చరిత్ర నిర్మాతల దేశ ప్రజలు స్మరించుకోవడమే కాదు ఆదర్శంగా తీసుకొని కర్తవ్య నిర్వహణలో భాగస్వాములు కావాలి.
చరిత్ర నిర్మాతల దేశ ప్రజలు స్మరించుకోవడమే కాదు ఆదర్శంగా తీసుకొని కర్తవ్య నిర్వహణలో భాగస్వాములు కావాలి.
ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత మ్యాగ్జి0 గోర్కి అభిప్రాయములో చరిత్ర, సంస్కృతి నిర్మాతలు ఎవరు ?పరిశీలిద్దాం !
---వడ్డేపల్లి మల్లేశం
ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే చారిత్రక సత్యాన్ని పాలకులు ఇతర పెట్టుబడిదారీ వ్యవస్థతో పోల్చుకున్నప్పుడు ప్రస్తావించిన అంశం కానీ సమాజంలోని విభిన్న వర్గాలను గనుక అంచనా వేసినప్పుడు స్వార్థం లేకుండా ఈ వ్యవస్థ కోసం తమ జీవితాలను త్యాగం చేసి మెరుగైన జీవన గమనం వైపు తీసుకు వెళ్లడానికి దృష్టి సారించే మూడు వర్గాల వాళ్ళు నిజమైన చరిత్ర నిర్మాతలని ప్రముఖ రష్యన్ రచయిత చరిత్రకారుడు నాటక కర్త గో ర్కి అంటాడు. వారివారి త్యాగాలను మనం ఆ స్థాయిలో గుర్తించకుండా వాళ్లు పోషిస్తున్న పాత్రను అంచనా వేసి ఆరాధించకుండా మౌనంగా ఉంటే అందరినీ ఒకే గాటన కడితే అర్థం ఏముంటుంది? ప్రజలందరూ సమానమే అనడంలో సందేహం లేదు కానీ కొంతమంది చరిత్రను నిర్మించడానికి దేశం కోసం ప్రజాసేవ కోసమే జన్మిస్తారు మరణిస్తారు . అలాంటి మూడు వర్గాల సేవలను, త్యాగాలను గుర్తించడం ఆదర్శంగా తీసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి కూడా తనకంటూ స్థానాన్ని పదిల పరుచుకోవడం కోసం ఈ సందర్భం తోడ్పడాలి .
.1863లో రష్యాలో జన్మించినటువంటి అలెక్సి మాక్సిమో విచ్ పేషోవు ప్రముఖ రచయిత నాటక కర్త మేధావి రాజకీయ నిపుణుడు. వాడుకలో మాత్రం మాక్సిo గోర్కీ ప్రపంచ ప్రజలందరికీ తెలుసు గోర్కీ అంటే రష్యన్ భాషలో చేదు అని అర్థమట. జీవితానికి సంబంధించిన కష్టాలు కన్నీళ్లు సమస్యలు చేదుగా ఉంటాయని తన అనుభవాలు జ్ఞాపకాలే సాహిత్యంగా ప్రపంచ ప్రజానీకానికి అందించినాడు కనుక పూర్తిగా ఆ పేరు స్థిరపడ్డట్టు తెలుస్తున్నది . సామాజిక రాజకీయ సాహిత్యాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేస్తూనే తమ జీవిత అనుభవాల ఆధారంగా సాహిత్యాన్ని సృష్టించిన మ్యాగ్జిo గోర్కి రచించిన ప్రసిద్ధిగాంచిన "అమ్మ" నవల ప్రపంచానికి అందరికీ తెలుసు. అలాగే "మై చైల్డ్హుడ్" పేరుతో రాసిన రచనలే కాకుండా పేదరికం కష్టాలు కన్నీళ్ల ప్రాతిపదికన సాగిన తన రచనలు ప్రపంచ భాషల్లోకి అనువదించబడినవ ని తెలుస్తున్నది. రష్యా విప్లవం ప్రారంభమైన తొలినాళ్లలో స్టాలిన్ లెనిన్లను సమర్థించినప్పటికీ ఆ నంతర కాలంలో ఆదిపత్యం అనచి వేతను నిరసించా డని చరిత్ర ద్వారా అర్థమవుతున్నది అంటే పాలకులు ఎవరైనా ప్రజల పక్షాన నిలబడి భరోసా ఇచ్చిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. అంతేకాదు సాహిత్యకారులు ఎవరైనా కూడా ప్రజల పక్షాన నిలబడి అవసరమైతే పాలకులతో యుద్ధం చేయాలనేది కూడా వారి అనుభవం ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంది .
