సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో గందరగోళం

ప్లాస్టిక్ బ్యాగుల్లో కాంటా వేయమంటున్న హమాలీలు
కాంటాలు ఆగడంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో
సూర్యాపేట:- శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాస్టిక్ బ్యాగులలో కాంటాలు వేయమంటూ హమాలీలు ఆగ్రహించి వెళ్లిపోయారు. అప్పటికే వ్యవసాయ మార్కెట్లో ధాన్యపు టెండర్ ప్రక్రియ ఈ నామ్ పూర్తయింది. అయితే బస్తాలలో ధాన్యం నింపడం, కాంట వేయడం, ట్రేడర్కు అప్పగించడం మిగిలింది. శుక్రవారం దాదాపు 30 వేల బస్తాలకు పైగా ధాన్యం సూర్యపేట వ్యవసాయ మార్కెట్కు వచ్చింది. ధర మాత్రమే నిర్ణయించడం, బస్తాలలో ధాన్యాన్ని నింపకుండా హమాలీలు ఆకస్మికంగా వెళ్లిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి 65 పై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ విషయంలో వ్యవసాయ మార్కెట్ అధికారులతో పలుమార్లు చర్చించి విన్నవించిన రైతులు విసిగిపోయి తప్పదనుకొని ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ వద్ద జాతీయ రహదారి 65 పై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు వెంటనే స్పందించి సూర్యాపేట ఆర్డిఓ, ఎంఆర్ఓ, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో ఫోన్లో సంప్రదింపులు జరిపి శనివారం ధాన్యాన్ని కాంటా వేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.