కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం

Aug 17, 2026 - 21:43
Aug 17, 2026 - 22:32
 0  3
కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం

తిరుమలగిరి 18 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- దేశంలో కార్మికులు, రైతులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ(ఎం) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలగిరిలో నిర్వహించిన కామ్రేడ్ కారుపోతుల కాంతమ్మ సంతాప సభ మరియు కామ్రేడ్ కారుపోతుల అంజయ్య 31వ వర్ధంతి సభలో వారు మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి, కార్మికుల హక్కులను కాలరాసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మద్దతు ధర లేక, అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.ఉపాధి నిధుల కోత కోట్లమంది కూలీలకు పని కల్పించాల్సిన ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధిస్తున్నారని, పేదరికం, నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

​సామాజిక అసమానతలు దేశంలో కుల వివక్ష, స్త్రీ-పురుష అసమానతలు మరియు సామాజిక అన్యాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు మాత్రమే ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. ​ఈ దోపిడీ, అసమానతల వ్యవస్థపై శ్రామిక వర్గాలందరినీ ఏకం చేసి, హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాటాలు సాగించడమే కామ్రేడ్ కాంతమ్మ, అంజయ్యలకు ఇచ్చే నిజమైన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎం) స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి