ప్రభుత్వ భూముల కబ్జాపై తాసిల్దార్ యాక్షన్

Jun 25, 2026 - 20:07
 0  116
ప్రభుత్వ భూముల కబ్జాపై తాసిల్దార్ యాక్షన్
ప్రభుత్వ భూముల కబ్జాపై తాసిల్దార్ యాక్షన్

* ప్రభుత్వ భూముల ఆక్రమణలపై మండిపడిన రాజు మాదిగ.

* ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బోర్డులు తొలగించిన తాసిల్దార్ జ్యోతి.

 25 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ. మండల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా బోర్డులు ఏర్పాటు చేయడంపై అయిజ తాసిల్దార్ జ్యోతి తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని ఉత్తనూర్ రహదారిలో గల సర్వే నెంబర్ 56 లోని దాదాపు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి దున్ని, ఈ భూమి నాదేనంటూ బోర్డు పెట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే అదే రహదారిలోని సర్వే నెంబర్ 935, 936 లలో కూడా కొందరు అక్రమార్కులు చిన్న గుడిసెలు వేసి కబ్జాకు యత్నించారు. ఈ విషయాలపై మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) జిల్లా కన్వీనర్ వి. రాజు మాదిగ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కబ్జాల వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు భూములు దొరకవని, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఆక్రమణల ఉదంతంపై సమాచారం అందుకున్న వెంటనే అయిజ తాసిల్దార్ జ్యోతి తన సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణమే అక్కడి నుండి తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం, అమ్మడం లేదా కొనడం చట్టప్రకారం నేరమని, ఎవరైనా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ ఘాటుగా హెచ్చరించారు. ఆక్రమణలకు గురైన భూములకు త్వరలోనే మున్సిపల్ అధికారుల సహకారంతో సరిహద్దులు ఏర్పాటు చేసి, ఇవి ప్రభుత్వ ఆస్తులని తెలిపేలా బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. కబ్జాలపై తక్షణమే స్పందించి బోర్డులను తొలగించిన తాసిల్దార్ చర్య పట్ల అయిజ పట్టణ ప్రజలు మరియు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333