బీసీలకు అన్ని రంగాలలో జనాభా దామాషాలో పదవులు దక్కాలి

తెలంగాణలో కుల గణన ప్రారంభించినట్లు దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహించి అమలు చేయాలి. సాహు మహారాజును కేంద్రం రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లు అమలు చేసేలా బీసీ ఉద్యమాలను తీవ్రతరం చేయాలి.
వడ్డేపల్లి మల్లేశం 09...11...2024
2020 సంవత్సరంలో గృహ గణన తో పాటు 2021 వ సంవత్సరంలో జనగణన దేశవ్యాప్తంగా పూర్తి చేయవలసిన కేంద్ర ప్రభుత్వం కారణాలు ఏమైతేనేమి దాటవేత ధోరణి అవలంబించి నాలుగు సంవత్సరాలు కాలయాపన చేసిన విషయం మనందరికీ తెలుసు. 1931లో ఆంగ్లేయుల కాలంలో కుల గణన చేస్తే అప్పటినుండి తిరిగి ఇప్పటివరకు కూడా కుల గణన చేయకపోవడంతో బీసీ జనాభా ఎంత ఉందో తెలియని ఒక ఆందోళనకర పరిస్థితుల్లో బీసీలు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘాలు గత ఐదారు సంవత్సరాలుగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ స్పందించలేదు. సర్వోన్నత న్యాయస్థానం కూడా అభిప్రాయాన్ని తెలుపమని కేంద్రాన్ని అడిగినప్పుడు కులగనన కులతత్వాన్ని పెంచి పోషిస్తుందని తీయటి కబుర్లతో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడమంటే ఈ దేశంలో ఆధిపత్య కులాల దోపిడి, పాలన ఏరకంగా కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. దేశంలో బీసీ జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలిస్తే కానీ అందుకు తగిన ప్రణాళికలు రూపొందించడానికి ఆస్కారం ఉండదు అంతేకాదు ఈ దేశంలో రిజర్వేషన్లను 50 శాతానికి కుదించిన కారణంగా సుమారు 50 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు 1990లో విపి సింగ్ ప్రధానిగా వున్నకాలంలో 27% మాత్రమే పరిమితం చేస్తే ప్రస్తుతము ఆమాత్రం కూడా నోచుకోకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో అతి తక్కువ స్థాయిలో రిజర్వేషన్ ఇవ్వడాన్ని ప్రశ్నించిన తెలంగాణ సమాజానికి ఎన్నికల సమయంలో ఆనాటి పీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42 శాతం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన నవంబర్ ఆరవ తేదీన ప్రారంభించడం ఈ నెలాఖరు నా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం కూడా జరిగింది . 19o2 సంవత్సరంలో కొల్లాపూర్ సంస్థాన రాజు సాహు మహారాజ్ వెనుకబడిన తరగతుల వారికి 50 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ ఉద్యోగాలతో సహా అన్ని రంగాలలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని గమనిస్తే నేటి పాలకులకు ఆమాత్రం కూడా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారా? అని అనిపించక మానదు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలకు పూర్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు అనే పేరుతో అగ్రవర్ణాలలోని పేదల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్ పేరున రిజర్వేషన్లను అగ మేఘాల మీద ఆమోదించి అమలు చేస్తున్నది అంటే బీసీ వర్గానికి చెందిన ప్రధాని అని చెప్పుకున్నప్పటికీ కులగనన తో సహా ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు కానీ అగ్రవర్ణాల కోసం మాత్రం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే 50% దాటినట్లే కదా !ఇటీవల దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పోటీ పరీక్షలు ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాల సందర్భంగా గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీలు బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఉద్యోగాలు రావడాన్నీ గమనించినప్పుడు రిజర్వేషన్ వ్యవస్థ ఎంత అద్వాన్న స్థితిలో అమలవుతున్నదో తెలుసుకోవచ్చు. అసలు దేశంలో 10 శాతం కూడా లేనటువంటి అగ్రవర్ణాల వారిలో పేదలు కనీసం రెండు నుండి మూడు శాతం ఉంటే మహా ఎక్కువ . అలాంటి పరిస్థితులు అగ్రవర్ణ పేదల కంటూ 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడం అంటే చట్టాన్ని న్యాయాన్ని ఉల్లంఘించడమే పరోక్షంగా ఆధిపత్య వర్గాల యొక్క అధికారాన్ని శాశ్వతం చేయడమే అవుతుంది.
గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ జనగణన చేసి ఉద్యోగాలు ఇతర అన్ని రంగాలలో కూడా జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ బీసీ సంఘాల పోరాటాన్ని నీరుగార్చు తున్నారే తప్ప స్పందించిన దాఖలా లేదు. జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించి పథకాలు రచించడం కానీ ప్రణాళికలు రూపొందించడం కానీ వారి భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేయడంతో పాటు రాజ్యాధికారంలో వాటాను ఇవ్వడం కానీ చేయకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని గొప్పలు చెప్పుకోవడం అంటే బీసీ వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే, కేవలం ఓటు బ్యాంకుగా మలుచుకోవడమే అవుతుంది .
