నిండా 20 ఏళ్లు కూడా లేని ఆమె మాదకద్రవ్యాలకు అలవాటుపడింది.. చివరకు ఏమైందో తెలిస్తే

చెన్నై: మాదకద్రవ్యాల కారణంగా యువతి మృతిచెందిందా అనే విషయమై ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీ బాంబే క్యాసిల్ ప్రాంతానికి చెందిన ఆకాష్ (20), ఊటీ ఫింగర్ పోస్ట్ ప్రాంతానికి చెందిన రీతిఏంజెల్ (19) ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్నప్పటి నుంచి ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం రీతి ఏంజెల్ కోవైలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో, ఆకాష్ నీలగిరిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. వారివురు తరచూ కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో సెలవులు రావడంతో గత శనివారం రితిఏంజెల్ ప్రియుడిని కలుసుకొనేందుకు కోవై నుంచి ఊటీ వచ్చింది. ఆమెను ఆహ్వానించిన ఆకాష్ సమీపంలోని టాస్మాక్ దుకాణానికి వెళ్లి మద్యం తీసుకొని తన ఇంటికి వెళ్లాడు. ఆన్‌లైన్‌లో భోజనానికి ఆర్డరు చేసిన అనంతరం మద్యం తాగారు. అనంతరం ద్విచక్రవాహనంలో ఫైన్ ఫారె్‌స్టకి వెళ్లి మ్యాజిక్ మష్రూమ్ అనే మాదకద్రవ్యం కొనుగోలు చేసి మద్యంలో కలుపుకొని తాగి, మత్తులో నిద్రపోయారు. ఉదయం లేచిన ఆకాష్, రీతిఏంజెల్‌ను లేపగా ఆమె లేవకపోవడంతో ఆందోళన చెందిన 108 అంబులెన్స్‌ను రప్పించారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై తొలుత సందేహాస్పద మరణం కింద కేసు నమోదుచేసిన పోలీసులు అనంతరం హత్యానేరం కాని మరణం కింద కేసు నమోదుచేసి ఆదివారం ఆకా్‌షను అరెస్ట్ చేశారు.