రాచరిక పాలనలోనూ ప్రజాస్వామిక విలువలా ?

Mar 9, 2026 - 05:00
 0  0

రాచరిక పాలనలోనూ ప్రజాస్వామిక విలువలా ?

అది శివాజీ పాలనలోనే సాధ్యమన్న విశ్లేషకులు.హామీలు,

వాగ్దానాలతో కాలం వేళ్ల దీసే  పాలకులకు శివాజీ  నమూనా ఒక పరీక్ష .

అభివృద్ధి ,సంక్షేమo సమoగా నడపడమే  పాలన అని గుర్తిస్తే మంచిది.

----  వడ్డేపల్లి మల్లేశం 


"రాచరిక పాలనలో ప్రజాస్వామ్యక విలువలు,  ప్రజాస్వామ్య పరిపాలనలో రాచరిక ఆధిపత్యము అణచివేత నిరంకుశత్వం  ఇవి సహజత్వానికి విరుద్ధమైనవి." కానీ  నేటి ప్రజాస్వామిక పాలనలో కూడా  అణచివేత దోపిడీ పీడన వంచన నిరంతరం కొనసాగుతూ ఉంటే  సుమారు  400 సంవత్సరాల క్రితం జన్మించి  పాలకుల అధికారాన్ని ధిక్కరించి  రాజ్యాన్ని స్థాపించి  పట్టాభిషేకం కావించుకొని  స్థిరమైన పాలన అందించినటువంటి శివాజీ పాలన గురించి  నేడు చర్చించుకోవడం అవసరమా? అనే వాళ్ళు లేకపోలేదు కానీ  ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆకాంక్షలను విస్మరిస్తున్నటువంటి నేటి పాలకుల ముందు  శివాజీ పరిపాలన అంశాలను  చర్చిస్తేనే అది గుణపాఠంగా మిగిలిపోతుంది.

మంచి చెడుల మధ్యన ఎంత తేడా ఉంటుందో  ఆ అంశాల ప్రస్తావన కూడా అవసరమైనప్పుడు అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది అనడానికి  ఇన్ని శతాబ్దాల తర్వాత శివాజీ పాలన గురించి చర్చించుకోవడం  నిజంగా సందర్భోచితమే  .ఆధునిక కాలంలో వాగ్దానాలు, హామీలు,  ప్రలోభాలతో ప్రజలను బానిసలుగా యాచకులుగా మారుస్తున్న తరుణంలో  ప్రజా ఉద్యమాలు ప్రజల నిరసనలను  అణచివేస్తున్న వేళ  ప్రజాసామిక విలువలను ఆకాంక్షించి ప్రజారo జకంగా పాలించిన శివాజీ పాలన గురించి చర్చించుకుంటే తప్పేమిటి? నేటి పాలకులు ,రాజుల చరిత్ర అంటూ కొలమానం ఉంటుందా? " చరిత్ర అధ్యయనం పట్ల ఆసక్తి కనబరచడం ఎంత ముఖ్యమో  చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవడం కూడా పాలకులకు ప్రజలకు అంతే ముఖ్యం.  చరిత్ర ద్వారా ఈ వ్యవస్థకు అందే ప్రయోజనం కూడా అదే" . 1630 ఫిబ్రవరి 19వ తేదీన  పూణే జిల్లాలోని జున్నారు పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ దంపతులకు జన్మించిన శివాజీ  మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే బోస్లే కులానికి చెందిన సామాన్య వ్యక్తి.తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశానికి చెందిన ఆడపడుచు కాగా  శివాజీకి ముందు పుట్టినటువంటి సంతానమంతా మృతి చెందడంతో  జిజియా  పూజించే దేవత అయినా  శివ పార్వతి పేరుతో ఆయనకు శివాజీ అనే పేరు సార్థకమైంది .

తండ్రి షా హాజీ నిజాం రాజుల దగ్గర  ఆస్థానంలో పనిచేస్తున్న సందర్భంలో స్వతంత్ర సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో  ఢిల్లీ మొగల్ చక్రవర్తులు ఆదిల్ తో  కలిసి షాహజీని ఓడించడం జరిగింది . అక్కడ కుదిరిన సందీ ప్రకారంగా  శివాజీ తండ్రి  బెంగళూరు ప్రాంతాన్ని జాగిర్గా  పొందడంతో పాటు  పూణే జాగిర్ కూడా  హస్తగతం చేసుకోవడంతో సామ్రాజ్య అంకురార్పణకు  మార్గం సుగమమైనది. 


