మట్టి గణేష్ విగ్రహాలను ఉపయోగించి ప్రకృతిని కాపాడుకుందాం:జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.
గద్వాల:-మట్టి గణేష్ విగ్రహాలను ఉపయోగించి, ప్రకృతిని కాపాడటంలో ప్రజలందరూ తమ వంతు భాద్యతగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు.సోమవారం ఐ.డి.ఓ.సి కలెక్టర్ ఛాంబర్ నందు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) గణేష్ విగ్రహాలలో అధికంగా రసాయనాలు ఉండడం వల్ల, ఇవి పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయని అన్నారు.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని అన్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పీవోపీ గణేష్ విగ్రహాలకంటే మన రాష్ట్రములో తయారు చేయబడే మట్టి గణపతులు పర్యావరణానికి మంచిదని, వాటి వల్ల చెరువులు, సరస్సులు కాలుష్యం కాకుండా ఉంటాయని తెలిపారు. వినాయక చవితిని పర్యావరణ హిత పండుగగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ ఏడాది తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి 8 అంగుళాల మట్టి గణపతి విగ్రహాలను అందిచి,పర్యావణం పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శనలు ఆటోట్రాలీల ద్వారా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు, కళా జాత పోషకుల నిర్వహణ మరియు పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్ పోటీలు నిర్వహించడంతో పాటు, చేతివృత్తుల వారికి మట్టి విగ్రహాలు తయారీపై శిక్షణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసులు, ఆర్.డి.ఓ రామ్ చందర్, ఎ.ఓ వీర భద్రప్ప, సి సెక్షన్ సూపరింటెండెంట్ నరేష్, కాలుష్య నియంత్రణ మండలి మీడియా కో -ఆర్డినేటర్ సోమేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు...