నూతన అక్రిడిటేషన్ లను వెంటనే జారీ చేయండి
ఐ అండ్ పి ఆర్ కమీషనర్ కు టీయూ డబ్ల్యూ జే వినతి.
కాలపరిమితి ముగిసి రెండు సార్లు పొడిగించి ఇచ్చిన జర్నలిస్టుల అక్రెడిటేషన్స్ స్థానంలో నూతన అక్రిడిటేషన్స్ ను వెంటనే జారీ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హరీష్ ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు సచివాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. యూనియన్ అధ్యక్షులు అల్లం నారాయణ సూచన మేరకు రాష్ట్ర కమిటీ నాయకులు కమిషనర్ ను కలిసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి విధిగా జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో గత ఆరు నెలలుగా జరుగుతున్న జాప్యాన్ని కమిషనర్ దృష్టికి ఈ సందర్భంగా తీసుకొచ్చారు. నిజానికి ఆరు మాసాల క్రితమే గతంలో జారీచేసిన కార్డుల పరిమితి ముగిసిన నేపథ్యంలో నూతన కార్డులను జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని. కానీ వివిధ కారణాల రీత్యా దానిని ఇప్పటికే రెండు దఫాలుగా వాయిదా వేసి పొడిగించడం జరిగిందని వివరించారు. తద్వారా ప్రతి మూడు మాసాలకు ఒకసారి బస్సు పాస్ రెన్యువల్ చేసుకోవటం, కార్డులపై స్టిక్కర్ అంటించుకోవడం జర్నలిస్టులకు ఒక ప్రహసనంగా మారిందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మధ్యకాలంలో 239 జీవో కు సంబంధించి, నూతన మార్గదర్శకాలను రూపొందించడానికి గాను ఒక కమిటీని వేశారు కాబట్టి. ఈ కమిటీ నివేదికను సత్వరమే ఇవ్వాలని కోరారు. సంబంధిత శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లాస్థాయిలో నూతన అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని, తద్వారా నూతన కార్డులను జారీచేయాలని ఐ అండ్ పి ఆర్ కమీషనర్ ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘంగా కోరడం జరిగింది. త్వరలోనే విధి విధానాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్డులను జారీ చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.కమిషనర్ ను కలిసిన వారిలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్,ఉపాధ్యక్షులు రమేష్ హజారీ, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, కోశాధికారి
పి.యోగనంద్, ఐ జే యు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ లు ఉన్నారు.