ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం ఎప్పుడో

Jun 11, 2024 - 20:37
 0  33
ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం ఎప్పుడో

సీఎం హామీ ఇచ్చినా...నో ప్రోగ్రెస్

దశాబ్దాల డిమాండ్.. ఎన్నికల ప్రచారంలో ఎజెండాకే పరిమితం

ఈ విద్యా సంవత్సరంలో అనుమానమే

పేద విద్యార్థులకు భారమైన ఇంటర్ విద్య 

తిరుమలగిరి 12 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

దశాబ్దాల కాలంగా అన్ని వర్గాల నుండి వస్తున్న డిమాండ్ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావడం అనుమానంగానే కనబడుతోంది. స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ ఎన్నికైన వెంటనే కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో పట్టరాని ఆనందం. ఇదంతా దాదాపు పార్లమెంటు ఎన్నికలు జరిగే ముందు నుండి జరుగుతున్న తంతు.

కానీ కళాశాల ఏర్పాటు “ఆలు లేదు..చూలు లేదు కొడుకు పేరు.... అనే సామెతగా మారింది.

     ఇక అసలు విషయానికి వస్తే.... కళాశాల మంజూరు చేస్తున్నట్లు స్వయంగా సీఎం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు వచ్చేసరికి అమలులో ముందడుగు లేదు. దీనికి సంబంధించిన జీవో కూడా నేటికీ విడుదల కాలేదు.ఈ పరిణామాలతో ఈ విద్యా సంవత్సరం నుండి తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు,ప్రారంభం అనేది సందిగ్ధంగానే మారింది.      తుంగతుర్తినియోజకవర్గంలో తిరుమలగిరి మండల కేంద్రం వ్యాపార,వాణిజ్య రంగాలతో పాటు విద్యారంగానికి కూడలిగా పేరుగాంచినది.దీనికి తోడు భౌగోళికంగా నాలుగు జిల్లాలకు సరిహద్దుల్లో జంక్షన్ స్థానంలో ఉండడంతో నిత్యం వేలాది మంది ప్రజలు,విద్యార్థులతో కిటకిటలాడుతుంది. అంతేకాకుండా గత దశాబ్ద కాలంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తుండడం గమనార్హం.అంతటి ప్రాముఖ్యత కలిగిన తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు నాలుగు దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోతుంది. జూనియర్ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో 1984లో ఆనాటి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ 40 ఏళ్ళ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు,ఎందరో ఎమ్మెల్యేలు మారారు. కానీ జూనియర్ కళాశాల ఏర్పాటు కాకపోగా ఈ అంశం అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా మాత్రం ఉపయోగపడిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల భారీ మెజారిటీతో గెలిచిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అసెంబ్లీ సమావేశాల్లో కాలేజీ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా నిర్మాణానికి హామీ ఇచ్చారు.అయితే ఇప్పటికీ ఫైల్ కదిలిందీ లేదు..జీవో వచ్చిందీ లేదని విద్యార్థి సంఘాలు,విద్యార్థులు పెదవి విరుస్తున్నారు.అయితే స్థానికంగా మాత్రం జూనియర్ కళాశాల మంజూరైనట్లు ప్రచారం జోరుగా జరిగింది. ఇక్కడ పాఠశాల విద్యాపరంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అరడజనుకు పైగా,ఇంటర్ విద్య కోసం రెండు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రైవేట్ ఐటీఐ కాలేజీలతో విద్యారంగంలో అగ్రభాగాన ఉన్న తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ విద్య పెనుభారంగా మారి, ఆ వర్గాలు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 లక్ష కోట్ల బడ్జెట్లో రెండు కాలేజీల నిర్మాణానికి నిధులే లేవా?: 

కడెం లింగయ్య, జీఎంపీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు

లక్ష కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్లో తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నూతనంగా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ నిర్మాణానికి నిధులే లేవా అని ప్రశ్నించారు.వెంటనే రెండు కాలేజీలు నిర్మించి పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ విద్యను అందుబాటులోకి తేవాలి.

 కాలేజీ మంజూరు కాగానే ఏర్పాటు చేస్తాం: కృష్ణయ్య డీఐఈఓ సూర్యాపేట 

తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రతిసారి ప్రతిపాదనలు పంపుతున్నాం.అనుమతులు రాగానే కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాము.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034