పండగలకే కాదు ప్రతిరోజూ కలిసి ఉండండి
ఊరేగింపులోనే కాదు ఊరిలో ఏ సమస్య వచ్చినా ఊరంతా ఒక్కటవ్వండి - గణనాథుని సందేశం.
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల.: వినాయక చవితి సందర్భంగా ఇన్ని రోజులు పూజలు అందుకొని నేడు నిమర్జనానికి తరలి వెళ్లాయి ఈ 9 రోజులు మనతోనే ఉన్న బొజ్జ గణపయ్య... మన ఇంటి బిడ్డలా కొలువై, మన పూజలు అందుకుని, మన కోరికలు విని నిమజ్జనానికి బయలుదేరాడు. నీటిలో కరుగుతూ కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చి వెళ్తున్నాడు. నీటిలో మునిగిపోతున్న గణపయ్య "పండగలకే కాదు ప్రతిరోజూ కలిసి ఉండండి. ఊరేగింపులోనే కాదు ఊరిలో ఏదైనా సమస్య వచ్చినా ఊరంతా ఒక్కటవ్వండి.అందరూ కలిసి ఉండండి మళ్ళీ ఏడాది తిరిగి వస్తాను.అంటూ చేయి ఊపుతూ చెబుతున్నట్లు ఉన్న ఆ ఫోటో కంటినిండా నీరు తెప్పిస్తోంది.నిమజ్జనం అంటే వీడ్కోలు కాదు - ఒక ప్రతిజ్ఞ వినాయక నిమజ్జనం అంటే విగ్రహాన్ని నీటిలో కలపడం మాత్రమే కాదు. మనలోని అహంకారాన్ని, కులమత భేదాలను, గ్రామంలోని గొడవలను నీటిలో కలిపి, ఐక్యతను చాటాలని పెద్దలు చెబుతారు.డీజేల మోతలో, డ్యాన్సుల హోరులో మనం మరిచిపోతున్న అసలు సందేశం ఇదే. పండగ రోజు మాత్రమే కాదు, ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి ఇంట్లో విషాదం జరిగినా ఇలాగే ఊరంతా ఒక్కటై నిలబడాలి.గణపయ్య నీటిలో కరిగిపోయినా ఆయన ఇచ్చిన ఐక్యతా సందేశం మన గుండెల్లో చిరకాలం నిలిచిపోవాలి.