ఓట్లేసి గెలిపిస్తున్నది పేద మధ్య తరగతి ప్రజలు గెలిచి గద్దెనెక్కి స్వారీ చేస్తున్నది సంపన్న వర్గాలు.
పేదవాళ్లకు రాజ్యాధికారం నిషేధమా?
సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులు కల్పిస్తున్న ఆటంకమా ? ప్రజలే గెలవాలి అని నినదీస్తున్నా గెలిచి తీరుతున్నది మాత్రం అక్రమార్కులు, నేరస్తులు, సంపన్న వర్గాలు, నేర చరిత్ర కలవాళ్లు.*
---- వడ్డేపల్లి మల్లేశం
రాజ్యాంగంలో పీఠికలోని అంశాలకు న్యాయం జరగాలన్న , నిజమైన హక్కులు ప్రజలకు అందాలన్న, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ సమానంగా పoచబ డాలన్న, సామ్యవాద స్థాపన సమ సమాజ ఏర్పాటు దిశగా ఈ వ్యవస్థ చేరుకోవాలన్న అందుకు తగిన దృక్పథం అభ్యుదయ భావజాలం ఆలోచన సరళి గల విద్యావంతులు ప్రజాస్వామ్యవాదులు చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది . కానీ అందుకు భిన్నంగా నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వాళ్లు, పెట్టుబడిదారులు, సంపన్నులు, అక్రమార్కులు, అత్యాచారాలు చేసిన వాళ్లు , భూస్వాములు, భూకబ్జాదారులు, మతతత్వాన్ని పెంచి పోషించే వాళ్ళు, మానవ విలువలను తుంగలో తొక్కుతున్న వాళ్లు మాత్రమే ఇవాళ కింది నుండి పార్లమెంట్ వరకు చట్టసభల సభ్యులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు . 17వ లోక్సభలో 83 శాతం మంది ప్రస్తుత రాజ్యసభలో 36% మంది నేరస్తులు నేర చరిత్ర కలిగిన వాళ్లు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే తెలియజేసినప్పుడు ఇక ఈ చట్టసభలు ఏ వర్గ ప్రయోజనం కోసం పని చేస్తాయో మన అర్థం చేసుకోవచ్చు .
అంబేద్కరీ స్టులు, ప్రజాస్వామికవాదులు, సామ్యవాద భావజాలం కలిగిన వాళ్లు, విద్యావంతులు, అభ్యుదయవాదులు, సామాజిక బాధ్యతను కర్తవ్యం గా భావించే వాళ్ళు మాత్రమే ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నుకోబడితే నిజమైనటువంటి ప్రజాస్వామ్య లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్న కారణంగా సంపన్న వర్గాల వారికి మాత్రమే టిక్కెట్టు ఇవ్వడం, కుల సమీకరణాలు, ఆధిపత్య వర్గాల చేతుల్లో రాజ్యాధికారం రాజకీయ పార్టీలు ఉండడం వలన బుద్ధిమంతులై తెలివి కలవాల్లై సమర్తులై ప్రశ్నించగలిగిన వాళ్లందరూ నిరాయుదులుగా చట్టసభల బయట అధికారానికి దూరంగా వేలివేయబడడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ దుర్మార్గ పరిస్థితులకు పేద ప్రజలు మధ్యతరగతి కారణం కాదా అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే అవును అనే సమాధానం వస్తుంది .