తాగునీటి సరఫరా సక్రమంగా చేపట్టాలి : విజయేంద్ర
మేడ్చల్ తెలంగాణవార్త, ఏప్రిల్ 06 :- తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళికా చేపట్టాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనముల శాఖ, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం విసి మీటింగ్ హల్ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి విజయేంద్ర జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి తాగునీటి సరఫరాపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీర్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి విజయేంద్ర మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని తెలిపారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు.
అవసరం ఉన్నా దగ్గర ట్యాంకర్లను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ కార్యాలయాలకు, వాటర్ వర్క్స్, గ్రామ పంచాయతీ పరిధిలో, మున్సిపల్ పరిధిలో టోల్ ఫ్రీ, కాల్ సెంటర్ నెంబర్లు ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపిడిఓలు క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ, ఎక్కడైనా లోపాలు గమనించిన వెంటనే వాటిని సరిదిద్దాలని, తాగునీటి వ్యవస్థకు ఇబ్బంది తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో నిర్ణీత పరిమాణంలో నీటి సరఫరా జరుగుతోందా లేదా అన్నది మండల అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు సరిచూసుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ ప్రస్తుత వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి సమస్య రాకుండా నిబద్దతతో పని చేయాలని సూచించారు.
పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా : జిల్లా కలెక్టర్ గౌతమ్ అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని, వేసవి కాలంలో నీటి వినియోగం పెరిగి త్రాగునీటి వనరులు తగ్గిపోతాయని, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించమన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకై జిల్లా అధికారులను మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా తాగునీటి ఎద్దడి ఏర్పడితే నీటి సమస్యను పరిష్కరించడం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయంలో కాల్ సెంటర్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అవసరం అయితే టాంకర్స్ ద్వారా కూడా నీటిని అందించడం జరుగుతుందనీ తెలిపారు. మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాలలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని నివాస ప్రాంతాలలో నీటి కొరతను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేకాకుండా ఎక్కడ నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని, అవసరమైన చోట బోరు మోటార్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపిస్తామని అన్నారు.
ప్రస్తుత వేసవి సీజన్ దృష్ట్యా మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు, ఎంపిడిఓలు సమన్వయంతో, సమిష్టిగా పని చేయాలని అన్నారు. నీటి కొరత ఏర్పడకుండా చేపడుతున్న చర్యలు ప్రజలకు తెలిసేలా చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, డీపీఓ వెంకటయ్య, డీఆర్డీఏ పిడి సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్లు, వాటర్ వర్క్స్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.