చరిత్ర సంస్కృతి నిర్మాతలు మూడు వర్గాలు
ప్రజా సంస్కృతికి ఆనవాలుగా, సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేవారుగా, భవిష్యత్తు తరాలకు వారసత్వాన్ని అందించే సమాజంలో క్రియాశీలక స్థానంలో ఉన్న మూడు వర్గాలను ప్రధానంగా గోర్కీ నొక్కి చెబుతూ వీళ్లే సంస్కృతి చరిత్ర నిర్మాతలని సగర్వంగా చాటి చెప్పడం మన అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా ఆ వైపుగా దృష్టి సారించి నిపుణులుగా తయారు కావడానికి, ఆ వర్గాల పట్ల గౌరవ మర్యాదలు సానుభూతి ప్రదర్శించడానికి, సమాజ నిర్మాణ క్రమంలో ఆ వర్గాలు పోషిస్తున్న పాత్రను అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రతి వ్యక్తి కూడా తన దేశం పట్ల, ప్రజల పట్ల , ప్రజా విశ్వాసాన్ని చూర గొన్న చారీత్ర క కర్తవ్యాలు నిర్వహిస్తున్న వర్గాల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంటుంది .
1) కార్మికులు :-
సంపదను ఉత్పత్తి చేయడం , సంపదను పంపిణీ చేయడం, మట్టి నుండి మాణిక్యాలను తీయడం , తెల్లని మల్లె పువ్వు లాంటి మెతుకులను ప్రజల పళ్లెంలో పోసి కడుపు నింపడం , మేడలు మిద్దెలు కట్టేవాళ్ళు , ఉత్పత్తి రంగంలో క్రియాశీలక పాత్ర పోషించే శ్రామికులు, రైతులు, కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, దినసరి కూలీలు పని ఏదైనా గౌరవంగా కార్మిక వర్గం పోషించే పాత్ర అమోఘమైనది. " ముడి సరుకులు, పెట్టుబడి ,మూలధనం ఎంత ఉన్నా ఉత్పత్తి జరగాలంటే కార్మికులు అగ్ర భాగాన నిలబడాల్సిందే. త్యాగాలకు వె రవకుండా, ప్రమాదాలకు జంకకుండా, దేశం పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించవలసిందే . అనేక ఇబ్బందులు ప్రమాదాలు సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ అని తెలిసి కూడా అధిగమించే స్థాయిలో ఉత్పత్తులు పెంచడానికి అహర్నిశలు అరాటపడుతున్నటువంటి కార్మిక సోదర సోదరీ వర్గాల పట్ల మనకు గౌరవము మర్యాద సానుభూతి తప్పకుండా ఉండాలి .
అది మన కనీస బాధ్యత మన కనీస అవసరాలు తీరడానికి కార్మికులే ప్రధానం అంటాడు మ్యాగ్జిమ్ గోర్కి." ఇదే అనుభవంతో కార్మికుల పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ నినదించి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపి చరిత్ర సృష్టించిన జర్మనీ ఆర్థికవేత్త సామాజికవేత్త మానవతావాది మార్క్స్ బాటలో నడిచిన మాక్సిo గోర్కీ కూడా ప్రపంచ మానవాళి మనుగడకు ఆధారం శ్రామికులని గుర్తించినారు అనడంలో సందేహం లేదు. తమ రక్తాన్ని పెట్టుబడిగా ప్రాజెక్టులు కట్టి, నిర్మాణాలు చేపట్టి , ఊహకు అందని స్థాయిలో ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో క్రియాశీలక పాత్ర పోషించే కార్మికులు నేడు గౌరవించబడకపోగా చులకనగా చూడబడడం చాలా బాధాకరం. వారి ఉత్పత్తి శక్తి, ప్రతిభ, శ్రమశక్తి సమాజం గుర్తించాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. ఆ సంస్కారం నేర్చుకోవాలి కూడా.
2) శాస్త్రవేత్తలు :-
భారతదేశంలో వివిధ రంగాలకు సంబంధించి పరిశీలన, ప్రయోగాలు, పరిశోధనా రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు తగిన ప్రోత్సాహం లేని కారణంగా ఇతర దేశాలకు వలసబోతున్నట్లుగా అనేక విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ భారత దేశంలో ఇప్పటికీ అనేక మంది శాస్త్రవేత్తలు తమ శక్తి యుక్తులను ధారబోసి తమ జీవిత కాలాన్ని వెచ్చించి కుటుంబం వైపు కూడా దృష్టి సారించకుండా ఉన్న సందర్భాలు అనేకం . మాజీ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు తనకంటూ వ్యక్తిగత జీవితం లేకుండా వ్యవస్థ కోసం పనిచేసిన తీరు మనందరికీ తెలుసు . అలాంటి శాస్త్రవేత్తలు భారత దేశంలో కోకొల్లలు విభిన్న రంగాలలో పనిచేసి ఆర్థిక సామాజిక సాహిత్య సాంస్కృతిక శాస్త్రీయ రంగాలను బలోపేతం చేసినది తెలియదా? శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి వాటిని కొనసాగిస్తూ ఇతర దేశాలతో పోటీపడుతూ నూతన ఆవిష్కరణలకు జీవం పోసిన శాస్త్రవేత్తలను స్మరించి గౌరవించకపోతే, కృషిని ఆరాధించకపోతే మనకు సంస్కారం లేనట్లే .
భారతదేశంలో శాస్త్రవేత్తలు పరిశోధకులకు కొదవలేదు కావాల్సింది పాలకులకు శాస్త్రీయ రంగాలను అభివృద్ధి వైపు తీసుకువెళ్లడంలో పట్టుదల, అందుకు వివిధ రంగాలలో ఎదిగిన శాస్త్రవేత్తల వినియోగించుకోవడం, ప్రోత్సహించడం, వారికి తగినటువంటి వసతులు కల్పించడం ద్వారా గుర్తింపు ఇవ్వడం తప్ప వాళ్ళు ఆశించేది ఏమీ లేదు.
అది ప్రభుత్వాల యొక్క సామాజిక రాజకీయ బాధ్యత కూడా . తద్వారా అనేక రంగాలలో ప్రపంచంలో ఇతర దేశాలతో పోటీపడే స్థాయిలో నిలబడడానికి, శత్రుదేశాలు గజగజ వనికి తలవంచుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పాకిస్తాన్ ఇతర దేశాల పట్ల మన సైనికులు ప్రదర్శించినటువంటి నైపుణ్యం మనందరికీ గుర్తుండే ఉంటుంది. " భయంకరమైన రోగాలకు మందులను, చికిత్సను ఆవిష్కరించడం, శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక రకాల ఉత్పత్తులను సాధించే క్రమంలో విప్లవాత్మకమైనటువంటి నూతన పరికల్పనలను సృష్టించడం, వివిధ రంగాల్లో ఎదుర్కొంటున్నటువంటి సవాలను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడంలో శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తారు. వాళ్లను ప్రోత్సహిస్తే వారి కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తే తమను తాము మరిచి కూడా దేశం కోసం సిద్ధపడతారని పాలకులు గుర్తించాలి".
