అనారోగ్య పొగాకు వాడకo నియంత్రించడానికి భారీగా పన్నులు విధించడమే మార్గమా?
అవునులే !! దానితో పాటు ప రిణా మాలను అవగతం చేయించటం కూడా కీలకమే.
గాయం కాకుండా క్రూర విషజీవిని అంతం చేయలేo కదా.
--- వడ్డేపల్లి మల్లేశం.
విషం అని తెలిసిన అమృతంలా తాగు తున్నారు. కూల్ డ్రింక్స్ లో హానికారక పదార్థాలు ఉన్నాయని తెలిసినా ప్రభుత్వం అనుమతి స్తుంది ప్రజలు సే విస్తున్నారు. ప్రాణాంతక క్యాన్సర్, శ్వాసకోశ, గుండె వ్యాధుల బారిన పడతారని హెచ్చరించినా, సిగరెట్ బీడీ డబ్బాలపైన రాసి పెట్టినా కూడా వాటిని పీలుస్తూ చుట్టుపక్కలున్న జనాన్ని వాతావరణాన్ని కూడా కలుషితం చేయడానికి గాలిలోకి పొగ విడుదల చేస్తున్నారంటే ఈ మానవ సమాజం ఎటుపోతున్నది? ఆలోచన అవగాహన లేక నా? లేక నిర్లక్ష్యమా? దీని వెనుక ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉత్సాహం లావాపేక్ష లేదంటారా? సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలు కేవలం సేవా దృక్పథంతో వ్యవహరించాలి కానీ లాభాపేక్షతో కాదు. ఇది కనీస మైనటువంటి ప్రజాస్వామి క సూత్రం. ఈ సూత్రాన్ని ప్రభుత్వాలు ఏనాడో పక్కనబెట్టి మద్యపానం ధూమపానం డ్రగ్స్ వీటితో పాటు క్లబ్బులు పబ్బులు ఈవెంట్లను కూడా చట్టబద్ధంగా మార్చి విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నది లాభా పేక్షతోనేనా? ప్రభుత్వాలకు నిధులు తప్ప ప్రజల కన్నీళ్లు పట్టవా ?
ప్రభుత్వాల కంటి తుడుపు చర్యలు:-
అంతర్జాతీయ స్థాయిలో( నో స్మోకింగ్ డే) పొగాకు వ్యతిరేక దినం పేరుతో ప్రపంచంలోని అనేక దేశాలు 31 మే రోజున ఉత్సవాలు నిర్వహించుకోవడం సాంప్రదాయంగా చూస్తూ ఉన్నాం .ధూమపానం యొక్క దుష్ప్రభావాలు, పొగాకు వాడకంలోని దుర్గుణాలు, అనారోగ్య హేతువులు, అనాదిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తీరు, ప్రపంచంలోని కొన్ని దేశాల ఒత్తిడి మేరకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO 1987లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ప్రకటించడం వెనుక ఎన్ని కన్నీటి గాధలో? ఎన్ని జీవులు నేలరాలి నాయో? అదంతా సమీక్షించుకుంటే అంతులేని విషాద గాధ కాదా? కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్ణయానికి వచ్చి ప్రపంచ సంస్థ ఒక హెచ్చరికగా నిర్ధారణ చేస్తే కూడా 1987 నుండి అంత పెద్ద మార్పు లేనట్లు, పొగాకు వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు, అనివార్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు భారీగా పన్ను లను విధించడం ద్వారా చేతులు దులుపుకున్నట్లు మాత్రమే మనకు అర్థం అవుతున్నది. ధూమపానం విష ఫలితాలను ప్రజల్లో ప్రచారం చేయడం, ఆ వైపు ప్రజలు కన్నెత్తి చూడకుండా అడ్డు కోవడం, ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించడం, పెద్ద ఎత్తున ర్యాలీలు ఊరేగింపులు సభలు సమావేశాల ద్వారా చైతన్యం తీసుకురావడం నేపథ్యంగా ఈ దినోత్సవం ఏర్పడినప్పటికీ ఆ తదనంతర కాలంలో మొక్కుబడిగా మాత్రమే కొనసాగుతున్నట్లు మనకు అనేక గణాంకాల ద్వారా అర్థమవుతుంది. "" తాత్కాలిక ఆనందం తృప్తి ఉల్లాసం కోసం విలువైనటువంటి మానవ శరీరాన్ని మృత్యువుకు అర్పణ చేయడం అంటే
