టీవీ సీరియల్ రచయితలారా  సమాజాన్ని కాపాడండి

Sep 13, 2024 - 09:56
Sep 25, 2024 - 14:58
 0  9

సమాజ వ్యతిరేక చర్యలు, లేని అనుమానాలను పెంచి  కుటుంబ గందరగోళానికి తెరతీయకండి.

సంక్లిష్ట, సంఘర్షణతో కూడుకున్న సమాజంలో కుట్రలు, కుతంత్రాలు, అనుమానాలకు తావులేని  మానవతా కుసుమాలు పూయి0చడoడి.

---  వడ్డేపల్లి మల్లేశం

సినిమాలు  టీవీ ప్రసారాలు ముఖ్యంగా సీరియల్ ల ద్వారా  మానవ జీవితంలో నెలకొన్న అనేక దురభిప్రాయాలకు  చరమగీతం పాడవచ్చు.    కుటుంబాలలో నెలకొన్న కుట్రలు, కుతంత్రాలు ఈర్ష ద్వేషాలు  ప్రలోభాలకు  ముగింపు పలకవచ్చు.  నూతన  సజీవ మానవ సంబంధాలకు  అవకాశం కల్పించి  సమాజాన్ని కొంతవరకైనా మార్చడానికి అవకాశం ఉంటుంది . ఎందుకంటే రేడియో  ప్రసంగాలు, వక్తల  ప్రవచనాల ద్వారా  కొంతవరకు  తమ తప్పులను సవరించుకోవడానికి ఆలోచించడానికి అవకాశం ఉన్నప్పటికీ  అంతకు మించిన స్థాయిలో టీవీలు సినిమాల ద్వారా  జీవితాన్ని ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది కనుక  తొందరగా  మనుషుల మెదళ్లపై ముద్రపడే అవకాశం ఉంది.   ప్రసారాలలో మనం చూపించే కథలు సన్నివేశాలు, సందర్భాలను బట్టి  అవి చూపే ప్రభావాలు  ఆధారపడి ఉంటాయి . ముఖ్యంగా ప్రసార మాధ్యమాల ద్వారా సమాజంలో నెలకొన్నటువంటి కొన్ని రుగ్మతలు  సమాజ వ్యతిరేక  చర్యలకు  ముగింపు పలకడం ద్వారా  ఉత్తమ సమాజాన్ని నిర్మించే క్రమంలో కొంతవరకైనా  మేలు జరగాలని ఆశించి ఈ ప్రయత్నం చేయడం జరుగుతున్నది . సినిమా నిర్మించే నిర్మాతలు దర్శకులు అలాగే టీవీ ప్రసారాలకు బాధ్యత వహిస్తున్నటువంటి రచయితలు నిర్వాహకులు టీవీ ఛానల్ లో ప్రతినిధులు  గుడ్డిగా ప్రసారాలను కొనసాగించకుండా లక్ష్యంతో మాత్రమే  నిర్మాణం చేస్తారనేది అందరూ కూడా ఆశిస్తున్న విషయం.  కానీ ఇటీవలి కాలంలో ముఖ్యంగా టీవీ ప్రసారాలను గనక గమనించినట్లయితే సీరియల్లలో కొనసాగుతున్నటువంటి కథనం , పాత్రలు,  సంభాషణలు, చర్చలు,  సమీక్షలు మానవ జీవితానికి  విఘాతము కలిగించే రీతిలో ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు.  కథా రచయితలు సంభాషణ రచయితలు  ఎన్నుకునే అంశం  ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఉపయోగపడాలి కానీ  సమాజంలో లేని అంశాలను ఎత్తిచూపి  అనుమానాలకు తావిచ్చే విధంగా  కుట్రలు కుతంత్రాలను ప్రోత్సహించే విధంగా కథాగమనం కొనసాగినప్పుడు  ఆ సీరియల్ ద్వారా ఈ సమాజానికి నష్టమే ఎక్కువ అని చెప్పక తప్పదు.  సినిమాలు టీవీ ప్రసారాల పైన ప్రభుత్వాలకు అదుపు ఉంటుంది  .