సామాజిక న్యాయానికి పాతరేయడమే బిజెపి అనుసరిస్తున్న దేశ భక్తా ? CPM
జోగులాంబ గద్వాల 30 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని ,పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యల పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.