ఓటు వేయకుంటే మీ బ్యాంకు ఖాతా నుండి 350 రూపాయలు కట్..
ఓటు హక్కు వజ్రాయుధం అంటారు. తమ అమూల్యమైన ఓటు హక్కును ఉపయోగించుకోని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని పెద్దలు సూచిస్తుంటున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించబడుతుంది.
కొందరు ఓటును వినియోగించుకోవడం హక్కుగా భావించి పండుగ చేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం దండుగలా భావిస్తున్నారు. ఓటేసే రోజు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులు సెలవులు సైతం ఇస్తున్నా.. ఇంట్లోనే కూర్చుంటున్నారు తప్పా.. పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు చాలామంది ఓటర్లు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఇలాంటి బద్దకస్తుల సంఖ్య ఎలక్షన్.. ఎలక్షన్ నాటికి పెరుగుతోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పేపర్ క్లిప్ తెగ వైరల్‌గా మారింది. దాని సారాంశం ఏంటంటే.. ''ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయకపోతే మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.350 కట్ అవుతాయి. ఒకవేళ బ్యాంక్ ఖాతాలేని వాళ్లు అయితే వాళ్లు ఫోన్ రీఛార్జ్ చేయించుకుంటే ఆ రీఛార్జ్‌ల నుంచి డబ్బులు కట్ అవుతాయి. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. ఆధార్ కార్డు ద్వారా ఓటు వేయని వాళ్లని గుర్తించి ఖచ్చితంగా డబ్బులు కట్ చేస్తామని ఎన్నికల కమిషన్ ప్రతినిధి తెలిపారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు'' అంటూ ఓ పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఇది నిజమైన పేపర్ క్లిప్ కాదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ పేపర్ క్లిప్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం ఇలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే ఈ ప్రకటనపై నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఫేక్ అయినా కరెక్ట్‌గా చెప్పారని అభిప్రాయపడుతున్నారు. ఓటేయమని సెలవు ఇస్తే.. తిని, తాగి ఇంట్లో పడుకుంటూ ఓటేయడానికి మాత్రం బయట అడుగుపెట్టరని తిట్టిపోస్తున్నారు. నిజంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇలా ఓటుహక్కును వినియోగించుకోని వారి నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేలా చట్టం చేయాలని కోరుతున్నారు.