భగత్ సింగ్ ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
ఏఐవైఎఫ్ జిల్లా మాజీ నాయకులు దంతాల రాంబాబు
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి
అతి పిన్న వయసులో దేశ స్వాతంత్రం కొరకు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రాణాన్ని సైతం తృణపాయంగా త్యజించి దాస్య శృంఖలాల భారత మాత విముక్తి కొరకై అసువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా మాజీ నాయకులు దంతాల రాంబాబు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్మభిక్షం భవన్ లో భగత్ సింగ్ 93వ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా బ్రిటీష్ ప్రభుత్వం చేతిలో పాశవికంగా 1931 మార్చి23 న ఉరితీయబడ్డారని గుర్తు చేశారు. వారి ఆశయాలను కొనసాగించేందుకు యువత ముందుకు రావాలని అవినీతికి వ్యతిరేకంగా ఏవైఎఫ్ సమరశీల ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాద శక్తులను ఓడించేందుకు యువత సిద్ధం కావాలని కోరారు. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న ఆధునిక కాలంలో యువత పెడదారిన పడుతున్నారని యువత పెడదారిన పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ నాయకులు చామల అశోక్, బూర వెంకటేశ్వర్లు, నిమ్మల ప్రభాకర్, ఐతగాని కామేష్, బూర సైదులు, తాళ్ల సైదులు, నవీన్, రెడ్డి మల్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు