహారం అంటూ,వన మహోత్సవం అంటూ మొక్కలు నాటాలని సంరక్షించాలని ఎవరైనా అధికారులు వస్తే వారిని నిలదీయాల్సిన అవసరం ఉందని,ఇకనైనా అధికారులు నిద్ర మబ్బు నుంచి తేరుకొని హరితహారం చెట్లను సంరక్షించే చర్యలు చేపట్టాలని, పట్టణ ప్రజలు, హరిత ప్రియులు విజ్ఞప్తి చేస్తున్నారు.