కన్నుల పండువుగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం
జోగులాంబ గద్వాల 22 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కనుల పండువు గా జరిగింది. దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు రమేష్, దీరేంద్ర దాస్, రవి, నాగరాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన కండక్టర్ రామన్న దంపతులు శ్రీ స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. అలాగే దేవాలయానికి వచ్చిన భక్తులకు కండక్టర్ రామన్న అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానం చేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు చంద్రశేఖర్ రెడ్డి వీరారెడ్డి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.