అసత్య ప్రచారాలపై వే టు న్యూస్‌కు నోటీసులు పంపేందుకు సిద్ధం
సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు: వేల్పుల రవికుమార్–పద్మకుమారి
పెనుగంచిప్రోలు, తేదీ:21-02-2026: తమపై అసత్య వార్తలు ప్రచారం చేసినందుకు వే టు న్యూస్పై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వేల్పుల రవికుమార్–పద్మకుమారి దంపతులు తెలిపారు.
తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే రాజకీయ పార్టీలో చేరేందుకు రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం చేయడం పూర్తిగా అసత్యమని వారు స్పష్టం చేశారు.
వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కథనాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ తమ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
నిర్ధారణలేని సమాచారం ఆధారంగా కథనాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పెనుగంచిప్రోలు గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి తీర్చిదిద్దామని తెలియపరిచారు, తమ సొంత డబ్బులతో లక్షలాది రూపాయలు గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేసామని వారు తెలియపరిచారు
అవార్డు తర్వాత దాడులు పెరిగాయి
పెనుగంచిప్రోలు గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందిన తర్వాత నుంచే తమ కుటుంబంపై లక్ష్యబద్ధ దాడులు ప్రారంభమయ్యాయని దంపతులు తెలిపారు.
గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయని చెప్పారు.
కొందరు వ్యక్తులు కులపరమైన ప్రేరణలతో ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ మార్పు ప్రచారం ఖండన
తాము ఎలాంటి ఇతర పార్టీలను సంప్రదించలేదని, అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు.
“మా ఊపిరి ఉన్నంతకాలం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారితోనే మా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది” అని వారు తెలిపారు.
ఎలాంటి దుష్ప్రచారాలకైనా ప్రజలు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు.
చట్టపరమైన చర్యలు
అసత్య వార్తలను ప్రచారం చేసిన వారిపై భారీ పరువు నష్టం దావా వేయడమే కాకుండా, సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.ఈ ఘటనపై రాజకీయ,సామాజిక వర్గాల్లో చర్చ సాగుతోంది.నిజానిజాలు వెలుగులోకి వచ్చే వరకు ప్రజలు అపోహలకు లోనుకాకుండా ఉండాలని వేల్పుల దంపతులు కోరారు.