ముఖ్యంగా బీసీ కులాలు ఉత్పత్తిలోనూ వ్యవసాయ ,సేవా, శ్రామిక రంగాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ దేశ ఆర్థిక స్థితిగతులను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ నాయకత్వ స్థానాలలోకి రాకుండా అడ్డుకోవడం వలన ఆదిపత్య కులాలు పెట్టుబడిదారుల చేతుల్లోపల అధికారం ఉన్నంతకాలం బీసీలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోతున్నారు. అధికారం కోసం పోరాటం చేస్తుంటే కులతత్వం పెరిగిపోతుందని వక్ర భాష్యం చెప్పడం అంటే
ఆదిపత్య వర్గాలు వాస్తవాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఎవరు కులతత్వాన్ని ప్రదర్శిస్తున్నారు? ఎవరు ఆధిపత్య వర్గాలుగా నాయకత్వం వహిస్తున్నారు? ఎవరి చేతుల్లో పార్టీలు ఉన్నాయో వాళ్లు టిక్కెట్లు ఇచ్చే సమయంలో వాళ్ళ వర్గాలకే ఇవ్వడాన్నీ గమనించినప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లోపల ఆధిపత్య వర్గాలకు లొంగకుండా స్వతంత్రంగా రాజకీయాల్లోకి రావాలంటే చట్టసభల్లో రిజర్వేషన్లు అనివార్యమని నినదించి పోరాడవలసిన అవసరం మరింత ఎక్కువగా ఉన్నది. ఇటీవలి కాలంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యంగా కులగరణ గూర్చి ప్రస్తావించడం ముదావహం . అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగనన జరిపించి బిసి వర్గాలకు స్థానిక సంస్థలతో పాటు రేపు భవిష్యత్తులో చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించడానికి కృషి జరగాలని కోరుకోవడం అంటే బీసీ వర్గాల డిమాండ్తో ఏకీభవించడమే అవుతుంది. బీసీ వర్గాల డిమాండ్ ను ఏకీభవించనటువంటి రాజకీయ పార్టీలకు సమాధి కట్టడం , ప్రతిఘటించడం, ఎన్నికల్లో ఓటు వేయకుండా దిక్కరించడం వంటి పోరాట ఉద్యమాలకు శ్రీకారం చుడితే తప్ప ఈ దేశంలో పాలకులు ఆధిపత్య వర్గాలు చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు ఆమోదించడానికి ముందుకు రారు. కష్టపడే వాళ్ళు బీసీ ఉత్పత్తి కులాలు ఎక్కువగా ఉంటే అధికారం చలాయించేవాళ్లు ముఖ్యంగా ఉన్నత అధికార యంత్రాంగంలో కొనసాగుతున్న వాళ్లంతా కూడా ఆధిపత్య వర్గాలు అని తెలిసినప్పుడు ఈ వివక్షత ఎందుకు కొనసాగుతున్నది అని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేని పాలకవర్గాలు తప్పించుకోవడానికి కులగననను కోరితే కులతత్వం అని వక్ర భాష్యం చెప్పడం అంటే తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడమే కదా!
ఉత్పత్తి కులాలు చట్టసభల్లో పార్లమెంటులో అధికారంలో కొనసాగడంతో పాటు దేశ ప్రగతి రథచక్రాలను నడిపించగల సత్తా ఉన్న వర్గం బీసీలేనని సమాజం యావత్తు గుర్తించే కాలం రాబోతుంది. ఒక అంచనా ప్రకారం గా సుమారు 56% పైగా బీసీ వర్గాలు ఉన్నాయని చెబుతుంటే బీసీలకు పాలించే అర్హత లేదని కులతత్వం పెరిగిపోతుందని దాటవేస్తున్నారంటే వాళ్ళ పరిపాలన సమర్థతను ప్రజాస్వామిక రాజ్యాధికార ప్రతిభను అపహాస్యం చేయడమే అవుతుంది. బీసీలకు అధికారాన్ని ఇస్తారా లేక పదవి నుండి దిగిపోతారా అని బీసీ నినాదం సింహ గర్జన కావలసిన అవసరం ఎంతగానో ఉన్నది . "శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో" అన్నట్లు శ్రమచేసి ఉత్పత్తులు పెంచి సేవారంగంలో పని చేసే వాళ్లంతా ముఖ్యంగా బీసీ వర్గాలు అయితే ఆ సంపదతో సిరిని అనుభవించే వాళ్ళు ఆధిపత్య కులాల వాళ్ళు కావడం అసంబద్ధమైన అమానవీయ సన్నివేశంగా గుర్తించాలి . ప్రస్తుత దేశ పాలకులు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కుల జన గణన వెంటనే జరిపించి శాతాన్ని నిర్ధారణ చేసి ఆ మేరకు ప్రణాళికలు రచించడంతోపాటు చట్టసభలతో సహా విద్య ఉద్యోగ ఇతర అన్ని రంగాలలోనూ నిర్ధారిత జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించి నిర్లక్ష్యానికి గురవుతున్న ఒక వర్గం యొక్క ప్రతిభను రక్షించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ప్రాతినిధ్యాలు విజ్ఞప్తులు నిరసనలతో హక్కులను కాపాడుకునే సమయం దాటిపోయింది ఇక ప్రజా పోరాటమే మిగిలి ఉన్నది ." ఇంతకాలం అప్పనంగా అనుభవించినటువంటి రాజ్యాధికారాన్ని గమనించుకొని అధికారానికి దూరమై అద్భుతమైన ప్రతిభ కలిగినటువంటి బీసీ వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం సమంజసమని భావిస్తే మంచిది .లేకుంతె జరగబోయే పరిణామాలకు పాలకులు ఆది పత్య కులాలు బాధ్యత వహించవలసి ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)