ఇసుక రవాణా చార్జీలు ఖరారు
ఉచిత ఇసుక పంపిణీలో రవాణా చార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా చార్జీలు ఒకే విధంగా ఉండేలా ధరలను ఖరారు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం.. జిల్లాల వారీగా ఇసుక కమిటీలతో చర్చలు
స్టాక్ పాయింట్ల దూరం ప్రామాణికంగా ధరల నిర్ణయo.
ఉచిత ఇసుక పంపిణీలో రవాణా చార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా చార్జీలు ఒకే విధంగా ఉండేలా ధరలను ఖరారు చేసింది. ఈ మేరకు గనులశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు(జీఓ-52) జారీ చేశారు. ఇసుక రవాణా కోసం గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, లారీ అసోసియేషన్ల ప్రతినిధులతో జిల్లాల వారీగా జిల్లా ఇసుక కమిటీలు చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా అవి ఇచ్చిన సూచనల మేరకు రవాణా చార్జీలను ఖరారు చేసినట్లు గనుల శాఖ పేర్కొంది. ఇసుక సరఫరా చేసే స్టాక్ పాయింట్ల నుంచి డెలివరీ చేసేవరకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని ధ రలను నిర్ణయించారు. ట్రాక్టర్‌కు 4.5 టన్నులు, ఆరు టైర్ల లారీకి 10 టన్నులు, 10 నుంచి 14 టైర్ల లారీకి 18 నుంచి 35 టన్నుల వరకు కిలో మీటరుకు ఏ మేరకు ధర వసూలు చేయాలో ప్రభుత్వం ఈ జీఓలో నిర్దేశించింది. స్టాక్ పాయింట్ నుంచి పది కిలో మీటర్ల లోపుగా 4.5 టన్నుల ట్రాక్టర్‌కు కిలో మీటరుకు రూ.13.5 చొప్పున ధర వసూలు చేయాలి. ఆరు టైర్ల లారీకి 10 టన్నులకు గాను కిలోమీటరకు 10.7, 10-14 టైర్ల లారీకి 18 నుంచి 35 టన్నుల లారీకి 9.4 రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. 11 నుంచి 20 కి.మీ దూరంలో ఇసుక డెలివరీ చేయాలనుకుంటే, తొలి 10 కి.మీ వరకు ఆర్ 1 ధర, ఆ తర్వాత 11 వ కి.మీ నుంచి ఆర్ 2 ధర వర్తింపజేస్తారు. ఇలా కిలోమీటరు చొప్పున ధరలను ఖరారు చేశారు. రాష్ట్రమంతటా ఇవే ధరలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
ధరల నిర్ణయం ఇలా:
తొలి పది కిలోమీటర్ల మేరకు టేబుల్‌లో పేర్కొన్న విధంగా కి లో మీటర్ చొప్పున ట్రాక్టర్/లారీకి రవాణా చార్జీని వసూలు చేస్తారు. ఆ తర్వాత 11-20 కి.మీ పైన తొలి పది కిలో మీటర్లకు టేబుల్‌లో పేర్కొన్నట్లుగా ఆర్ 1 ధర, ఆ తర్వాత 11 నుంచి 20 కి.మీ వరకు అదనంగా ఆర్ ఽ-2 ధరలను వసూలు చేస్తారు. ఉదాహరణకు స్టాక్ పాయింట్ నుంచి 14 కి.మీ దూరంలో ట్రాక్టర్‌తో ఇసుక డెలివరీ చేయాలంటే తొలి 10 కిలో మీటర్లకు సగటున కిలో మీటర్‌కు రూ.13.5ల చార్జీ ఉంటుంది. ఆ తర్వాత 11వ కి.మీ నుంచి రూ. 12.8 చొప్పున ధర వసూలు చేస్తారు. ఆ పైన 4 కి.మీ దూరానికి రూ.12.8 చొప్పున రూ.51.2 చార్జీ ఉంటుంది. ఇలా మొత్తం 14 కి.మీ దూరానికి రూ.186.2 వసూలు చేస్తారు. అదే ట్రాక్టర్‌కు 40 కిమీ దూరంలో ఇసుక డెలీవరీ చేయాలంటే, రూ.519 మేర చార్జీ ఉండనుంది.