 తండ్రి షాహాజీ శివాజీకి రాజనీతి వ్యవహారాలను నేర్పిస్తే  తల్లి  జిజియా  బాయి  విద్యాబుద్ధులు నేర్పించి చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాదలు ,  ఉగ్గుపాలతో రంగరించిన పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం,  తల్లిదండ్రుల  ఆదరణ  వంటి లక్షణాలను తల్లి దగ్గర నేర్చుకున్నాడు.  తన తండ్రి పొందిన కొన్ని పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత  అనివార్య పరిస్థితుల్లో శివాజీ యుద్ధ విద్యలలో ఆరితేరి  సకల విద్యలను నేర్చుకునీ  మరాఠా సామ్రాజ్య స్థాపినే లక్ష్యంగా తన పావులు కదపడం  మొదలుపెట్టాడు  .
   

శివాజీ పట్టాభిషేకం, పాలనా చతురత

తండ్రి సహకారం సిబ్బంది ప్రోత్సాహంతో  నిజాం రాజుల తో  పాటు పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి  మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించడంతోపాటు 1674 సంవత్సరంలో  చత్రపతి శివాజీ స్వతంత్ర పాలన చేపట్టి పట్టాభిషిక్తుడైనాడు . మొగళ్ళతోనూ సుల్తానులతోనూ నిజం రాజులతోనూ  వేరువేరు యుద్ధాలలో  తన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతోపాటు పట్టువదలని  విక్రమార్కుడిలా  రాజ్యాధికారం కోసమే కాకుండా ప్రజా సంక్షేమం కోసం, హక్కులను కోల్పోతున్న ప్రజల దయనీయ జీవన గమనంలో మార్పులు తీసుకురావడం కోసం  తనదైన శైలిలో పరిపాలన కొనసాగించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం నిజంగా  రాచరికంలో ప్రజాస్వామ్య అవుతుంది . యుద్ధ విద్యలతో పాటు పరిపాలన విధానంలోనూ    భారతీయ రాజులలో అగ్రగన్యుడైన శివాజీ  తనకంటూ ఒక మంత్రి మండలి, విదేశాంగ విధానం, ప్రతిష్టమైనటువంటి గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా  ప్రతిష్టమైన పాలనకు పునాది వేశాడు.  

నేడు పాలకుల కోసమే రాజ్యం అనే మాదిరి కాకుండా  ఆనాడు ప్ర జల కోసమే ప్రభువు అన్న సూత్రాన్ని పాటించి   వ్యక్తిగత కోరికలు, విలాసాలకు అవకాశమివ్వకుండా,  ప్రభుత్వ ధనాన్ని దుబా రా చేయకుండా,  ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తున్నది . అవసరానుగుణంగా అనేక యుద్ధాలు చేసినప్పటికీ ఎక్కడ కూడా పవిత్ర మతస్థలాలను ధ్వంసం చేయలేదు పైగా  యుద్ధంలో ఓడిపోయిన శత్రు రాజ్యపు స్త్రీలు వృద్ధులు పసిపిల్లలకు  సాయం చేసి చేరదీసిన మానవీయ  కోణం శివాజీలో స్పష్టంగా కనబడుతుంది.  అన్ని మతాలకు అనుకూలంగా   గౌరవించబడిన పాలకునిగా  కొనసాగుతూనే  ముస్లిం వర్గాలకు  వ్యతిరేకంగా అనేక  తిరుగుబాట్లు  చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలకు తగిన ప్రాధాన్యత  ఇచ్చిన తీరు  పాలనా చతురతకు మచ్చుతునక.  పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడడమే కాకుండా  మత సంస్థలైన మసీదులను నిర్మించి   సమానత్వాన్ని చాటిన తీరు ఆ పూర్వం.  నిబద్ధతతో ప్రజలకు సేవ చేయడం,  పాలనా వృత్తి పట్ల అంకితభావంతో  పనిచేయడం ద్వారా మచ్చ లేని వ్యక్తిత్వాన్ని మూటగట్టుకున్నాడు.  విదేశీయులు స్వదేశీయులు భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ  ప్రజల దైనందిన అవసరాలను గుర్తించడం ద్వారా  సామాన్యుల స్థాయిలో ఆలోచించి  సమతూకాన్ని ప్రదర్శించే గొప్ప రాజుగా  నిలిచినాడు అనడంలో సందేహం లేదు.


పాలనా విభాగాలు--  మతసామరస్యం


ఆధునిక కాలంలో మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం  రాజకీయ పార్టీలు చేస్తుంటే  మానవత్వం పునాదిగా  లౌకిక తత్వాన్ని ప్రదర్శించి  ఇష్టమున్న మతాన్ని పాటించే స్వేచ్ఛ స్వాతంత్రాలను కట్టబెట్టిన  ధోరణి శివాజీ పాలనలో చూడవచ్చు . కేవలం గుడులు గోపురాలే కాకుండా ముస్లింలకు సంబంధించిన మసీదుల కట్టించడంతోపాటు  తన సైన్యంలో 3వంతుల మందిని ముస్లింలని తీసుకోవడం , ఉన్నత పదవులలో ముస్లిములనే నియమించడం  గమ్మత్తైన విషయం.  ఉదాహరణకు హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీంఖాన్ నావికాదళానికి, సిద్ధి ఇబ్రహీం మందు గుండు విభాగానికి అధ్యక్షులుగా పనిచేయడం  కాకతాళీయమే అయినా  మతం కంటే మిన్న గా సమర్థతకే అవకాశం ఇచ్చినట్లు కాదా!  ఇక శివాజీకి సర్వసైన సైన్యాధ్యక్షులు  దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు కూడా ముస్లింలే కావడం,  శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యుడు కూడా  ముస్లిం కావడం  మతసామరస్యానికి  పరాకాష్ట. పటిష్టమైన నౌకాదళం తో పాటు అశ్విక దళాన్ని కూడా ఏర్పాటు చేయడం,  ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలల పాటు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా  పాలనలో పాలుపంచుకోవడం  అనే అంశాలు శివాజీ విధానాలకు అద్దం పడుతున్నాయి.  

సైనికులు మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా తమ యొక్క ఆస్తిపాస్తులు కోటలను సామ్రాజ్యాన్ని రక్షించుకోవడంలో  బాధ్యతాయుతంగా వ్యవహరించినారంటే వారికి సారథ్యం వహించినటువంటి శివాజీ యొక్క ఆదర్శ భావాలు, నాయకత్వ పటిమ  ఎంతో గొప్పది . 1680 ఏప్రిల్ మూడవ తేదీన మరణించే నాటికి  ఎక్కడా రాజీ పడకుండా  శత్రువులందరూ  వెనకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారుచేసి  స్వతంత్ర రాజ్యం అంటే ఇలా ఉండాలి అని  రుజువు చేసినాడంటే  పాలన పటిమ,  ఆయన జీవితం,  అనుభవం సార్థకమైనట్లే కదా ! .ఆయన మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి అంటే  కొండల పైన ఉన్నటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి స్థాయిలో సాంకేతిక విలువలతో కోటలను నిర్మింప చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతి  పొందినాడు అనడంలో సందేహం లేదు . ఒక అంచనా ప్రకారం గా  మహారాష్ట్రలోని నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిమీ. మధ్యన ఈ 300 కోటలు  ఉన్నట్లు  తెలుస్తున్నది.

 "నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో  అణచివేత, పీడన, వంచన కొనసాగుతూ ఉంటే  చట్టసభలలో నేరస్తులు నేర చరిత్ర కలిగిన వాళ్లు  మెజారిటీగా ఉన్నట్లు ప్రభుత్వ సంస్థలే తెలియజేస్తున్న సందర్భంలో  నేరం రుజువు కాకుండానే ఆరోపించబడిన సామాన్యులు బుద్ధి జీవులు మేధావులు  శిక్ష అనుభవిస్తూ అకాల మృత్యువుకు  బలవుతున్నటువంటి తరుణంలో  ప్రజాస్వామిక రీతిలో పాలించినటువంటి శివాజీ పాలనను  నేటి పరిపాలనతో పోల్చుకోకపోతే ఎలా? " అది ప్రజలకు పాలకులకు కూడా  ఆదర్శం కావాలి, అవసరమైన చోట కనువిప్పుగా  మారాల్సిన అవసరం కూడా ఉంది . మాటలతో మభ్యపెట్టి  ప్రపంచంతోనే పోటీ అనడం కాదు  చేతల్లో  ఆచరణలో కనపడాలి . శివాజీ పాలనను మించి  సమర్థవంతమైన పాలన కొనసాగితే  ఆయన గురువు సమర్థ రామదాసు సాక్షిగా   నేటి ప్రజాస్వామ్యాన్ని మనమందరం  అంగీకరించాల్సిందే.  అయితే ఆ రకమైనటువంటి   విలువల కోసమే  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అనాదిగా చేస్తున్న పోరాటం  ప్రజల ఆకాంక్షలు నెరవేరితే అంతకుమించిన ఆనందం ఏముంటుంది.?


(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333