పేద వర్గాల వివక్షతకు ఆనవాళ్లు  ప్రైవేట్ రంగంలో  కొనసాగుతున్న విద్యాసంస్థలు కార్పొరేట్  స్కూళ్ళు.

Jul 1, 2024 - 10:55
 0  8

రాజ్యాంగపరంగా నాణ్యమైన ఉచిత విద్య ఏదని ప్రశ్నించే వాళ్లకు సమాధానం ఉందా?

ప్రభుత్వ రంగంలో విద్యను నిర్వహించి  పేదల కన్నీళ్లు తుడవ లేరా?

---  వడ్డేపల్లి మల్లేశం

ఉచిత విద్య వైద్యాన్ని ప్రజలకు  అందించడం ద్వారా రాజ్యాంగబద్ధమైన  బాధ్యతను నిర్వహించవలసిన ప్రభుత్వాలు  స్వాతంత్రము సాధించిన నుండి ఆ వైపుగా దృష్టి సారించకుండా  రాయితీల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం యాచకులుగా మార్చడం మాత్రమే జరిగింది.  దాని పర్యవసానంగా  పేదలు మధ్యతరగతి  వర్గాల ప్రజల ఓట్లతో గెలిచిన పాలకులు  సంపన్న వర్గాల కోసం మాత్రమే పనిచేయడం క్రమంగా ఆరంభమై పరిపాలన వికృత రూపాన్ని సంతరించుకున్నది . ఈ పరిస్థితులలో సమాజమనుగడ,  వికాసo , చైతన్యానికి, అంతిమంగా సమసమాజ స్థాపనకు  దోహదపడే విద్య ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోవడం ప్రభుత్వాలు సామాజిక బాధ్యతను విస్మరించి అరకొర వసతుల తో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం వలన  అనివార్యమైన పరిస్థితులలో పేదలు  ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించక తప్పడం లేదు. కానీ  ఫీజుల జులుం కారణంగా తమ ఆర్థిక స్తోమత సరిపోక అప్పుల పాలై అనేక కుటుంబాలు ఆత్మహత్యల పాలవుతున్న సందర్భాలను గమనిస్తే  పేద వర్గాలను వివక్షతకు గురి చేయడమే నేటి విద్యా విధానం యొక్క స్వరూపం అని అర్థమవుతున్నది.

ఇటీవలి కాలంలో తమిళనాడు కేరళ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వ విద్య కొంత మెరుగైన మాట వాస్తవం.  గత  ఐదు సంవత్సరాలకు పైగా ఢిల్లీ కేజ్రేవాల్ ప్రభుత్వం  ప్రభుత్వ విద్యకు 25 శాతం బడ్జెట్లో కేటాయించడంతోపాటు  ఉపాధ్యాయ విద్యను నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పించి అమలు చేయడం  ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసిన కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఉన్నత విద్యావంతులు అధికారుల యొక్క పిల్లలు కూడా  ప్రభుత్వ పాఠశాలకు రాక తప్పడం లేదు.  దేశంలో ఉన్న పరిస్థితికి ఢిల్లీ పరిస్థితి  వ్యతిరేకంగా ఉండడాన్ని గమనిస్తే మిగతా రాష్ట్రాలలోని పాలకులు కేంద్ర ప్రభుత్వం కూడా తమ బడ్జెట్లో నిధులను కేటాయించక విద్యారంగాన్ని బలోపేతం చేయక  పేదల ఉసురు పోసుకుంటున్న  విధానానికి అడ్డుకట్ట వేయాల్సిన గురుతర బాధ్యత నేడు  చైతన్యవంతమైన ప్రజానీకం సమాజం పైన ఉన్నది.

 ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ఏనాడు ప్రమాణం చేయకపోయినా,  మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా  మనం  తిరిగి తిరిగి అదే ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న కారణంగా మన  సోయి లేని తనం పాలకులను ప్రజల ఆకాంక్షల వైపు మళ్ళించలేకపోతున్నది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం పరిపాలన ఏరకంగా ఉన్నప్పటికీ  పాఠశాలలను మాత్రం బలోపేతం చేసినట్లు అనేక సౌకర్యాలను కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని విస్తృతంగా ప్రవేశపెట్టి పేద వర్గాలకు తోడ్పడినట్లు మేధావులు తెలియజేస్తున్నారు.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసినట్లు ప్రైవేటు పాఠశాలలను అరికట్టినట్లు వార్తలు వస్తున్నప్పటికీ  చివరిదాకా కొనసాగడం లేదని అపోహలు ఉన్నాయి  ఏ రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ పాలకుల యొక్క చిత్తశుద్ధి పైన  విద్యా వ్యవస్థ ఆధారపడి ఉంటుంది.  రాజ్యాంగం ఇచ్చిన హామీ మేరకు విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే దమ్ము సత్తా ఉన్న ప్రభుత్వాలు  ప్రైవేటు విద్యాసంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని  పేద ధనిక తారతమ్యం లేకుండా, పేదవర్గాల కంట కన్నీరు రాకుండా, ఫీజులను చెల్లించలేని  దుస్థితి నుండి వారిని  కాపాడి,  వివక్షతకు గురికాకుండా  నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిస్థితులు:-

