ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

Feb 26, 2026 - 19:24
 0  2
ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ జిల్లా పేరును  జాతీయ స్థాయికి  తీసుకెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ బాషా  షేక్.

-జనగామ జిల్లా అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన కలెక్టర్.

 జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల -ఈ నెల 27 న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్న రిజ్వాన్ బాషా షేక్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడంలో ముందుండటమే కాక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని పేరుగాంచిన అధికారి రిజ్వాన్ బాషా షేక్. జనగామ జిల్లా కలెక్టర్ గా రిజ్వాన్ బాషా షేక్ రెండేళ్లు పూర్తి చేసుకుని జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ అయ్యారు. ఈనెల 27న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్న రిజ్వాన్ బాషా షేక్ తన విధి నిర్వహణలో అంకితభావం కలిగిన అధికారిగా పేరుగాంచారు.

అక్షరాస్యతలో జోగులాంబ గద్వాల జిల్లా వెనకబడి ఉండడంతో కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్ ఈ ప్రాంతంలో విద్యా రంగాన్ని పరుగులు పెట్టించడమే కాక అన్ని రంగాల్లో గద్వాల జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. జనగామ జిల్లా కలెక్టర్ గా సంక్షేమ పథకాల అమలులో చేసిన విశేష సేవలు, అందుకున్న పురస్కారాలు ఆయన ప్రతిభకు తార్కాణాలుగా చెప్పవచ్చు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ జిల్లాలో సాధించిన ప్రగతి, అందుకున్న పురస్కారాలు ఆయన నిబద్ధతకు కొలమానాలుగా చెప్పవచ్చు.

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ జిల్లాలో "మన జిల్లా - మన నీరు" అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి విజయవంతమయ్యారు. 
ఈ క్రమంలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2025, నవంబర్ 18న దిల్లీలో జరిగిన 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీ. ఆర్. పాటిల్ చేతుల మీదుగా జల్ సంచాయ్ - జన్ భాగీధారీ 1.0 అవార్డు, అలాగే జల్ ప్రహరీ సమ్మాన్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని  సైతం అందుకున్నారు.

అలాగే జనగామ జిల్లాలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, అమలులో ప్రతిభ చూపినందుకు గాను 2025, అక్టోబర్ 9న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా  జిల్లా స్థాయి ఉత్తమ అవార్డును కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అందుకున్నారు.

అలాగే ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర వహించే ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు, ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించి, సిబ్బందికి నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఎన్నికల నిర్వహణను అధికారులు సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు గాను 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని 2026, జనవరి 25న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా పురస్కారాన్ని  కూడా కలెక్టర్ పొందడం జరిగింది.

దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో నిర్వహించిన NAS (నేషనల్ అచీవ్మెంట్ సర్వే) - 2024 సర్వేలో జనగామ జిల్లా విద్యార్థులు తృతీయ తరగతిలో 16వ స్థానం, ఆరవ తరగతిలో 35వ స్థానం, 9వ తరగతిలో 33వ స్థానం సాధించి,  రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం జనగామ జిల్లా విశిష్ట స్థానం సాధించడంలో విశేష కృషి చేసినందున 2025, సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవం సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అవార్డును అందుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను జనగామ జిల్లాలోని నిరుపేదలకు అందించేందుకు తరచు ఆయా ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటనలు చేసేవారు, వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు. జనగాం జిల్లాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ అంశాల్లో ముందంజలో నిలబడేలా చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీపై రావడం గర్వకారణంగా భావించవచ్చు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంకు గట్టు మండలం ఎంపిక కావడంతో నిర్దేశించిన అంశాల్లో 100% లక్ష్యాలను సాధించేందుకు కొత్త కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పవచ్చు. అలాగే జిల్లాను అన్ని రంగాల్లో ముందుండేలా ఇక్కడి ప్రజాప్రతినిధులను, అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పారదర్శకమైన పాలనతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
............................................................

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333