సమాజ హితాన్ని కోరేదే సాహిత్యమైనప్పుడు  సమాజంలో నెలకొన్న  రుగ్మతలు  మానవ వ్యతిరేక ఆలోచనల రూపుమాపి మరింత ఉత్తమ సమాజాన్ని నిర్మించే క్రమంలో  ఈ కార్యక్రమాలు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది .  ఆ సామాజిక బాధ్యతను ప్రభుత్వాలు  మోయవలసిన అవసరం ఉంది. కానీ  రాజకీయాలతో తీరిక లేనటువంటి ప్రభుత్వాలు  మానవ జీవితాన్ని తీర్చిదిద్ది ఉన్నతంగా  నిల పెట్టడానికి  టీవీలు ప్రసారాలు సినిమాలు ఉపయోగపడతాయి అనే తాత్విక ఆలోచన పాలకులకు లేదు.పైగా  ప్రలోభాలు, వాగ్దానాలు,  హామీలతో ప్రజా జీవితాన్ని ఒకవైపు చిద్రం చేస్తుంటే  ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గమనించినటువంటి టీవీ ప్రసారాల 
బాధ్యులు సినిమా నిర్మాతలు దర్శకులు  సామాజిక ప్రయోజనాన్ని ఆశించకుండా వాణిజ్య ధోరణితో ప్రసారాలను రూపకల్పన చేస్తున్న కారణంగా  ఉత్తమ సమాజం బదులు అధమ సమాజం ఏర్పడుతున్నది ఇది చాలా ఆందోళన కలిగించే అంశం  .
       రచయితలారా  ఒక్కసారి ఆలోచించండి  :-
*"*****
ప్రతి సీరియల్ ప్రసారమయ్యే ముందు  తెరమీద కనపడే వాక్యాలను చదివినప్పుడు  ఈ సీరియల్ కల్పితం మాత్రమే  ఇందులోని పాత్రలు  కథ  ఎవరినీ ఉద్దేశించి కాదు అని  స్పష్టం చేస్తారు.  కానీ  తీక్షణంగా గమనించినప్పుడు  కథ మాత్రమే కల్పితం కాదు  కథలోని సన్నివేశాలు పాత్రలు, సందర్భాలు కూడా  మానవ జీవితానికి ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం  ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే తోడ్పడే విధంగా పూర్తిగా కల్పిథా లని చెప్పక తప్పదు . ఇక్కడ  టీవీ ప్రసారాల  నిర్వాహకులు ఎంత బాధ్యత వహిస్తారో  అంతకుమించిన స్థాయిలో రచయితలు బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది.  ఎందుకంటే రచయితలు ఎన్నుకునే కథ, రాసే సంభాషణలు, చిత్రీకరించే సన్నివేశాలు సందర్భాలు డైలాగులు  అంతో ఇంతో మెరుగైనటువంటి సమాజాన్ని మరింత  దిగజారడానికి కారణం అవుతున్నాయి అంటే అందులో  ఉపయోగిస్తున్నటువంటి సన్నివేశాలు డైలాగులు సంభాషణలు  కటువుగా ఏవగింపుగా వ్యతిరేకంగా మరింత నికృష్టంగా  సజీవ సంబంధాలను  నిర్జీవం చేసే విధంగా ఉoటేనే కదా!  "కొద్దిమంది కళాకారులు,  ఒకరిద్దరు రచయితలు,  నిర్వాహకులకు  ప్రయోజనం జరిగితే చాలు  ఆర్థికంగా  కోలుకుంటే  సరిపోతుంది అనీభావిస్తున్నారే కానీ దీని ప్రభావం ప్రజల పైన ఎలా ఉంటుంది? అని ఆలోచించని కారణంగా  ఈ చెడు ప్రభావం మరింత  ముదిరి పాకాన పడుతున్నది"

