తన దాకా వస్తే కానీ తెలియదు.
ఆ దుస్థితిని గుర్తించకుండా, అహంకారంతో జీవిస్తే చివరి దశలో పలకరించే వాళ్లే దొరకరు. జాగ్రత్త !
మొగ్గలోనే మానవత్వాన్ని చిదిమి వేస్తూ మనము ఆ పతనానికి బలి అవుతున్నాము ..
...వడ్డేపల్లి మల్లేశం
గతంలో పిల్లలు సహజంగానే తమ సమకాలికుల సహవాసంతో పెద్దలు చెప్పిన కథలు ప్రేమ గారాబముతో మంచి వైపే ఆలోచించేవాళ్లు గమ్మత్తేమిటంటే అమ్మ లు తాతయ్యల మీద కూర్చుని తాతకున్న చు ట్ట తాగే అలవాటును అమ్మకు ఉన్నటువంటి ముక్కు పీల్చే అలవాటును కూడా మానుకోమ్మని ఇది మంచి పద్ధతి కాదని చెప్పిన సందర్భాలు అనేకం. అంటే ఆనాడు మంచి సర్వత్రా వ్యాపించి ఉన్న పరిస్థితులలో అక్కడో ఇక్కడో కొన్ని దొరలవాట్లు ఉంటే వాటిని పెద్దలకంటే ముందే పిల్లలు కూడా వ్యతిరేకించినటువంటి గొప్ప వ్యవస్థ మనది. కాలానుగుణంగా ఈ పరిస్థితులు మారిపోయినాయి. నాడు పిల్లలు బుద్ధిమంతులే పెద్దలు కూడా నీతి కథలు గౌరవము మర్యాద పెద్దరికము ఐకమత్యం గురించి చెప్పే వాళ్ళు కనుక ఇంట్లో బయట పాఠశాలల్లో అంతటా మంచి విషయాలే చెప్పేది కనుక నాడు పిల్లలకు మంచి అలవాట్లే అబ్బేవి. తమ పిల్లల పాఠశాలలో చేరే కంటే ముందుగానే బాధ్యతాయుతంగా పెంచి ప్రయోజకులను చేయడం నాడు పిల్లల తల్లిదండ్రులకు మొదటి బాధ్యతగా ఉండేది. కానీ నేడు తమ బాధ్యతను గాలికి వదిలి పిల్లలను పాఠశాలకు పంపించే క్రమంలో మా పిల్లలను మంచిగా చూసుకోండి కొంచెం జాగ్రత్త చెడిపోతున్నారు సక్రమంగా మర్యాదగా ఉంట లేరు అని మన బాధ్యతను వాళ్ల మీద నెట్టివేస్తున్నాం. అదే సందర్భంలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర చేసే పనులు కొన్ని పిల్లలు గ్రహిస్తే ఆందోళన కలిగించే సన్నివేశాలు కూడా లేకపోలేదు. సిగరెట్లు తాగడం, మద్యపానం, గుట్కాలు, డ్రగ్స్ ఇతర దురలవాట్లకు బానిసలు అయినటువంటి తల్లిదండ్రులు ఇక తమ పిల్లలను ఏం రక్షిస్తారు? అందుకే పాఠశాలకు ఆ బాధ్యత అప్పజెపుతున్నారు పగలంతా పాఠశాలలో ఉన్నప్పటికీ తిరిగి చేరేది ఇంటికే గనక ఇంట్లో ఉన్నటువంటి దు రలవాట్లు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పిల్లలపైన దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోనూ ఇరుగుపొరుగుతోను కనీస మానవ సంబంధాలను కొనసాగించే బదులు ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతూ స్వార్థపూరితంగా నటిస్తూ నిరంతరం అందరితో ఘర్షణ వైఖరికి పాల్పడడం కోపతాపాలతో చిర్రబుర్రు మని అంటూ ఉంటే పిల్లలు కళ్ళారా చూస్తున్నారు కదా! అదే మాదిరిగా ఇంటిపక్క ఆడవాళ్ళతో తన తల్లి ఇతర స్త్రీలు ఘర్షణ పడుతూ పరస్పరం దూషించుకుంటూ సరిహద్దు కోసమో ఇల్లు వాకిలి కోసమో కులం గోత్రం పేరుతో నిందించుకోవడం ఘర్షణ పడడం సంబంధాలను దూరం చేసుకోవడం కల్లా రా చూస్తున్న పిల్లలు తమ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులైన అమ్మ తాత పట్ల తల్లిదండ్రులు అవలంబిస్తున్న వైఖరిని కూడా చూస్తూ తాము నేర్చుకోకుండా ఉండగలరా? ఇతరుల పట్ల ప్రేమానురాగాలను దూరం చేసే కుట్ర చిన్ననాటి నుండే తల్లిదండ్రులు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారని అనడంలో సందేహం లేదు.
సహనము సమభావము ఐకమత్యము ప్రేమ జాలి తోటి వ్యక్తుల పట్ల ఆరాధన వంటి భావాలను పెంపొందించడం అనేది నేడు కలలో కూడా జరగడం లేదంటే ఎంత దిగజారి పోయినామో అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు మన పిల్లలు మన కంటే గొప్పవాళ్లు కాగలరా? మనకంటే ఉన్నతంగా ఆలోచించగలుగుతారా? అత్యాశ అవుతుంది కావచ్చు కాని ఇక్కడే తల్లిదండ్రులుగా మనం నిర్వర్తించవలసిన బాధ్యత దారి తప్పుతున్న వేళ రాబోయే పరిణామాలకు మనము కూడా భాద్యు లమైతే ఎలా అని ఒక్కసారి తలచుకుంటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది జాగ్రత్త! ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా మీ ఇంట్లో వృద్ధులు తల్లిదండ్రులు ఒంటరి మహిళలు అంగవైకల్యం ఉన్నవాళ్లు ఎవరైనా ఉండి ఉంటారు వాళ్ల పట్ల మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలు వ్యవహ రిస్తున్న తీరు పరిశీలించినట్లయితే ఎంత వివక్షతకు వాళ్లు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకరిo ట కాదు ప్రతి కుటుంబంలో కూడా జరుగుతున్నది ఇదే. ఇక మరొకచోట సాధింపులు బెదిరింపులు రాద్ధాంతాలు అహంకారపూరితంగా ఆలోచించడం ద్వారా తమ డిమాండ్లను సాధించుకోవడానికి మహిళలు పురుషుల పైన అ స్త్రాలుగా వాడుతున్న సందర్భాలు అనేకం. తమ డిమాండ్ పరిష్కరిస్తేనే బయటికి వస్తామని లేకుంటే మాట వంట అన్ని క్లోజ్ అని హెచ్చరికలు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. బుద్ధి జీవులైన మేధావులైన శాస్త్రవేత్తలైన చివరికి చట్టాన్ని రూపొందించి అమలు చేసే వాళ్లు కూడా ఓడిపోతున్నారు. బెదిరింపులు, సాధింపులు, హెచ్చరికలు మితిమీరిన సందర్భంలో అక్రమ సంబంధాలు కలిగిన చోట హత్యలు చేయడం ప్రియునితో హత్యలకు పాల్పడడం పిల్లలను అనాధలను చేసి చివరికి కారాగారం పాలు కావడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
తన దుస్థితిని ఊహించుకుంటే మంచిది :-
ఇటీవల కాలంలో ప్రధానంగా వృద్ధుల పట్ల గృహహింస సర్వసాధారణమైపోయింది. భార్యాభర్తలు ఘర్షణ పడడం విడాకులు తీసుకోవడం లేదా భేదాభిప్రాయాలతో వైదొలగడం మరికొన్నిచోట్ల ప్రియుని సహకారంతో భర్తను ప్రియురాలు సహకారంతో భార్యను చిత్రవధకు గురి చేస్తున్న సందర్భాలు ఉండవచ్చు.కానీ అంతకు మించిన స్థాయిలో కుటుంబ సభ్యులుగా ఆ కుటుంబానికి నారు నీరు పోసి మూల స్తంభాలుగా నిలబడి భవిష్యత్తు వారసత్వాన్ని అందించినటువంటి వృద్ధ తల్లిదండ్రులను హింసిస్తున్న సందర్భాలు గమనిస్తే మహిళలు ఎక్కువ శాతం బాధ్యత వహించాలి. అంతేకాదు పురుషులు కూడా అయ్యవ్వల పట్ల హింస తలపెట్టడం సిగ్గుమాలిన పని. ఈ రెండు పరిస్థితులలోనూ తమ గతి ఎలా భవిష్యత్తులో మా బతుకు ఏమిటి? మేము వృద్ధులమైన తర్వాత మమ్ములను ఎవరు పోషించాలి? పలకరించేవాళ్లు ఉంటారా? మా పిల్లలు ఇప్పుడే మాట్లాడడం లేదు చివరి దశలో వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో అనారోగ్యంతో మంచం పట్టి పక్షవాతంతో లేవలేని పరిస్థితిలో భయంకరమైన రోగాల బారిన పడి మాటకే నోచుకోని సందర్భంలో ఉంటే మాకు నీళ్లు ఇచ్చే వారెవరు? అన్నం పెట్టే వాళ్ళు ఎవరు? పలకరించే వాళ్ళు ఎవరు? అని ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే ప్రస్తుతం మనం మన తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరు హింస వివక్షత అణచివేత ఆధిపత్యం అవమానాలు దూషణలు నిందలు బూతు మాటలు మన పిల్లలు కూడా వింటున్నారు మరికొన్నిచోట్ల తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వృద్ధులను హింసిస్తున్న సందర్భాలు ఉన్నాయి అది వేరే విషయం .ఇంత జరుగుతుంటే చూస్తున్నటువంటి పిల్లలు నైతిక విలువలు ఏమాత్రం ఉన్నవాళ్లు అయితే తమ తల్లిదండ్రులను ప్రశ్నించి ఇది సరైన పద్ధతి కాదు అని అనే వాళ్ళు కూడా లేకపోలేదు. మరికొందరు మౌనంగా ఉంటే ఇంకా కొందరు "" మాకు కూడా అవకాశం వస్తుంది కదా అప్పుడు వీళ్లు మంచం పట్టి ఉన్నప్పుడు వీళ్ల లాగే మేము కూడా హింసిస్తాం, అవమానించి, అగౌరవపరిచి, దూషించి, బూతు మాటలతో సరైన గుణపాఠం నేర్పుతాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారి మనసులో ఉన్న ఆ భావాన్ని ఇప్పటికైనా గుర్తించి తల్లిదండ్రులు చేసిన తప్పులను పిల్లలు ప్రతీకారంగా తీర్చుకుంటారో ఏమోనని ఆలోచించి అలాంటి దుస్థితి తమకు వస్తే తట్టుకోలేమని ఆ బ్రతుకు కంటే చావడమే మేలని ఆలోచిస్తే మంచిది. కానీ ఆ ఆలోచన కూడా చివరి వరకు రాదు పైగా అత్తమామల ను చివరి వరకు యాష్ట పెడుతూనే పాపం మూటగట్టుకుంటారు. అంతకుమించినటువంటి శాపనార్థాల మధ్యన మిగతా జీవులుగా తమ శేష జీవితాన్ని గడపవలసి వస్తుంది అని మాత్రం ఆలోచించడం లేదు.""
సామాజిక వ్యవస్థలో కేవలం సంబంధాలు కష్టసుఖాలు శాంతి సామరస్యాలు మాత్రమే కాదు ఆర్థిక పరిస్థితులు స్వా వలంబన ఉపాధి అవకాశాలు కూడా ఉన్నప్పుడే ఆ వ్యవస్థ మొత్తం ప్రజా అనుకూలంగా వర్ధిల్లుతుంది. సామాజిక చింతన ను సక్రమ మార్గంలో నిలబెట్టడం కోసం తల్లిదండ్రులు కుటుంబంతో ప్రారంభమై పాఠశాలలు ఇతర సభలు సమావేశాలతో పాటు సర్వత్ర మనిషిని మనిషిగా గౌరవించే సంస్కారాన్ని అలవర్చడం బాధ్యతగా ప్రత్యేక కోర్సుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా పిల్లల్లో మానవీయ లక్షణాలను పెంపొందించడంతోపాటు పెద్దలు తల్లిదండ్రుల్లో కూడా అమానవీయ లక్షణాలు ఉంటే వాటిని సంస్కరించుకోవడానికి విశ్వకుటుంబ భావన
అలవాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం అనివార్యమైనప్పుడు ఆ దశలలో రావలసినటువంటి శారీరక మార్పులు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు సమానమే కదా! ఈ కటోర వాస్తవం తెలిసికూడా తమది ఒక తీరు ఇతరులది మరొక తీరు అనే పద్ధతిలో ఆలోచిస్తేనే ఇబ్బందులు ఎదురవుతాయి. నీవు నీ తల్లిదండ్రులకు చేసిన దుర్మార్గాన్ని కల్లారా చూసిన నీ పిల్లలు అంతకుమించిన హీనస్థితిలో నిన్ను వివక్షతకు గురిచేసి అవమానించి హింస పెట్టడానికి సిద్ధంగా ఉంటారని తెలుసుకుంటే మంచిది. అదే తనదాకా వస్తే కానీ తెలియదు అనే చేదు వాస్తవాన్ని ఇప్పటికీ గుర్తించకపోతే ఎలా? లక్షల కుటుంబాలలో వృద్ధులు విగత జీవులుగా వివక్షతకు అవమానానికి గురవుతూ ఉన్న సందర్భంలో కడుపున పుట్టిన కొడుకులు గాని పరాయిఇంట పుట్టిన కోడలు గాని సక్రమ మార్గంలో ఆలోచించడం లేదు. తమ గతి ఎలా అని కూడా ఊహించడం లేదు బహుశా తమ పిల్లలు తమకు అనుకూలంగా పోషిస్తారని, నేతి భోజనం పెడతారని అతి నమ్మకం కావచ్చు. కానీ కాలానుగుణంగా ఆ నమ్మకము కనుమరుగవుతున్నది జాగ్రత్త!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)