యాదవ్ ల కంచుకోటలో బీహార్ సీఎం నితీశ్ కు పరిక్ష..! 

May 6, 2024 - 20:02
 0  5
యాదవ్ ల కంచుకోటలో బీహార్ సీఎం నితీశ్ కు పరిక్ష..! 

బిహార్‌లో ఆ నియోజకవర్గం యాదవ్‌ల కంచుకోట. అక్కడ 1967 నుంచి యాదవేతరులు ఒక్కసారి కూడా గెలవలేదు. గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్‌ యాదవ్‌ నేతృత్వం వహించిన ఈ స్థానం..

ప్రస్తుతం బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు రాజకీయ పరీక్షగా నిలవనుంది. అదే మాధేపుర నియోజకవర్గం.

ఒకప్పుడు ఆర్జేడీకి కంచుకోట..

ఈ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా.. దాదాపు 5 లక్షల మంది యాదవ్‌లు, రెండు లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉండేది. 2009లో లాలూ యాదవ్‌ పక్కకు తప్పుకోవడంతో అది మారిపోయింది. అయితే.. 2014లో మోదీ సునామీలో కూడా ఈ స్థానాన్ని ఆర్జేడీ తిరిగి కైవసం చేసుకుంది. 2019లో మోదీ ఫ్యాక్టర్‌ కారణంగా యాదవ్‌ ఓటర్లు జేడీయూ అభ్యర్థి దినేశ్‌ యాదవ్‌వైపు నిలవడంతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయనే మరోసారి ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు.

నీతీశ్‌కు పరీక్ష ఎందుకంటే..?

ఈ నియోజకవర్గంలో విజయం నీతీశ్‌ నాయకత్వానికి పరీక్షగా మారింది. సిటింగ్‌ ఎంపీగా ఉన్న దినేశ్‌ యాదవ్‌పై వ్యతిరేకత ఉందని.. ఆయనకు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదని భాజపా నేతలు చెబుతున్నారు. మోదీ ఆదరణ, రాజ్‌పుత్‌లు, ఓబీసీల మద్దతు భాజపాకు ఉన్నప్పటికీ.. యాదవ్‌ల నుంచి వ్యతిరేకత ఇక్కడ ఎన్‌డీఏ కూటమికి నష్టం కలిగించొచ్చని కమలం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఇక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకోవడం బిహార్‌ సీఎంకు పరీక్షగా మారింది. తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో మద్దతు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

''ఇక్కడ యాదవ్‌లు ఎక్కువ. వారంతా ఒకప్పుడు ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ.. 2009లో నీతీశ్‌ కుమార్‌కు ఉన్న ఆదరణతో జేడీయూ అభ్యర్థిగా శరద్‌ యాదవ్‌ గెలుపొందారు. 2019లో మోదీ పాపులారిటీతో దినేశ్‌ యాదవ్‌ విజయం సాధించారు. అయితే.. అప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. మంచి అడ్మినిస్ట్రేటర్‌ అనే ఇమేజ్‌ నీతీశ్‌కు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందా?'' అనేదే ఇక్కడ ప్రశ్న అని ఓ భాజపా నేత పేర్కొన్నారు. అందుకే ఈ స్థానంలో విజయం బిహార్‌ సీఎంకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ ఆర్జేడీ నుంచి కుమార్‌ చంద్రదీప్‌ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మూడో విడతలో భాగంగా మే7న పోలింగ్‌ జరగనుంది.

2019లో మొత్తం 40 సీట్లలో 39 గెలుచుకున్న ఎన్‌డీఏ కూటమి ఇప్పుడు గంగా నదికి దక్షిణ ప్రాంతంలో, రాష్ట్రంలో ఉత్తర భాగాన ఉన్న ప్రాంతాల్లో ఇండియా కూటమి మహాగఠ్‌బంధన్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333