రాజ్యాంగం పైన అవగాహన లేకపోవడం, రాజకీయాల పట్ల స్పష్టమైన వైఖరిని అవలంబించకపోవడం, యాచించే ధోరణికి ప్రజలు అనా దిగా అలవాటు పడడం, శాసించే స్థాయిలో ఆధిపత్య వర్గాలు రాజకీయాల్లో అనాదిగా కొనసాగడం వంటి కారణాల వలన సామాన్య మధ్యతరగతి ప్రజానీకం తమ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయక తప్పడం లేదు. తమ తోటి వారికి తమ నుండి వచ్చే పేద వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టాలనే సోయి లేకపోవడం చాలా విచారకరం. శాస్త్రీయ చారిత్రక కారణాలు ఏవైనా మన వర్గాలకు మనమే ద్రోహం చేసుకుంటూ ఇతర వర్గాలను ప్రశ్నించి నిందించే ప్రయత్నం చేయడం ఒక్కొక్కసారి ఆత్మవంచన ఆ నక తప్పదు. ఆ బలహీనత నుండి పేద మధ్యతరగతి సామాన్య ప్రజానీకం బయటపడిన నాడు సంపద లేకపోయినా చైతన్యం, నిజాయితీ, సమర్థత ,సేవా దృక్పథం, విజ్ఞానం, విద్య వంతులు రాజ్యమేలే అవకాశం తప్పనిసరిగా వస్తుంది... ఆ జ్ఞానోదయం నవోదయం కోసమే మేధావులు బుద్ధి జీవులు ప్రజాసంఘాలు అఖిలపక్షాలు పడరాని పాట్లు పడుతున్న ఈ పరిస్థితులలో పాలకవర్గాలు తమ ఆధిపత్యాన్ని నిర్బంధం అరచివేతను కొనసాగించడం ద్వారా ప్రశ్నను సజీవంగా లేకుండా చేయాలని పట్టుబడుతున్న కారణంగా ప్రజాస్వామ్యం ఆత్మవంచనకు గురవుతున్నది. అప్రజాస్వామ్యం రాజ్యమేలుతున్నది, సామాన్య ప్రజల జీవితం ప్రశ్నార్ధకమవుతున్నది ఈ దుస్థితి నుండి బయటపడడానికి ఎంతోమంది బుద్ధి జీవులు చేసిన ప్రయత్నాలు కొంతవరకు నెరవేరినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాదిమంది విచారణ ఖైదీలుగా అప్రకటిత నేరస్తులుగా కొనసాగుతూ తమ జీవిత కాలాన్ని అక్రమార్కులకు దాసోహం చేయక తప్పడం లేదు. ఈ పరిస్థితుల నుండి బయట పడాలి ఇందుకు ఎన్నికల సంఘం నడుం బిగించాలి సంపన్న వర్గాలకు నేర చరిత్ర గల వాళ్లకు నేరస్తులకు పార్టీ టిక్కెట్టు ఇవ్వడాన్ని నిరాకరించాలి. వ్యయ పరిమితికి మించి ఖర్చు చేసిన రాజకీయ పార్టీలను నాయకులను బోనులో నిలబెట్టాలి.
పేద వర్గాలకు రాజ్యాధికారం నిషేధమా?:-
అలాంటిది రాజ్యాంగంలో ఎక్కడా లేదు కానీ అధికారంలో కొనసాగుతున్న పాలకులు నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలు గెలుపు గుర్రాల వైపు దృష్టిసారించి అందుకు కులాన్ని ధనాన్ని కండ బలాన్ని ఆసరాగా చేసుకుని సామాన్యులు విజ్ఞానవంతులు సామాజిక స్పృహ ఉన్న వాళ్లను దూరం చేస్తున్న కారణంగా నిజంగానే పేద వర్గాలకు రాజ్యాధికారం నిషేధించినట్లుగా మారుతున్నది . తమ ఓటు ద్వారా సంపన్న వర్గాలను రాజ్యాధికారానికి తీసుకువచ్చే క్రమములో ఓటు శక్తిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించిన తీరును సామాన్య ప్రజలు ఇప్పటికైనా సోయీ తెచ్చుకొని ఆలోచించకపోతే ఎంత నష్టపోతారో ,ఈ దేశ భవిష్యత్తు ఎంత దిగజారుతుందో. !!
