ఇంతవరకు ప్రైవేటు ఫీజుల నియంత్రణ వ్యవస్థ లేకపోవడం బాధాకరం
టిఆర్ఎస్ హయా0, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా దాటవేత ధోరణే.
ప్రభుత్వ రంగ బలోపేతానికి సవాల్ విసరాల్సిన సమయమిది. హామీలు ఆదేశాలతో అయ్యేది కాదు .
----వడ్డేపల్లి మల్లేశం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటులో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పర్చకపోగా మొక్కుబడిగా తిరుపతి రావు గారి పేరున కమిషన్ ఏర్పాటు చేసి ఏటా పది శాతం పెంచుకోవచ్చని ప్రభుత్వమే నమ్మబలికే ప్రయత్నం చేసింది అంటే ఆ ప్రయత్నం కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన విషయాన్ని గమనిస్తే నాటి పాలకులతో సహా నే టి కాంగ్రెస్ పాలకులకు కూడా ప్రైవేట్ రంగంలో ఫీజుల నియంత్రణ పైన పట్టు లేకపోవడం కాదు కనీసం పేద వర్గాల నుండి అక్రమo గా ఫీజులు వసూలు చేయడాన్ని అరికట్టలేని బలహీనతను అర్థం చేసుకోవచ్చు. అంటే అది బలహీనత కూడా కాదు పెట్టుబడి దారి వర్గ దోపిడికి మద్దతు పలకడమే. భారతదేశంలో విద్య ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని అది కూడా కామన్ స్కూల్ పద్ధతిలో కుల మతాలకు అతీతంగా ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గర కలిసి చదువుకునే ఆదర్శమైన పద్ధతి కావాలని 6o సంవత్సరాల క్రితం కొఠారీ కమిషన్ సూచిస్తే కేంద్ర రాష్ట్ర పాలకులు నాటి నుండి నేటి వరకు ఒక్కసారి కూడా ఆలోచించకుండా తోచిన పద్ధతిలో పెట్టుబడిదారులను ప్రేమించే దృక్పథంతో తమ విద్యా విధానాన్ని ప్రకటించుకుని పేదల నోట్లో మట్టికొ డుతున్నారు. గత నాలుగైదు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యా రంగం క్రమంగా 70 శాతం ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోతే ఇదే కాలంలో భారత దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా క్రమంగా 10 శాతానికి దిగజారడం 90% సంస్థలు ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోవడాన్ని గమనిస్తే ఈ దేశ పాలకులకు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే సత్తా, చిత్తశుద్ధి లేదని తెలిసిపోతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఫీజుల వ్యవస్థ
2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2017 ప్రాంతంలో అధిక ఫీజులను భరించలేమని హైదరాబాద్ జంట నగరాలలో తల్లిదండ్రులు ప్రత్యేక కమిటీగా ఏర్పాటు చేసుకొని పోరాట కార్యక్రమాలను ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఆ పోరాట రూపాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం 2016 -17 లో తిరుపతిరావు గారి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ గురించి చర్చించమని ఆదేశించినది. .రాష్ట్రంలో ప్రైవేటు వ్యవస్థ బలంగా వేల్లూ నుకొని వున్న కారణంగా కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు సరైనటువంటి స్పందన ప్రైవేటు పాఠశాల నుండి రాకపోవడం ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల నుండి ఎలాంటి వివరాలు అందక పోవడంతో పాటు మొక్కుబడిగా జరిగినటువంటి విచారణ ఒక కొలిక్కి రాకుండానే ముగిసిపోయింది. ఆ సందర్భంలో కమిషన్ ప్రైవేటు యాజమాన్యాలు క్రమంగా ప్రతి ఏటా 10% ఫీజులను పెంచుకోవచ్చునని సిఫారసు చేయడంతో అధిక ఫీజుల భారాన్ని తట్టుకోలేని మొత్తుకున్న తల్లిదండ్రులు విద్యార్థుల ఆశలకు నీళ్లు చల్లినట్లు అయినది. ఆ క్రమంలోనే ఏటా తోచిన మేరకు ఫీజులు వసూలు చేయడం వలన నేడు భారతదేశంలోనే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు.
కెసిఆర్ గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ఫీజుల విషయం గానీ తిరుపతిరావు గారి కమిషన్ ఆలోచన పునరాలోచన చేయకుండా అంతటితో వదిలిపెట్టడంతో ప్రైవేటు యాజమాన్యాలు విచ్చల విడిగా వసూలు చేసుకోవడంతో విద్యాదోపిడి హద్దు అదుపు లేకుండా కొనసాగడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నామమాత్రపు సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కానీ ప్రైవేటు ఫీజుల వ్యవస్థను నియంత్రించడం కానీ ఆ కమిషన్ సిఫారసులలో లేక అంతగా లేకపోవడం బాధాకరం. కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ ఆకునూరు మురళి గారు గతంలో "సమాజాన్ని మార్చగలిగిన ఆయుధమైన విద్య సఫలం కావాలంటే సామాజిక మార్పుకు సక్రమంగా దోహదపడాలంటే విద్యా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని" అనేకసార్లు నొక్కి చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఏమైనదో ఏమో కమిషన్ చైర్మన్ గా తన నివేదికను సమర్పించిన సందర్భంలో మాత్రం ఆ ప్రస్తావన రాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పటివరకు బోధపడలేదు. పైగా సామాజిక కార్యకర్తలు మేధావులు ఉపాధ్యాయులను ఆ నివేదిక నిరాశపరిచింది కూడా .
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విద్యాశాఖ కొనసాగుతున్న కారణంగా ఇటీవల 26 ఫిబ్రవరి 2026 రోజున ముఖ్యమంత్రి అధ్యక్షతన విద్యాశాఖ పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా విద్య కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా ఫీజులు తెలంగాణలో ఉన్నట్లు తాను అధ్యయనం చేసిన గణాంకాలతో ముఖ్యమంత్రి గారికి వివరించడం ప్రభుత్వాన్ని కొంత కదిలిస్తుందని ఆశిద్దాం. ఈ నేపథ్యంలోనే పూర్వాపరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రైవేట్ రంగంలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతోపాటు తల్లిదండ్రుల పైన అదనపు భారం పడకుండా చూడాలని గత 10ఏళ్లుగా అధికంగా ఫీజులను పెంచింది కూడా రాష్ట్రంలోనే అని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించడం కారు చీకట్లో కాంతిరేఖ. అయితేనేమి గత ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేటు వ్యవస్థను నిర్వీర్యం చేయడం పట్ల స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రమక్రమంగా ప్రభుత్వ రంగం బలోపేతం అవుతుంది. ఆ విధానం ఢిల్లీ రాష్ట్రంలో కీజ్రీవాల్ నాయకత్వంలో కొనసాగిన ప్రభుత్వ కాలంలో అమలయింది. అంతేకాదు దేశానికి ప్రపంచానికే ఒక దిక్సూచిగా పనిచేసింది కూడా.