తన కనీస కర్తవ్యాన్ని, మానవతా దృక్పథాన్ని, సామాజిక బాధ్యతను విస్మరించడమే అవుతుంది." ముఖ్యంగా క్యాన్సర్, గుండె ఆరోగ్యం చెడిపోవడం, శ్వాసకోశ వ్యాధులను ముంచెత్తి మానవ జీవితాన్ని దుర్భరం చేస్తున్నటువంటి పొగ తాగే అలవాటును కనీసం గానైనా కట్టడి చేయడం కోసం అనివార్యమైన పరిస్థితులలో ప్రభుత్వాలు వాటి వినియోగం పైన భారీగా పన్నులు వేయడానికి పూనుకోవడం ఒక రకంగా శుభ పరిణామమే.కానీ ఈ అలవాటుకు బానిసలైన వాళ్లు భారీగా ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు కొనుగోలు శక్తి సన్నగిల్లడంతో లక్షలాది కుటుంబాలు వీధిన పడుతున్న సందర్భంగా ఈ విష పరిణామా న్ని ప్రపంచవ్యాప్తంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ముఖ్యంగా మగవాళ్ళు ఈ అలవాటుకు బానిసలై కుటుంబ సభ్యుల ఒత్తిడిని కూడా లెక్కచేయకుండా అతిగా వినియోగిస్తున్న కారణంగా లక్షలాది ప్రాణాలు గాలిలో కలిస్తే ఆ కుటుంబాలు వీధిన పడుతున్న విషయం కుటుంబ సభ్యులు, ప్రభుత్వాలు, సామాజిక ప్రజా సంఘాలు మరిచిపోతే ఎలా? ఇదే సందర్భంలో ప్రభుత్వాలను పొగాకు వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు?"" పొగాకు ఆకు సేకరణ పొగాకు పండించిన రైతులకు అధిక ధరలు ఒక దశలో పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సందర్భాలు మనకు గుర్తుండే ఉంటాయి. కానీ ఆ డిమాండ్లు ఆరోగ్య కోణంలో సరైన వి కావు. కొన్ని పేద కుటుంబాలు అనివార్యంగా పొగాకు ఉత్పత్తులపై ఆధారపడితే పాలకులు సామాజిక చింతన కలవారైతే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి కానీ మనుషులను చంపే ఉపాధి కల్పించడం అంటే ప్రభుత్వాలు మానవత్వాన్ని మరుగున పడేయడమే అవుతుంది.""
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనేక తీవ్ర అనారోగ్యాల బారినపడి నష్టపోతూ ఉంటే పొగాకు వినియోగం నుంచి ప్రజలను దూరం చేయడం కోసం ప్రపంచంలోని చాలా దేశాల వాళ్లు సంబంధిత పొగాకు ఉత్పత్తుల పైన భారీగా పన్ను లు వేయడం ద్వారా ప్రజల మనసులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక చిట్కా మాత్రమే. దీనితో పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలను కూడా స్వచ్ఛందంగా ప్రజాసంఘాలు ప్రభుత్వాలు కూడా తీసుకున్నప్పుడు మాత్రమే..... కటువుగా వ్యవహరించి శిక్షలు విధించి పంటల అనుమతిని నిషేధించినప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. 2022లో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో సిగరెట్టు ప్యాకెట్ల ధరపై పన్నులు విధించిన వాటా శాతం రూపంలో ఈ క్రింది గణాంకాలను ఒక్కసారి పరిశీలన చేద్దాం.
ఫ్రాన్స్ 83.8%
యునైటెడ్ కింగ్డమ్ 83.7%
థాయిలాండ్ 81.3%
బ్రెజిల్ 8o.3%
సౌదీ అరేబియా 73.8%
శ్రీలంక 66.9%
భారతదేశ 57.6%
చైనా 52.2%
పాకిస్తాన్ 51.8% అమెరికా 37.4%
ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ 2026 నివేదిక ప్రకారం పై గణాంకాలను పరిశీలించినప్పుడు ప్రజలను కట్టడి చేసే సాకుతో ప్రభుత్వాలు అదనపు ఆదాయాన్ని కూడగట్టుకోవడమేనా? వీటి ఉద్దేశం అని అనుమానం రాక మానదు.
ఏది ఏమైనా పొగ తాగే వాళ్లను కుటుంబ సభ్యులు నివారించడం హెచ్చరించడం తో పాటు ప్రభుత్వాలు పూర్తిగా వీటి ఉత్పత్తిని కూడా
లేకుండా చేసినప్పుడు మాత్రమే కట్టడి అవకాశం ఉంటుంది.అదే మాదిరిగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి ఉమ్మడి కార్యాచరణ ద్వారా ఒక ఒప్పందానికి తీసుకు రాగలిగితే మరింత ఉత్కృష్టమైన స్థాయిలో వీటి నివారణ సాధ్యమవుతుంది. ఆరోగ్య మైనటువంటి దేశాలను ముఖ్యంగా ఆరోగ్య భారతావనిని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)