చిన్నారుల భద్రత–సంక్షేమమే లక్ష్యం.

Aug 5, 2026 - 00:49
 0  1
చిన్నారుల భద్రత–సంక్షేమమే లక్ష్యం.

జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన.

జోగులాంబ గద్వాల 4 ఆగస్టు తెలంగాణ వార్త ప్రతినిధి.

 కేటి దొడ్డి.
జాతీయ న్యాయ సేవా సంస్థ (NALSA) అమలు చేస్తున్న చిన్నారుల సంక్షేమం మరియు రక్షణకు సంబంధించిన పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా న్యాయ సేవా సంస్థ, జోగులాంబ గద్వాల ఆధ్వర్యంలో నేడు ZPHS కొండాపూర్, కేటీదొడ్డి మండలంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీ బి. శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారి (District Welfare Officer) సునంద ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. వారు చిన్నారులకు చట్టం కల్పించిన హక్కులు, నల్సా ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయం, పోక్సో చట్టం–2012 (POCSO Act), బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, బాల కార్మిక (నిషేధం మరియు నియంత్రణ) చట్టం, విద్యా హక్కు చట్టం–2009 (Right to Education Act), జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం–2015, సైబర్ భద్రతతో పాటు చిన్నారుల రక్షణకు సంబంధించిన ఇతర చట్టాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారులు ఎలాంటి వేధింపులు, దుర్వినియోగం లేదా హింసకు గురైన వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించాలని, అలాగే ఉచిత న్యాయ సహాయం అవసరమైన ప్రతి ఒక్కరూ జాతీయ న్యాయ సేవా సంస్థ టోల్ ఫ్రీ నంబర్ – 15100కు కాల్ చేసి న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.

ప్రతి చిన్నారికి సురక్షితమైన వాతావరణంలో జీవించే హక్కు, విద్యను అభ్యసించే హక్కు, హింస మరియు దుర్వినియోగం నుండి రక్షణ పొందే హక్కును భారత రాజ్యాంగం మరియు వివిధ బాలల సంక్షేమ చట్టాలు కల్పించాయని వివరించారు. విద్యార్థులు సోషల్ మీడియా, ఇంటర్నెట్‌ను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO) నరసింహ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జి. రఘు రామి రెడ్డి, సీడబ్ల్యూసీ (CWC) కౌన్సిలర్ సురేష్, చైల్డ్‌లైన్ విభాగం ప్రతినిధి నవీన్, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి హనిమిరెడ్డి, భరోసా కేంద్రం ప్రతినిధి శ్వేత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333