నకిలీ విత్తనాలను అరికట్టాలి, యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేయాలి.
తెలంగాణ రైతు సంఘం డిమాండ్
24 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో విచ్చలవిడిగా చలామణిలోకి వస్తున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని, యూరియా బుకింగ్ యాప్ ను రద్దుచేసి అర్హులైన ప్రతి రైతుకు యూరియాను సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జీకే ఈదన్న, ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో డిఏఓ కి వినతిపత్రం అందించారు. జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం రైతులు మోసపోతున్న నివారించడానికి అధికార యంత్రాంగం ఏటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. యూరియా బుకింగ్ యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, నిరక్షరాసులైన రైతులు సమయానికి యురియా అందక అధిక రేట్లకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పొటాష్, భాస్వరం, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచి రైతులను అన్యాయం చేసిందని విమర్శించారు. రైతు భరోసా నిధులను పూర్తిగా విడుదల చేయకుండా కేవలం రెండు ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిందని, దీనివల్ల పెట్టుబడి సాయం లేక రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2025 సంవత్సరపు వానాకాలం మరియు ప్రస్తుత యాసంగి రైతు భరోసా నిధులు ఇంకా రైతుల ఖాతాలో జమ చేయకపోవడం వల్ల రైతులు గత్యంతరం లేక మధ్య దళారులను ఆశ్రయించి అధిక వడ్డీ లకు అరువు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు సన్న ధాన్యం బోనస్ నగదు రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్ల, రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను, పూర్తిగా విద్యుత్ ప్రైవేటీకరణ చేసే విధంగా తీసుకొస్తున్న రైతు డిస్కమ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావున తక్షణమే నకిలీ మరియు కల్తీ విత్తనాలను అరికట్టి, నాణ్యమైన విత్తనాలు అందించాలని పెండింగ్లో ఉన్న రైతు భరోసా సన్నధాన్యం బోనస్ నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, కిసాన్ సమ్మాన్ పథకం జిల్లాలోని రైతులందరికీ వర్తింపజేయాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని,, లేని పక్షంలో రైతులు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తలయ్య, సహయ కార్యదర్శి నరసింహ CITU జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పాల్గొన్నారు.