"ఈ దేశంలో రాష్ట్రపతి నుండి సామాన్య పేద వ్యక్తి వరకు అందరికీ ఒకటే ఓటు హక్కు చైతన్యవంతమై సామాజిక గుర్తింపుకు సమ సమాజ స్థాపనకు తోడ్పడే పరిపాలకులను ఎన్నుకునే క్రమములో ఓటు చాలా కీలకమైనది. ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా పాలకుని గా నిలబడతావా? లేక దుర్విని యోగం చేయడం ద్వారా యాచకునిగా మిగిలిపోతావా తేల్చుకోమని" డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన హెచ్చరికను సామాన్య ప్రజానీకం ఇప్పటికైనా గుర్తుతెచ్చుకోవాలి. అధికారం మన చేతిలో ఉంటే పదిమందికి అవకాశాలను కల్పించవచ్చు అధికారం ఇతరుల చేతిలో పెడితే అడుక్కుతినే బతుకు జీవితాంతం మనకు కొనసాగుతుంది. ఇందులో ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయం అందుకు సమైక్య ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకురావాల్సిన అనివార్యమైన పరిస్థితులు ఆసన్నమైనవి. అనేక రకాల బలహీనతల కారణంగా పేద వర్గాలు ఇప్పటికీ ఉచితాలు రాయితాలు, ప్రలోభాలకు లొంగిపోతున్న సందర్భం కాదనలేము. కానీ దానిని ఒక ఎత్తుగడగా సంపన్న వర్గాలు ఉపయోగించుకొని లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పి కొట్టగలిగే శక్తి మనలో దాగి ఉన్నదని గుర్తించకపోతే ఈ రకమైనటువంటి ఆధిపత్య వర్గాల రాజ్యాధికారం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది . సుమారు 56% గా ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఉద్యోగస్వామ్యంలోనూ రాజకీయ అధికారంలోనూ ఎలాంటి వాటా లేకపోవడం చాలా బాధాకరం మొక్కుబడి అంచనాలతో ఎవరికి పట్టని పద్ధతిలో బీసీల జీవన విధానం కొనసాగుతుంటే
చట్టసభల్లో రాజ్యాధికారానికి సంబంధించిన బీసీ బిల్లును ఆమోదించే వరకు దేశంలోని బీసీ వర్గాలు, బీసీ సంఘాల సారథ్యంలో ఉమ్మడిగా పోరాటం చేయవలసిన అవసరం చాలా ఉన్నది. మొక్కుబడిగా ప్రకటనలు సభలు సమావేశాలు, ధర్నాలు నిరసనలు కొనసాగుతున్నప్పటికీ అది సమైక్య ఉద్యమంగా తీర్చిదిద్దబడడం లేదు. ఇందులో రాజకీయాలు, ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, ఉన్నత వర్గాలకు తాబేదారులుగా కొందరు బహుశా మిగిలిపోతున్న కారణంగా కూడా బీసీ పోరాట ఉద్యమం బలహీనపడుచున్నది.
రాష్ట్రమైనా కేంద్రంలోనైనా ఏ ప్రభుత్వం నాయకత్వంలో ఉన్న నాయకుని సామాజిక వర్గానికి అధికారం కట్టబెట్టడం, నామినేటెడ్ పోస్టులలో కూడా అదే వర్గాన్ని నింపడం కారణంగా ఎస్సీ ఎస్టీలతోపాటు మెజారిటీగా బీసీ వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోతున్న తీ రు ఆందోళన కలిగించే విషయం . ప్రతి రాజకీయ పార్టీ ప్రజలు గెలవాలి అని ఎన్నికల సందర్భంలో ప్రస్తావించినప్పటికీ గెలుస్తున్నది అక్రమార్కులే అని చెప్పక తప్పదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ శాఖలకు సంబంధించి సమీక్షలు ఆలోచనలు చేయకుండా సంపాదన, కమిషన్లు, అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా విచ్చినం చేసి అధికారంలోకి రావాలి అనేటువంటి అక్కస్సుతో పనిచేస్తున్న రాజకీయ పార్టీల నాయకులే ఎక్కువ. ప్రమాదాల్లో,ఆకలితో,ఉపాధి,చదువులేక నష్టపోయేది, ఇతర అనేక సందర్భాలలో చనిపోయేది గాయపడేది అంగవైకల్యం సంభవించేది పేద మధ్యతరగతి వర్గాలకే అని గుణపాఠం తెచ్చుకోవాల్సిన అవసరం పేద మధ్యతరగతి వర్గాలపై ఉన్నది. పాలకులు ఏ వర్గానికి చెందినప్పటికీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాలపైన ప్రజలు ఉక్కుపాదం మోపగలిగిన నాడు ప్రజల శక్తిని పాలకులు అంచనా వేయగలుగుతారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వెనుకడుగు వేస్తారు. సామాన్య ప్రజానీకం యొక్క శక్తిని అంచనా వేసి కనీసం గానైనా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటది. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం సుమారు 80 శాతానికి పైగా ఉన్నటువంటి సామాన్య పేద వర్గాలకు బడ్జెట్లో పంచవర్ష ప్రణాళికలలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా కేవలం 10 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నట్లు తెలుస్తుంటే ఈ దేశంలో ప్రభుత్వాల ఎంపికకు కారణమైనటువంటి సామాన్య ప్రజలే చట్టబద్ధంగా తమ హక్కును కోల్పోతున్నారు.... ఇంతటి దుర్గతికి కారణమైనటువంటి ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మౌలికంగా చేదించకుండా సామాజిక న్యాయాన్ని సాధించడం గగనమే! ఆ వైపుగా అన్ని వర్గాలు దృష్టి సారిస్తే సామాన్యుల రాజ్యం రాకపోతుందా?
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు విధేయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )