కలిసొచ్చిన నేల నుంచే కదన భేరి
- నేడు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
- పార్లమెంట్ ఎన్నికలకు అధినేత కేసీఆర్ శంఖారావం
- ఎస్సారార్ కళాశాల వేదికగా మరోసారి జంగ్‌సైరన్
- లక్ష మందితో బహిరంగసభ నిర్వహణకు ఏర్పాట్లు
- ఆది నుంచీ గులాబీలకు అండగా కరీంనగర్ ప్రజలు
- ఆసక్తిగా గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మరోసారి జంగ్‌సైరన్ మోగించనున్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో దాదాపు లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో తమకు కలిసొచ్చిన గడ్డ నుంచే మొదటి సభను నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. అప్పటినుంచి ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు అహరహరం శ్రమిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గుంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లను, జన సమీకరణను అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముగింట్లో నిర్వహిస్తున్న కదనభేరిని బీఆర్‌ఎస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైనదిగా భావిస్తున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే జనాకర్షక నాయకులు లేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్‌ఎస్ నేతలకు గాలం వేస్తున్న నేపథ్యంలో ఈ సభ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది. కరీంనగర్ గడ్డ మరోసారి తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని గులాబీ శ్రేణులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నాయి. ఈ సభ వేయబోయే ముద్రను గులాబీ పార్టీ శ్రేణులతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.
కరీంనగర్‌తో వీడదీయరాని బంధం
కరీంనగర్ అంటే బీఆర్‌ఎస్‌కు
ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది. కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కరీంనగర్ నుంచే మొదలుపెట్టి విజయతీరాలకు చేర్చిన చరిత్ర ఉన్నది. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి, సకల జనుల సమ్మెకు పిలుపు వరకు అనేక కీలక ఘట్టాలకు కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానమే వేదికగా నిలిచింది. 2001 మే 17న సింహగర్జన పేరిట నిర్వహించిన సభ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించింది. 2004లో బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొంతకాలానికి తెలంగాణవాదం లేదంటూ నాటి పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల బరిలో నిలిచి, అదే కాంగ్రెస్ అభ్యర్థిపై 2,01,582 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఓ అద్భుత చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమంటూనే అనేక కమిటీలు వేసి కాలయాపన చేస్తున్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నాన్చుడు ధోరణిని నిరసిస్తూ కేసీఆర్ 2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో కేసీఆర్ జైత్రయాత్రో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరింది ఇదే కరీంనగర్ గడ్డ నుంచే. 11 రోజుల అనంతర పరిణామాల్లో కేంద్రం దిగొచ్చి 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేయడం ఇంకా కండ్లముందే కదలాడుతున్న దృశ్యం. 2011 సెప్టెంబర్ 23న ప్రారంభమైన సకల జనుల సమ్మె పిలుపునకు ఎస్సారార్ కళాశాలే వేదికైంది. ఈ మైదానంలో జరిగిన బహిరంగ సభ నుంచే సకలజనుల చారిత్రక సమ్మెకు పిలుపు నిచ్చారు. 2014 ఏప్రిల్ 13న ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఇదే కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సభలో తొలి సమర శంఖారావం పూరించారు. అద్భుత విజయాలను సాధించారు. ఇలా అనేక పరిణామాలకు వేదికగా నిలిచిన కరీంనగర్ నేడు కదనభేరి మోగించనున్నది.
బీఆర్‌ఎస్‌కే ప్రజల మద్దతు
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీఆర్‌ఎస్‌కే అన్ని వర్గాల ప్రజల మద్దతు లభించింది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడింట విజయం సాధించిన బీఆర్‌ఎస్ అన్ని పార్టీల కంటే అత్యధిక ఓట్లు సాధించడం విశేషం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయంతో పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధ్యమవుతుందనే నమ్మకం బీఆర్‌ఎస్ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్ అందరికంటే ముందుగానే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈసారి బీఆర్‌ఎస్ గెలుపు తథ్యమనే అభిప్రాయం ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తున్నది. మూడు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం,అమలుచేస్తున్నవాటికి కూడా షరతులు వర్తింపజేయడం, రైతులకు పదేండ్ల నాటి కష్టాలు చూపించడం వంటి అనేక కారణాల రీత్యా కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వినోద్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న కృతనిశ్చయంతో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌తో వినోద్‌కుమార్‌కు ఉన్న సత్ససంబంధాలు, ప్రజల్లో ఉన్న ఇమేజీని గెలుపు బాటలో నడిపించేందుకు వినియోగించుకోవాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్ చేసిన అభివృద్ధి పనులను, ఇప్పటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపును సుసాధ్యం చేసుకోవాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
లక్ష మందితో కదనభేరి
పార్టీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు ప్రజల్లో మంచి పేరు ఉండటం, మూడు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవడంతో కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందనే భావన ప్రజల్లో నెలకొన్నది. కేసీఆర్ పాలనలో నిండు వేసవిలో కూడా చెరువుల మత్తళ్లు పారాయి. నిర్విరామంగా ప్రాజెక్టుల నుంచి నీళ్లు వచ్చాయి. సీజన్‌తో సంబంధం లేకుండా రైతులు పుష్కలంగా పంటలు పండించారు. కాంగ్రెస్ చేతికి అధికారం వెళ్లగానే రాష్ట్రవ్యాప్తంగా అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంటలు ఎండి పోతున్నాయని ఎంత మొత్తుకున్నా నీళ్లిచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. పంట పొలాలను రైతులు పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటి బీఆర్‌ఎస్ పాలన, నేటి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను బలపర్చాలనే నిర్ణయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ కదనభేరికి లక్ష మందిని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నది.
కదనభేరిని జయప్రదం చేయాలి ;ఎమ్మెల్యే గంగుల, ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే బీఆర్‌ఎస్ కదనభేరి సభకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలు, రైతులు, యువకులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ, కరీంనగర్ బీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. అనంతరం కళాశాలలో చేస్తున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక రైతుల కండ్ల నుంచి కన్నీరు వస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ గొంతు ఉండటం ఎంతో అవసరమని, అందుకు వినోద్‌కుమార్‌ను కరీంనగర్‌కు ఎంపీగా గెలిపించుకోవాలని సూచించారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ అవసరం ఎంత ఉంటుందో కేసీఆర్ ప్రజలకు వివరిస్తారని చెప్పారు. తెలంగాణపై స్పృహ, సోయి ఉన్న వారే పార్లమెంట్‌లో ఎంపీలుగా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవచ్చని, కదనభేరి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొదటి సభను కరీంనగర్ నుంచే కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. మేడిగడ్డ వద్ద మూడు పిల్లర్లలో సమస్యలు వస్తే.. మూడు నెలలు అవుతున్నా సమస్య ఎక్కడ వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేకపోయిందని విమర్శించారు. దీని వల్ల పంట పొలాలకు నీరు అందక.. రైతులు ఎండిన పంటలను అగ్నికి ఆహుతి చేస్తున్నారని, ఇది ఎంతో బాధను కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉంటే ఇప్పటికే ఆ మూడు పిల్లర్ల వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి మధ్యమానేరు, ఎల్‌ఎండీ ద్వారా రైతులకు సాగునీరు అందించే వారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు లోక బాపురెడ్డి, పొన్నం అనిల్‌కుమార్, భూక్య తిరుపతినాయక్ పాల్గొన్నారు.