ఒక్క నిర్లక్ష్యం… ఒక జీవితం
అరైవ్ అలైవ్ తో ప్రమాదాలపై యుద్ధం – జోగుళాంబ గద్వాల్ పోలీసుల వినూత్న ప్రయత్నం
జోగులాంబ గద్వాల 24 జనవరి 2026తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల రోడ్డు మీద ఒక చిన్న నిర్లక్ష్యం… ఒక్క క్షణం ఆలసత్వం… ఒక కుటుంబం జీవితాంతం మోసే విషాదంగా మారుతోంది. ఈ చేదు నిజాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ అరైవ్ అలైవ్ ’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జోగుళాంబ గద్వాల్ జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం వంటి కారణాల వల్ల జరిగే ప్రమాదాలు ప్రజలకు వివరించారు.
రోడ్డు ప్రమాదాల వల్ల బాధిత కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్యులు అందించిన చికిత్స అనుభవాలను ప్రజలతో పంచుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను ఎలా నివారించవచ్చో స్పష్టంగా తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ఉపయోగించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. వాహనాలను పరిమిత వేగంతోనే నడపాలని సూచించారు.
ప్రత్యేకంగా యువత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే అనేక ప్రాణాలు కాపాడవచ్చని పోలీసులు తెలిపారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిబంధనల అమలు కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా అరికట్టాలని, ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రానున్న రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టనుందని అధికారులు తెలిపారు. —