3) సాహిత్యకారులు
"సమాజం యొక్క హితాన్ని కోరేది మాత్రమే కాదు ఆ హితాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే సంఘ వ్యతిరేక శక్తుల పైన పోరాటం చేసి సమాజాన్ని సంస్కరించేదే నేడు సాహిత్యం అనబడుతుంది ." అంతటి ఉత్కృష్టమైన పాత్ర పోషించే సాహిత్య రంగంలో పనిచేస్తున్న కవులు కళాకారులు మేధావులు రచయితలు విమర్శకులు విశ్లేషకులు అందరూ కూడా సమాజం యొక్క మనుగడను ఆరాధించి అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్న వారే. వాళ్ల ఆలోచనలను, అంతరంగాన్ని గుర్తించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపైన ఉంటుంది. అంతేకాదు రచయితలు కవులు కళాకారులు సాహిత్య కారులు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పని చేస్తారు అనడంలో సందేహం లేదు." అవసరమైతే ప్రజల హక్కులను వివిధ వర్గాల డిమాండ్లను రక్షించే విషయంలో ప్రజల పక్షాన పోరాటంలో ముందుంటార నడంలో సందేహం లేదు. అలాంటి చారిత్రక సంఘటనలు, సందర్భాలు మనకు ప్రపంచంలో ఎన్నో కనపడతాయి కూడా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సాహిత్య రంగం పాత్ర చాలా గొప్పది. దశాబ్దాలుగా కవులు రచయితలు కళాకారుల యొక్క కృషి రాజకీయ పోరాటానికి తోడుగా తమ వంతు పోషించిన పాత్రను ప్రపంచం గర్వంగా చాటి చెప్పుకుంటున్నది.
."వివిధ రకాల సామాజిక రుగ్మతలను ఎత్తిచూపడం , సమాజానికి హాని చేసే ప్రభుత్వ విధానాలను విమర్శించడం, పెట్టుబడిదారీ విధానానికి వంత పాడుతూ ప్రజలను బానిసలుగా తయారు చేస్తున్న ప్రభుత్వ పాలసీని మార్చుకోవాలని హెచ్చరించడం కూడా ఈనాడు సాహిత్యకారుల వంతు అయినది అనడంలో సందేహం లేదు . కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి రచయిత అని శ్రీశ్రీ అoటీ సమాజం మనగడకు ద్రోహం తలపెట్టే ఏ వర్గం పట్లనైనా కఠిన వైఖరి అవలంబించి అవసరమైతే యుద్ధం చేయడానికి సిద్ధపడే వాళ్లే సాహిత్యకారులు అని గోర్కీ వాదనతో చెప్పకనే చెప్పినట్టు అయినది. ఎందుకంటే తను స్వయంగా రచయితగా సామాజిక పేద అట్టడుగు వర్గాల పక్షపాతిగా పనిచేసి తన స్వానుభవాన్ని కూడా సాహిత్యంలో రంగరించి సాహిత్యానికి వన్నెతెచ్చి ప్రపంచస్థాయి వ్యక్తిగా స్థిరపడ్డది అందరికీ తెలుసు.
సాహిత్యంలో తను చేసినటువంటి కృషికి ఐదు సార్లు రష్యా ప్రభుత్వo నోబుల్ బహుమతికి సిఫారసు చేయబడినప్పటికీ ఎవరి తప్పిదమో ? అనేక కారణాల వళ్లనో కానీ అతనికి ఆ బహుమతి మాత్రం ప్రధానం జరగలేదని తెలుస్తున్నది. ప్రపంచ ప్రజలందరూ ఆదరించిన మాక్సిం గోర్కీ కి నోబుల్ బహుమతి సాహిత్య రంగంలో వస్తేనే గుర్తింపు ఉంటుందా? ప్రజల గుర్తింపు అంతకుమించిన స్థాయిలో ఉంటుంది అని చెప్పడానికి ఆయన జీవితం, సాహిత్య దృక్పథం, సామాజిక చింతన పెద్ద ఉదాహరణ కాదంటారా?
"గోర్కి వాదన ప్రకారం సాహిత్యకారులు శాస్త్రవేత్తలు కార్మికులు ఒక దేశం మనగడలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని హెచ్చరించిన తీరులో ఎంతో సత్యము ఉంది. ప్రజలుగా ప్రజాస్వామిక వాదులుగా సమాజ పరిణతి గురించి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఈ విశ్లేషణలోని వాస్తవాలను గుర్తించడం ద్వారా మనం ఆ వర్గాలను ఆదర్శంగా తీసుకోవడంతో పాటు మన విశ్లేషణ మన ఆదర్శ జీవన విధానం ద్వారా రాబోయే తరాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గుర్తింప చేయడమే ముందున్న పెద్ద సవాల్. ఆ సవాల్ ఒక రకంగా గోర్కీ మన ముందు ఉంచినాడు అనడంలో సందేహం లేదు".
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)