'SIR' ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Jul 11, 2026 - 20:27
 0  0
'SIR' ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు: సీఈఓ సుదర్శన్ రెడ్డి

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి కీలక స్పష్టతనిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ వినూత్న సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (BLO) పంపిణీ చేసే 'ఎన్యూమరేషన్ పత్రాన్ని' పూర్తిగా నింపి సమర్పిస్తేనే రాబోయే డ్రాఫ్ట్ (ప్రాథమిక) ఓటర్ల జాబితాలో పేరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అర్హులైన ఓటర్లను గుర్తించి, బోగస్ ఓట్లను తొలగించేందుకు దాదాపు 24 ఏళ్ల తర్వాత (చివరిగా 2002లో జరిగింది) చేపట్టిన ఈ భారీ కసరత్తులో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల జూలై 31న విడుదలయ్యే డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువులోగా 'ఫామ్-6' ద్వారా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాల్లో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదని, ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడం లేదంటూ మీడియా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలపై సీఈఓ సీరియస్‌గా స్పందించారు. బీఎల్వోలు తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఫామ్‌లను స్వయంగా అందజేసి, ఓటర్ల వివరాలు సేకరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కరాఖండిగా ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని లోపాలను సరిదిద్దేందుకు పర్యవేక్షకులను (Supervisors) రంగంలోకి దించామని, హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ పూర్తి చేసే అవకాశం ఉందని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333