మానవ జీవితంలోని పలు పార్షాలను సమాజంలో నెలకొన్న  సంక్లిష్టతలను పరిశీలించి  వాటిని నిర్మూలించే దిశగా కథనం కొనసాగాలి కానీ  లేని   వివాదాలను అతిగా చూపి , యుద్ధభూమిని తలపించే విధంగా సంఘర్షణకు ఆస్కారమిచ్చి,   మహిళలచే ఆధిపత్య ధోరణిని ప్రదర్శింప చేసి  ఎలా బ్రతుకుతారో చూస్తాము? ఎలా ఫస్ట్ నైట్ అవుతుందో చూస్తాము?   ఎలా భార్యాభర్తలు కలిసి ఉంటారో చూస్తాము? అని శాపనార్థాలు హెచ్చరికలు  మనకు ఏ సీరియల్ చూసినా  ఆడిగడుగునా కనపడుతూనే ఉంటాయి  .ఎక్కడ చూసినా సమాజం యొక్క  క్షేమాన్ని, సంతోషాన్ని, ఉల్లాసాన్ని , సామాజిక ప్రయోజనాన్ని చూపించినట్లుగా సీరియల్ లో కనిపించదు.  మెడ నిండా  బంగారు గనులు తాండవిస్తుంటే , సామాన్య జీవితానికి సందర్భం లేని సంపన్న వర్గాల జీవితమే కథావస్తువై నిలబడితే , ఆడంబరాలు  ఆకాశాన్ని అంటే భవనాల  నేపథ్యంలో  పిడికెడు మెతుకులకు నోచని కాయకష్టం చేసుకుని బ్రతికే కూలీలు  వలస జీవులు  పేద వర్గాలతో నిర్బంధంగా ప్రసారాలను  కనురెప్ప కదలకుండా  చూపించగలుగుతున్నారంటే ఇదే నిజమైన కుట్ర.  ఇందులో ఎక్కడ కూడా పేద వర్గాల ప్రయోజనం లేదు,  సంపన్న వర్గాల  జీవన విధానo ,  పెట్టుబడిదారీ వర్గాల  ప్రయోజనాలకు మాత్రమే ఈ ప్రసారాలు అద్దం పడుతున్నాయి.
   సీరియల్లో ఇతర ప్రసారాలలో గనక గమనించినప్పుడు  స్త్రీని అంగడి బొమ్మగా ఆట సరుకుగా  విచ్చలవిడిగా చూపించడంతోపాటు  మోసాలు కుట్రలు  ఎలా చేయాలో స్పష్టంగా నేర్పించడం జరుగుతున్నది.  "ఒక కుటుంబాన్ని నిలువునా విడదీయాలంటే , భార్యాభర్తల మధ్యన కయ్యం  కావాలంటే  ,కుటుంబాల మధ్యన సంబంధాలు బెడిసి కొట్టాలంటే , మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేయాలంటే  నేటి సీరియల్ లను ప్రధానంగా  చూడాలి అని  హెచ్చరించే రోజులు వచ్చినాయి" అంటే  రచయితలు  సామాజిక బాధ్యతకు ఎందుకు దూరంగా  వ్యవహరిస్తున్నారో ఆలోచించుకోవాలి . బయటి సమాజంలో ఎక్కడ సమిష్టి కుటుంబాలు కనిపించవు కానీ  సీరియల్ లో మాత్రం  పెద్ద పెద్ద రాజభవనాలలో 10 మంది  ఆపై సంఖ్యతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను  చూపించి కయ్యాలు  కుతంత్రాలు ఈర్ష్యా ద్వేషాలు  ఏ రకంగా ప్రభావం చూపుతున్నాయో చూపెట్టడం ద్వారా  అంతో ఇంతో కలిసి ఉన్నటువంటి కుటుంబాలు కూడా విడిపోవడానికి కారణం అవుతున్నాయి టీవీ ప్రసారాలు.
        రచయితలకు, నిర్వాహకులకు, పాత్రధారులకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉండవలసిన అవసరం చాలా ఉన్నది . "తమ పారితోషకం తాము తీసుకుంటే  విడుదలైనటువంటి సీరియల్  ప్రజా జీవితం మీద ఏ రకమైన ముద్ర వేసిన మాకు సంబంధం లేదు అనుకునే విధంగా  వస్తున్నటువంటి టీవీ ప్రసారాలు సీరియల్ పైన ప్రభుత్వం ఉక్కు పాదం మోపాల్సిన అవసరం చాలా ఉన్నది  .గమ్మత్తైన విషయం ఏమిటంటే  ఏ మాత్రము కూడా తమ సాధారణ జీవితానికి పాత్ర లేనటువంటి సంపన్న వర్గాల సీరియల్ లను చూడడానికి పేదలు, కూలీలు  సామాన్య జనం ఎగబడే విధంగా  తయారు చేసినటువంటి  దుర్మార్గపు  ఆలోచన సరలి నుండి బయట పడవలసిన అవసరం చాలా ఉన్నది  .టీవీ సీరియల్ లో సాధారణ జీవితము, మధ్యతరగతి జీవితము ,కార్మికుల జీవితము, రైతుల జీవితము, విద్యార్థి జీవితము , ఉద్యోగుల జీవితము వంటి అనేక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని  మరింత మెరుగైన  విధంగా ఎలా జీవించవచ్చునో తెలిపే ప్రయత్నం చేయాలి కానీ దానికి భిన్నంగా  సామాజిక తిరోగమనానికి పూనుకుంటున్నటువంటి సినిమాలు టీవీ ప్రసారాల పట్ల  సమాజంలో  ఏదో ఒకనాడు కచ్చితంగా తిరుగుబాటు రాక మానదు.  ప్రశ్నించడం, ప్రతిఘటించడం, వ్యతిరేకించడం,  చివరికి తిరస్కరించే స్థాయి వరకు రాకముందే  ప్రజా ప్రయోజనాలను, సామాజిక లక్ష్యాన్ని , సమాజ సంస్కరణను , సమ సమాజ స్థాపనను  కేంద్రంగా చేసుకొని రచయితలు నిర్వాహకులు  సదుద్దేశంతో  కార్యక్రమాలను రూపకల్పన చేయడానికి పూనుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఆ వైపుగా రచయితలు నిర్వాహకులు ఆలోచిస్తారని , తమ తప్పుడు విధానాల పైన సమీక్ష చేస్తారని , లోతైన పరిశీలన ద్వారా సమాజాన్ని అవగతం చేసుకొని ఏ రకమైనటువంటి ప్రసారాలు అవసరమో నిర్ణయానికి వస్తారని  ప్రజలందరి పక్షాన  ఆశిద్దాం.  విచ్ఛిన్న స్థితిలో ఉన్న మానవ సంబంధాలను బలోపేతం చేసే విధంగా  కుటుంబ బంధాలను  శాశ్వతం  చేయడానికి  మానవతా విలువల ప్రాతిపదికన కార్యక్రమాలను రూపొందిస్తే  బాగుంటుంది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)   జీ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333