విద్యా కమిషన్ చైర్మన్ పరిశీలన చేదు వాస్తవాలు:-
ముఖ్యమంత్రి ఆదేశించి ముచ్చటగా మూడు మాసాలు పూర్తవుతున్న ఇప్పటివరకు నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ఏర్పడినటువంటి దాఖలా ఏమీ లేదు. అంతేకాదుఇటీవలి సమీక్ష సందర్భంలో కూడా తిరిగి ఆ అంశాన్ని పరిశీలించవలసినటువంటి అవసరం ఉండే. ఈ మధ్యన ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు పేద బలహీన మధ్యతరగతి వర్గాల నుండి ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం ఉన్నట్టుగా ఫీజులను దండుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారని విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో పాటు స్వయంగా చైర్మన్ ఆకునూరి మురళి గారు కూడా ఆందోళన వ్యక్తం చేయడం సీఎం గారికి నివేదిక ఇవ్వడాన్ని మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. పదేళ్ల కిందట తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో సరాసరి వార్షిక ఫిజు 50 వేలు ఉంటే ఇప్పుడు అది 1,90,000 కు చేరుకున్నట్లు తెలుస్తుంది. గత కమిషన్ సిఫారసు చేసినట్లు కాకుండా ప్రైవేటు విద్యాసంస్థలు 10 నుండి 30% ఫీజులు పెంచుకుంటూ పోవడం వల్లనే ఇంత భారీ దోపిడీకొనసాగుతున్నట్లు చైర్మన్ ప్రకటించారు. 2015-16లో తెలంగాణలో సరాసరి ఫీజు 50,000 ఉంటే ఉత్తరప్రదేశ్లో 35,000 తమిళనాడులో 40,000 ఆంధ్రప్రదేశ్లో 38, ooo ఉంటే 2025 -26 లో ఉత్తరప్రదేశ్లో ఫీజు 95,000 ఉండగా తమిళనాడులో లక్షకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో 1,50,000 కు చేరుకోగా ఢిల్లీలో ఒక లక్ష 60,000 కాగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 1,90,000 కు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమని కమిషన్ అభిప్రాయపడింది.
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని ఇంజనీరింగ్ రంగంలో మాదిరిగా ఫీజులను నియంత్రణకు ప్రత్యేక కమిటీ ని సూచిస్తూనే రవాణా బోర్డింగ్, విహారయాత్రలు, క్యాప్టేషన్ ప్లీజ్, పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, బూట్లు, నోటు పుస్తకాల పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడి కి దోపిడీకి పాల్పడుతున్నాయని కమిషన్ ఆందోళన చెందింది. అన్ని రంగాలలో కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో అధిక ఫీజులు బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ప్రకటించగానే ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది అయితే మాత్రం ప్రయోజనం ఏమిటి?. విద్యా కమిషన్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి సిఫారసులు తీసుకున్న తర్వాత కూడా వాస్తవ విషయాలను అవగాహన చేసుకుని అదుపు చేయడానికి ఇంతవరకు ఎలాంటి ప్రయత్నం జరగకపోవడం బాధాకరం. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్లు డీఈవోల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో విశ్రాంత జడ్జి నాయకత్వంలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించినప్పటికీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఉపాధ్యాయ, విద్యార్థి, మేధావి, సామాజిక ఉద్యమకారుల సంఘాలతో సమావేశం నిర్వహించడం ద్వారా ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.
విద్యను వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించే సత్తా దేశంలోని ఏ ప్రభుత్వానికి లేదు. కానీ గతంలో కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకొని అధిక బడ్జెట్ను కేటాయించినట్లు(25% ) ఆ రకమైనటువంటి స్పృహ చొరవ లేకుండా కేవలం ఆదేశాలతో సరి పెడితే బడ్జెట్లో హెచ్చు నిధులు కేటాయించకుండా ఉంటే పెట్టుబడిదారుల పంచన చేరి దోపిడిని మరింత ప్రోత్సహిస్తే ప్రయోజనం ఏముంటుంది? టిఆర్ఎస్ నాయకత్వంలో ఏడు శాతం నిధులు దాటకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అంచున కేటాయించినప్పుడు ఇక రెండు ప్రభుత్వాల మధ్యన ప్రత్యేక తేడా ఏమున్నది? కావలసింది స్ప్రుహ, చొరవ, అంకితభావం, పేద వర్గాల పట్ల సామాజిక చింతన కీలకం. ఇవేవీ లేకుండా మభ్య పెట్టే ప్రకటనలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ధశాబ్దం క్రితం హైదరాబాదులో వచ్చిన మాదిరిగా తల్లిదండ్రుల స్థాయిలో ఉద్యమం బలంగా వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు మేల్కొంటాయి. తమ బాధ్యత నిర్వహిo చి ప్రైవేటు వర్గాలకు ప గ్గాలు వేస్తాయి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు,హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)