జయశంకర్ చూపిన బాటలో నడుచుకోవాలి:జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్
జోగులాంబ గద్వాల 6 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:-తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చూపిన బాట అందరికీ ఆచరణీయమని ఆయన చూపిన బాటలో నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణంలోని బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారని పేర్కొన్నారు. ఆయన త్యాగాలను గుర్తించి ప్రభుత్వం ఆగష్టు 6న జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తోంది” అని అన్నారు. ఆయన జీవితం మరియు వారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చిత్తశుద్ధితో అర్హులైన పేదవర్గాల వారికీ అందేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సిఈఓ కాంతమ్మ, ఎ.ఓ వీరభద్రప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రమేష్ బాబు, బి.సి. సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి సరోజ, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...