ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించాలి
ప్రజాస్వామ్య విలువల పట్ల పాలకులకు అవగాహన, సంస్కారం,
మానవీయ కోణంలో ఆలోచించే స్పృహ, లేకుంటే ప్రజలు తరిమికొడతారు..
కొత్త సర్కారు ప్రజా ప్రభుత్వంగా నిలబడాలంటే --2 .
---వడ్డేపల్లి మల్లేశం
రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక అప్ప ప్రజాస్వామిక విలువలపై తగిన స్థాయిలో విచారణ జరిపించాలి. అదే సందర్భంలో ప్రజాస్వామిక విలువలను రాష్ట్రంలో పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మరంగా కృషిచేసి ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు బుద్ధి జీవులు మానవ హక్కుల కార్యకర్తల మన్ననలు పొందాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా జరిగిన గత పాలన ఏ రకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నదో మనందరికీ తెలుసు. పరిపాలన స్థిరంగా సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజలకు అచ్చమైన ప్రజాస్వామ్య పరిపాలన అందించాలి. అందుకు పాలకులకు సంస్కారం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం, అవగాహన , మానవీయ కోణంలో ఆలోచించే స్పృహ తప్పనిసరిగా ఉండాలి . గత ప్రభుత్వం పోలీసు రాజ్యం, దోపిడి రాజ్యం ,దొంగల రాజ్యం, గుండాల రాజ్యాం, భూకబ్జాకోరుల తెలంగాణగా వున్న విషయం తెలిసిందే. దానికి భిన్నమైనటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరిపాలన తీసుకురావాలంటే స్వేచ్ఛ, స్వాతంత్రాలు, నిరసన, ప్రశ్న , ప్రతిఘటన, ప్రజల యొక్క మౌలిక హక్కులుగా పాలకులు గుర్తించగలగాలి. అందుకు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలన చేద్దాం.
ప్రజాస్వామ్యక విలువలు అంటే ఏమిటి ?
********
- గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర, కోల్పోయిన భూములకు పరిహారం అడిగినందుకు రైతులకు బేడీలు వేసి ప్రపంచ చరిత్ర సృష్టించింది . అందుకే అగాధములో కూరుకుపోయింది. అలాంటి అనాలోచిత చర్యలకు ఏ మాత్రం అవకాశం ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది .
---ప్రజా ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు, తమ హక్కులకై సాగే పోరాటాలకు ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి హక్కులను పరిరక్షించాలి సమస్యలను పరిష్కరించాలి .
--టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశద్రోహ చట్టం ఉపాచట్టాలు వంటి అనేక నల్ల చట్టాలను విప్లవకారులు ప్రజాస్వామిక సంస్థలు మానవ హక్కుల కార్యకర్తల పైన నిర్బంధంగా అమలు చేసిన సంగతి తెలుసు. ఈ చట్టాల రద్దు కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సర్కారు పైన పోరాటం చేసి రద్దు చేయించాలి. అయితే ఈ చట్టాలను తె చ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరిచిపోకూడదు.
--- విప్లవ సాహిత్యం కలిగి ఉన్నారని, విప్లవ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, సామాజిక మార్పుకు సంబంధించి భావజాలాన్ని కలిగి ఉన్నారనే నెపంతో అరెస్టులు నిర్బంధించడం వంటి చర్యలకు స్వస్తి పలకాలి. ఉత్తమ సాహిత్యం సమాజ పరిణామానికి దొ హదపడుతుందనే సంస్కారం పాలకులకు ఉండాలి. అదే సందర్భంలో రచయితలు కవులు కళాకారులు మేధావుల ఆలోచనలకు ప్రభుత్వం అక్షర రూపం ఇవ్వాలి వారి సలహాలను స్వీకరించాలి.
-- ప్రజా ఉద్యమాలు, విజ్ఞాపన పత్రాలు, నిరసనలు, ఊరేగింపులు, ర్యాలీల వంటి సందర్భంలో పోలీసుల జులుమును తగ్గించాలి. సంబంధిత అధికారులు మాత్రమే ప్రవేశించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
-- ప్రతి విషయంలోనూ పోలీసుల జోక్యాన్ని అతిగా ఆశించి ఎక్కడికక్కడ అడ్డుకోవాలనే దుష్ట ఆలోచనకు స్వస్తి పలకాలి. పోలీసులకు స్వతంత్ర ఆలోచన అవకాశాలను కల్పించి ప్రభుత్వానికి మద్దతుగా వారిని అక్రమంగా వినియోగించుకోకూడదు . అలా చేస్తే శిక్షార్హులే అని మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ చేసిన హెచ్చరిక పాలకులకు ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి .
--- సమ సమాజ స్థాపన దిశగా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించుకునే క్రమంలో విప్లవ రచయితల సంఘం వంటి అనేక సంస్థలు సుమారు 16 సంఘాలను గత ప్రభుత్వం మొదట్లో నిషేధించిన విషయం తెలుసు. తరువాత పోరాటం ద్వారా ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది . అయితే ప్రజా సంఘాలను విప్లవ సంస్థలను నిషేధించడానికి ప్రభుత్వం పూనుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది అనే స్పృహ కొత్త ప్రభుత్వాని కుంటే మంచిది. మార్పు కోరే భావజాలాన్ని కలిగి ఉండడం తప్పు కాదు అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.
-- చట్టసభలలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి . ప్రభుత్వాన్ని ప్రశ్నించి విమర్శించినo త మాత్రాన మార్షల్షును పిలిపించి బయటికి మెడలు బట్టి గెంటించే దుష్ట సంప్రదాయానికి అడ్డుకట్ట వేయాలి . .ఈ పద్ధతి గత పాలకులు కొనసాగించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం అవసరం.
--- ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టసభలను మొక్కుబడిగా నిర్వహించే కు సంస్కారానికి తెరదించాలి. ప్రజల సొమ్ముతో గద్దెనెక్కి భారీ వేతనాలు ,అలవెన్సులు పొంది, అనేక సౌకర్యాలను అనుభవిస్తున్నటువంటి పాలకవర్గాలు ప్రజా సమస్యల పైన సుదీర్ఘమైన చర్చకు అవకాశం ఉండే విధంగా సంవత్సరానికి కనీసం 40 రోజులు ఆ పైగా చట్టసభల పని దినాలను తప్పనిసరి చేయాలి .
--- ఉద్యోగుల వేతన వ్యవస్థలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఏక మొత్తం వేతనాలతో పాటు పార్ట్ టైం స్వీపర్లు తాత్కాలిక ఉద్యోగులకు అత్యంత దయనీయమైన స్థితిలో వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా ప్రభుత్వం ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకునే దుష్ట సంప్రదాయం .దీనిని కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టి సమాన పనికి సమాన వేతనం అనే సిద్ధాంత ప్రాతిపదికన వేతన స్కేల్ లను అనుమతించి శ్రమ దోపిడిని కట్టడి చేయాలి. అదే సందర్భంలో అత్యంత అల్ప వేతనాలతో తాత్కాలికంగా పనిచేస్తున్న వాళ్లకు కూడా కనీస వేతన చట్టం ప్రకారంగా 26 వేలను అనుమతించి ప్రభుత్వం తన మానవతా దృక్పథాన్ని చాటుకోవాలి.
గతంలో ధర్నా చౌక్ ను ఎత్తివేయడం, హౌస్ అరెస్టులు చేయడం, తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేయడం, పోరాట కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఎక్కడి వాళ్ళని అక్కడే ముందస్తు అరెస్టు చేయడం, వాహనాలను సీజ్ చేయడం వంటి అనైతిక పద్ధతులకు పాల్పడితే గత పాలకులకు పట్టిన దౌర్భాగ్య పరిస్థితులు తిరిగి రాష్ట్రంలో రాక మానవు. కనుక మనిషిని మనిషిగా చూడగలిగే, హింసకు అవమానానికి పేదరికానికి తా వు లేకుండా సమానత్వ ప్రాతిపదికన ఆత్మగౌరవంతో జీవించగలిగే ఆధునిక ఆదర్శ వ్యవస్థకు అంకురార్పణ చేయాలి. తద్వారా ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించడానికి, నిర్బంధం అణచివేత వంటి అక్రమ పద్ధతులను ఆమడ దూరం తరమడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అన్ని వర్గాల యొక్క మద్దతు ప్రభుత్వానికి లభిస్తుంది . లేకుంటే ఈ వర్గాల ఆక్రందనలు ఆందోళనలతో పాటు కన్నేర్ర చేస్తే ఎంతటి ప్రభుత్వమైనా మట్టి కరువక తప్పదు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా పూర్తి ప్రజాస్వామిక దృక్పథంతో పనిచేయగలిగే ప్రభుత్వాన్ని స్థాపించడం ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు విస్తారంగా జనంలోకి చేరుతాయి. ప్రజల భిన్నాభిప్రాయాలకు సూచనలకు ఆస్కారం ఉంటుంది .ప్రభుత్వ పెద్దలకు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌడపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)