మల్దకల్ లో మడివాల మాచిదేవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు
జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వెనుక భాగంలో రజక కులస్తుల గురువైన మడివాల మాచిదేవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాచి దేవ స్వామి, ఈశ్వర, నంది, గణపతి దేవతామూర్తుల ప్రతిష్టాపన కార్యక్రమం సహస్రాధిక (1037) విగ్రహాల ప్రతిష్టాపన ఆచార్యులు రమేషాచార్య ఆధ్వర్యంలో ఉదయం పతాకావిష్కరణ, గణపతి పూజ, పుణ్యావాచనము, గోపూజ, యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టా, హోమములు, జలాధివాసము, మంగళహారతి నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు దంపతులు పాల్గొని వారి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో సత్య చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 21 బుధవారం ఉదయం సర్వతో భద్రమండపం, చతుర్లింగ మంటపం, గణపతి మండపం, సకల దేవతల దోష నివారణ హోమం, ధాన్యాదివాసం, పుష్యశయ్యాధివాసం జరుగుతాయని తెలిపారు. గురువారం ఉదయం 3:55 గంటలకు యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రాణ ప్రతిష్టలు జరుగుతాయని, అనంతరం పూర్ణాహుతి బలిహరణం దర్పణం, కుంభ దర్శనం, తీర్థప్రసాదాలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోనే మాచి దేవస్వామి విగ్రహ ప్రతిష్ట మొదటిదని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరవుతారని మల్దకల్ గ్రామ రజక సంఘం నిర్వాహకులు తెలిపారు.