వయోవృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
జోగులాంబ గద్వాల25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, వారోత్సవాల్లో భాగంగా వారికి అవసరమైన సేవలను అందిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి సునంద తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,బస్తీ దవాఖానలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 సందర్భంగా వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.
ఈ శిబిరాల్లో వయోవృద్ధులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా కంటి పరీక్షలు, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులను ఉచితంగా అందించినట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు,శాఖ ఉన్నతాధికారుల సూచనలతో ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.వయోవృద్ధుల ఆరోగ్య వివరాలను వైద్యులకు తెలియజేస్తూ,వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా డే కేర్ సెంటర్ నిర్వాహకులు మహేష్ నాయుడు మరియు సిబ్బంది సహకరించినట్లు తెలిపారు.
వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, వారోత్సవాల్లో భాగంగా వారికి అవసరమైన సేవలు అందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ, వైద్యసిబ్బంది, మహిళా,శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సిబ్బంది,డే కేర్ సెంటర్ నిర్వాహకులు,వయోవృద్ధులు పాల్గొన్నారు.