గత బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో  విద్యారంగం పైన ఏనాడు  సమీక్ష చేయకపోగా  నిర్లక్ష్యం  ప్రభుత్వ పాఠశాలను పిల్లలు లేరనే సాకుతో మూసివేసిన కారణంగా  సగానికి పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోకి వెళ్లిపోవడంతో ప్రభుత్వ విద్యా రంగం  బలహీనమైపోయినది.  అదే సందర్భంలో ప్రైవేటు పాఠశాలల యొక్క ఫీజుల జులుమును అరికట్టలేని ఆనాటి ప్రభుత్వ బలహీనత కారణంగా  వేసిన కమిషన్లు మంత్రివర్గ ఉప సంఘం ఎలాంటి నివేదికలు ఇవ్వకపోగా ఏటా ఇష్టారాజ్యంగా ప్రైవేటు  పాఠశాలలు ఫీజులను పెంచుతున్నప్పటికీ  గత ప్రభుత్వం యొక్క మౌనం కారణంగా నేడు అనేక కుటుంబాలలో చీకటి చోటు చేసుకున్నది  .విద్య ఒకే యాజమాన్యంలో ఉండాల్సిన బదులు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో విస్తరించి ఉన్న కారణాన్ని  దాని పర్యవసానంగా పేదవర్గాలకు జరుగుతున్న ఇక్కట్లను ఏనాడు కూడా పాలకులు గుర్తించకపోవడం సిగ్గుచేటు.  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా  పేద వర్గాల కంట కన్నీరు కనపడకూడదు అంటే , ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యకు దూరం కాకూడదంటే   అప్పుల పాలవుతూ కన్నీరు పెడుతున్నటువంటి పేద వర్గాలను విముక్తి చేయాలంటే  కచ్చితంగా విద్యను మొత్తాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉన్నది .

ఢిల్లీ కేరళ తదితర ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా  తొలి దశలో ప్రైవేటు పాఠశాలల్లోకి వెళ్తున్న పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది.  తర్వాత ప్రైవేటు పాఠశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనం చేసుకోవడం ద్వారా  ఒకే రకమైన విద్యను  రాష్ట్రంలోని పిల్లలందరికీ సమాన స్థాయిలో అందించడానికి అవకాశం ఉంటుంది. విద్యలో సమానత్వం లేకపోతే జీవితంలో   అనేక అసమానతలు చోటు చేసుకుంటాయి.  ఇప్పటికీ 2009 విద్య హక్కు చట్టం ప్రకారంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి 25% సీట్లను ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పేద వర్గాలకు  ఉచితంగా కేటాయించే ఏర్పాటు ఉన్నప్పటికీ అలాంటి  చర్యలు ప్రభుత్వాలు తీసుకొని కారణంగా  ఆ సీట్లలోనూ   విద్యార్థులను చేర్చుకొని ఫీజులను  వసూలు చేసుకుంటున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాల వికృత చేష్టలకు కళ్లెం వేయకపోతే ప్రభుత్వం ఉన్న ఊడిన ఒకటే . ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది  కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ  ఇలాంటి విద్యారంగ నిపుణులతో కమిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా విద్యను ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడానికి  సమాంతరంగా కృషి జరిగినట్లయితే  66లో కొటారి సూచించినటువంటి కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయడానికి , విద్యలో సమానత్వాన్ని సాధించడానికి, వివక్షతను దూరం చేయడానికి, అసమాన తలను అంతం చేయడానికి, పేద వర్గాలకు ఇబ్బందులు కలగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది .
        ఇప్పటికి అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా  కెనడా ఇంగ్లాండ్ లో కామన్ స్కూల్ విధానం కొనసాగుతూ ఉంటే  ఏ ప్రాంతంలో నివసించే పిల్లలు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాల్సినటువంటి నిబంధన ద్వారా సమానత్వాన్ని అక్కడ సాధించబడుతున్నది కానీ అభివృద్ధి చెందుతున్న దేశమైన మనదేశంలో  కమిషన్ సూచించి  58 ఏళ్లయినా ఇప్పటికీ కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టకపోవడం ప్రభుత్వ రంగంలో పాఠశాలలను నిర్వహించకపోవడం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం పాలకవర్గాల యొక్క వైఫల్యానికి కొలమానంగా భావించాలి.  .కొఠారి కమిషన్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం తమ బడ్జెట్లో నిధులను విద్యకు కేటాయించడం ద్వారా ఈ రకమైనటువంటి  విద్యారంగ పురోగతిని సాధించడానికి అవకాశం ఉన్నది కానీ పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా కేంద్రం ఒక శాతం రాష్ట్రాలు ఐదు ఆరు శాతానికి  పెరగడం లేదంటే కాదు  కేరళ 24% ఢిల్లీ 25%  తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కొంత మెరుగైన స్థితిలో ఉండగా అత్యంత హీనమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం తన బడ్జెట్లో నిధులను కేటాయించడాన్ని మనం గమనించవచ్చు.

ప్రజలు ఎన్నికల సందర్భంలోనూ  విద్యారంగ పరిరక్షణ విషయంలోనూ బుద్ధి జీవులు మేధావులు, విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో  ప్రభుత్వాలకు  సోయి తెప్పించే క్రమంలో ఉమ్మడి పోరాటాలను  బలోపేతం చేయడం ద్వారా కామన్ స్కూల్ విధానాన్ని విద్యలో సమానత్వాన్ని ప్రైవేటీకరణను నిరోధించడం ద్వారా  సాధించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది.  విద్యను ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగించే పార్టీకే తమ ఓటు అని ప్రజలు డిమాండ్ చేసి  అవసరమైతే బహిష్కరించడానికి సిద్ధపడిన రోజున ప్రజలు మెచ్చిన పేద వర్గాలకు వివక్ష లేనటువంటి  విద్యలో సమానత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.  ప్రైవేటు పాఠశాలను కొనసాగించడం అంటే పేదవర్గాలను వివక్షతకు గురి చేయడమే వారి కంఠ కన్నీరుకు పాలకులు కారణం కావడమే అని చెప్పక తప్పదు.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333