నీట్-2026 పేపర్ లీకేజీ విద్యార్థుల భవిష్యత్తుపై దాడి
22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీ బర్తరప్ చేయాలి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఎన్టీఏ ను పూర్తిగా రద్దు చేయాలి.
-- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్.
మోత్కూరు 13మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం మందు ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్లు లీక్ చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ దేశవ్యాప్తంగా కోట్లాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్-2026 పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీ ఘటన అత్యంత దారుణమైనదని , ఆందోళనకరమైనదని అఖిల భారత విద్యార్థి జిల్లా సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు.రాజస్థాన్‌లోని సికర్ ప్రాంతం నుంచి ఈ లీక్ నెట్‌వర్క్ బయటపడినట్లు సమాచారం వచ్చిందని,తర్వాత అసలు ప్రశ్నాపత్రంతో వాటిలో 100కు పైగా ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయని ఆరోపణలు వచ్చాయని,పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.మే 3వ తేదీన నిర్వహించిన నీట్ 2026 పరీక్షలో పేపర్ లీకేజీ,భారీ అక్రమాలు జరగటం బాధాకరమని,దీనివలన 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగటమడిందన్నారు.దేశంలో ఇప్పటికే నిరుద్యోగం,కార్పొరేట్ విద్యా వ్యవస్థ,కోచింగ్ మాఫియా భారంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఇది మరో మోసపూరిత దాడి అని అన్నారు.పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం,తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడం దేశ పరీక్షా వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైందని స్పష్టం చేస్తోంది.కేంద్ర ప్రభుత్వం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై విద్యార్థుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, డబ్బు, అవినీతి,కోచింగ్ మాఫియా, రాజకీయ సంబంధాల ఆధారంగా కొందరికి ప్రశ్నాపత్రాలు చేరడం అత్యంత ప్రమాదకర పరిస్థితి అని ద్వజమెత్తారు.ఇది కేవలం పేపర్ లీక్ కాదని,విద్యార్థుల భవిష్యత్తును అమ్ముకునే విద్యా మాఫియా కుట్ర అని అన్నారు.
నీట్ -2026 పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, లీకేజీకి పాల్పడిన మాఫియా, అధికారులు,మధ్యవర్తులు, సంబంధిత సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని,ఎన్టీఏ లో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యం,ప్రైవేటీకరణ ధోరణులపై పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టాలని,విద్యార్థుల మానసిక వేదన,ఆర్థిక నష్టానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని,భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా బలమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని,కోచింగ్ కార్పొరేట్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధించాలని,దేశ విద్యార్థులు,యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పాలకుల వైఖరిని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.విద్యను వ్యాపారంగా మార్చి, పరీక్షలను అవినీతి కేంద్రాలుగా మార్చే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జిట్టా గౌతం, విజయ్ లోకేష్ విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.