సమకాలీన అంశాలపై ప్రగతిశీల శక్తులుగా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది
సమకాలీన అంశాలపై ప్రగతిశీల శక్తులుగా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది
ఎందుకంటే కవులు రచయితలు ప్రజాపక్షపాతులు.
---- వడ్డేపల్లి మల్లేశం
సాహిత్య సృజన కార్లు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పని చేయవలసిందే. కానీ దానికి భిన్నంగా కొందరు పాలకులకు అమ్ముడుపోయి, ప్రభుత్వాలకు బానిసలుగా పదవుల కోసం అవసరమైతే ఎంతకైనా దిగజారే వాళ్లను మనం చూస్తూనే ఉన్నాం. పాలక పక్షాల పరంగా జరిగే తప్పులు, వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక ధోరనులే వాళ్లకు బాగా నచ్చుతాయి. కొన్ని పత్రికలకు ప్రభుత్వానికి అమ్ముడుపోయి రాసిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.అయితే వాళ్ళు ఏమి నడకనేర్వని బాల్య కవులు కాదు ఒకప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్లే అయితే ఏదో ఒక స్వార్థం, మరేదో బలహీనత, సులభంగా కొనుగోలు కు ఆసక్తి చూపే తత్వం వల్ల సాహిత్య రంగం ఎంతో నష్టపోయింది. ఇలాంటి ధోరణి కొనసాగినంత కాలం ఎప్పుడైనా వ్యవస్థకు నష్టమే అందుకే కవులు కళాకారులు రచయితలు స్పష్టంగా తమ వైఖరిని ప్రకటించడంతోపాటు ప్రభుత్వాలకు వ్యతిరేకం అని కాదు కానీ ప్రజల పక్షాన పని చేస్తామని స్పష్టంగా డిక్లేర్ చేయవలసిన అవసరం ఉంది. ఆ సత్తా దమ్ము ధైర్యం రచయితలకు ఉండాలి కదా! వాళ్లను ఎన్ని ప్రలోభాలు వేధిస్తున్నాయో మరి... సమాజ మార్పుకు దోహదపడని విద్య తృప్పు పట్టిన కత్తిలాంటిది అని ప్రముఖ విప్లవ రచయిత మేధావి వక్త వరవరరావు గారు కొన్ని దశాబ్దాల క్రితమే ప్రకటించడం జరిగింది. అంతేకాదు వారి అభిప్రాయం ప్రకారం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు అయినా ముందుగా వాళ్లంతా ఈ దేశ పౌరులు, ఆ తర్వాతనే ఉద్యోగులు. న్యాయవాదులు న్యాయమూర్తులు మేధావులు విజ్ఞానవంతులు కలెక్టర్లు ఎస్పీలు ఇతరత్రా ఏవైనా! అందుకే వాళ్లందరికీ కూడా పౌరులకు ఉండే హక్కులు ఉంటాయని తేల్చి చెప్పిన విషయాన్ని కూడా కవులు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ మేధావులు అందరిని కూడా జనజీవన స్రవంతిలో కలిసే విధంగా కలుపుకుపోవడం, ప్రోత్సహించడం, వాళ్ళ అభిప్రాయాలను కూడగట్టడం కూడా సాహిత్య కారుల యొక్క బాధ్యత.విద్యా లక్ష్యాలు, సాహిత్య లక్ష్యాలు ప్రయోజనాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి యొక్క గమ్యం మాత్రం ఒకటే. మరింత మెరుగైన వ్యవస్థను ఆవిష్కరించుకోవడం, భావి జీవిత సవాళ్లను అధిగమించే విధంగా భావి భారత పౌరులను తీర్చిది ద్దడం, సమాజం యొక్క హితాన్ని కోరడం, అందుకు అవసరమైతే పోరాటం చేయడం ఇవన్నీ కూడా దాదాపుగా సాహిత్యానికి విద్యకు వర్తిస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే సమ సమాజ స్థాపన దిశగా వ్యవస్థను ప్రయాణింప చేయడంలో సాహిత్యం చాలా ముందు వరుసలో ఉంటుంది కనుక సామాజిక మార్పుకు దోహదపడని ఏ సాహిత్యమైన ఏ ప్రక్రియలో రాసిన రచనలైన నిష్ప్రయోజనమే అని చెప్పక తప్పదు. పైగా లక్ష్యము లేని, మార్పుకు దోహదపడని, అవకాశవాద తత్వాన్ని ప్రోత్సహించే రచనలు సమాజ మార్పుకు సామాజిక పరిణామక్రమానికి ప్రమాదకరం కూడా! ప్రజాపక్షపాతిగానే రచయిత కొనసాగవలసిన అవసరముంది ఆ క్రమంలో అవసరమైతే తన ధోరణి, చింతన, ఆలోచన, తాత్విక నేపథ్యం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించవచ్చు... పెట్టుబడిదారీ వ్యవస్థను నిందించవచ్చు... భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించే క్రమంలో పనిచేయవచ్చు కూడా. మెజారిటీ ప్రజానీకం గూర్చినటువంటి చర్యలు, ఆలోచన, రాజ్యాంగబద్ధంగా అవకాశాలు కల్పించే తత్వం పాలకులకు ఉండదు అని చెప్పడానికి భారతదేశంలో బడ్జెట్లో పంచవర్ష ప్రణాళికలో సామాన్య వర్గాలకు కేటాయిస్తున్న అరకొర నిధులే పెద్ద ప్రాతిపదిక సాక్ష్యం కూడా. ఏటా ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో సామాన్య పేద కుటుంబాలకు వారి దామాషాకు భిన్నంగా 10 శాతం కూడా ఖర్చు చేయడం లేదని బుద్ధి జీవులు రాజకీయ పండితులు హెచ్చరిస్తుంటే అలాంటి పరిస్థితుల్లో సామాన్యుల పక్షాన పని చేయనటువంటి కళాకారులు రచయితలు కవులు పాలకులకు బానిసలు అయితే అంతకంటే హీనమైన చరిత్ర మరొకటి ఉండదు. ఎన్ని కష్టాలు ఎదురైనా, నిర్బంధాలు ఒత్తిడి కలిగించినా, మా మతం మానవత్వం... మా కులం మంచితనం.... అనే ధోరణిలో అణగారి పోతున్న, అవహేళన అవమానాలకు గురవుతున్న, వివక్షత అణచివేత చిరునామాగా మారినటువంటి అట్టడుగు వర్గాల పక్షాన నిలబడిన వాళ్లే నిజమైనటువంటి రచయితలు కవులు కళాకారులు. హక్కులకై కలబడాలంటే బాధ్యతలకు నిలబడాలి అలాగే ప్రజల పక్షాన నిలబడగలిగితేనే సామాజిక మార్పు గూర్చి ప్రశ్నించే హక్కు పాలకులను హెచ్చరించే స్థైర్యం కవులకు సాధ్యమవుతుంది .
ప్రగతిశీల శక్తులుగా పనిచేస్తున్నారా ?
నిజంగా అనేక విషయాలను విస్మరిస్తున్నారు రచయితలు. ప్రభుత్వాల యొక్క పేడ దొరణుల పట్ల స్పందన కూడా లేకుండా సులభమైన అంశాలను వివాదాస్పదం కానీ విషయాలను మాత్రమే రచన వస్తువులుగా సేకరిస్తే అది తప్పించుకునే ధోరణి అవుతుంది .మతం మత్తును, కులం కుళ్ళును ప్రజల్లోకి వ్యాపింపజేసి క్రియాశీలకంగా ఆలోచింపకుండా నిర్వీర్యం చేసే కుట్ర దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. మత్తులో కొందరు, ఆధ్యాత్మిక చింతనలో కొందరు, అనారోగ్యంలో మరేందరో చితికిపోయి దిగబడిపోయి ఈ దేశం గురించి పట్టించుకోకుండా నిర్వీర్యం అయిపోతుంటే ప్రశ్నించకుండా అడ్డుకోవడమే పాలకుల లక్ష్యమైనప్పుడు వాళ్లకు ఇంతకు మించిన ఆనందం మరెక్కడిది?
-- అవకాశవాద రాజకీయాలను చూసి చూడనట్లుగా రచయితలు వ్యవహరిస్తున్నారు.
-- పాలకుల పక్షాన పనిచేసి స్వార్థపరులుగా బాధ్యతారా హిత్యంతో స్వప్రయోజనాలకు బతుకుతున్న వారు కూడా మరేందరో .
-- ప్రశ్నించడం, ప్రతిఘటించడం మరిచి ఆరాధించడం ప్రశంసించడానికి మాత్రమే పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు.
--- కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కటోర సత్యానికి కనీసం స్పందించకుండా, ఫిర్యాదు చేయకుండా, వ్యవస్థ నడుస్తుంటే ఆ విషయంలో కూడా కటువుగా వ్యవహరించే ధోరణి రచయితలకు లేకపోవడం బాధాకరం.
--- దాటవేసే ధోరణి, పట్టించుకోని తత్వం, పేదల పట్ల ఆసత్వం, సంపన్నులకు సానుకూల మద్దతు వంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న వాళ్లు కూడా ఎందరో.
-- ప్రగతి శీలురు తమ రచన ప్రక్రియలో భాగంగా కార్యక్రమాలలో లినమై సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటే అడ్డుకునే శక్తులు, మతతత్వ వాదులు, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ముసుగులో చంపడానికి బెదిరిస్తుంటే తోటి కళాకారులు రచయితలు పిడికిలి బిగించి ఉమ్మడిగా నిలిచిన సందర్భం మనకు ఎక్కడైనా తారసపడిందా? ఎవరి వరకు వారే అనే ఒంటరితనం తన దాకా వస్తే కానీ తెలియదు.
--- సమాజ హితాన్ని కోరేదే సాహిత్యమని సంతృప్తి పడితే నిష్ప్రయోజనం. సమాజాన్ని చైతన్యం చేసే క్రమంలో కొన్ని వ్యవస్థల పైన ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం కూడా రచయితలు చేయవలసి ఉంటుంది.
-- సాహిత్యం అంటే భాష, రచనా ప్రక్రియలు, ఆలోచన ధోరణులు మాత్రమే కాదు. పెడదారి పడుతున్న రాజకీయ ధోరణి, పాలకవర్గాల కుట్ర, ఒంటెద్దు పోకడ, సామాజిక రాజకీయ వివక్షత వంటి రాజకీయ అంశాలు కూడా అని స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇప్పటికీ రాజకీయాలతో సాహిత్యానికి సంబంధం లేదు అనే రచయితలు ఉన్నారంటే సిగ్గుపడాల్సిందే .
---పరదా చాటున రచన చేయడం, ఏదో వేదిక పైన కవి సమ్మేళనాలు నిర్వహించుకోవడం, వక్తల ప్రసంగాలతో పరిధిని గీచుకుంటే సరిపోదు. రచయితలు కళాకారుల మాదిరిగా కార్య క్షేత్రంలో దూకాలి, ప్రజలతో చర్చించాలి,ప్రజా సమస్యల పైన నిలదీయాలి కూడా. ప్రచురించబడిన తన రచన చూసుకొని మురిసేవాళ్ళు, సన్మానాల ముసుగులో తన బాధ్యతను మరిచేవాళ్లు కవులు కానే కాదు.
--- ప్రజల పక్షాన పని చేయడానికి వెనుకాడుతూ తమ ఉనికి కోసం ఆరాటపడుతున్న వాళ్లకు రచయితలు అను చెప్పుకునే నైతిక హక్కు లేదు. సన్మానాలు సత్కారాల కోసం కాదు వ్యవస్థ పట్ల సామాజిక బాధ్యత కోసం గలమెత్తి నిలవాలి.
మొక్కుబడి సాహిత్యాన్ని, మార్పు కోరని రచనలను, పాలకులకు అనుకూలమైన విధానాన్ని మానుకొని ప్రగతిశీల శక్తులుగా వ్యవస్థ మార్పును ఆశించి సమసమాజ స్థాపన ఆవిష్కరించుకోవడానికి పనిచేయగలిగిన వాళ్లు మాత్రమే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ప్రజల కోసం పోరాటం చేసి ఉరికంబాలు ఎక్కిన వాళ్ళు, ప్రజా సాహిత్యానికి ముందుండి అష్ట కష్టాలు ఎదుర్కొన్న చివరిదాకా అమ్ముడు పోనీ వాళ్లు ఈ వ్యవస్థలో కోకొల్లలు. వారిని ఆదర్శంగా తీసుకుందాం, అభ్యుదయ వాదులుగా స్థిరపడుదాం, ప్రజల కోసం పనిచేసే ప్రజా గొంతుకలుగా ప్రజల ప్రతినిధులుగా చెయ్యెత్తి నినదిద్దాం. ఇప్పటికీ అనేక అంశాలను విస్మరిస్తూ టైంపాస్ పల్లీల మాదిరిగా సాహిత్య రంగంలో కొనసాగుతున్న వాళ్లు తమ ఆలోచన సరళిని మార్చుకుంటే సంతోషం... ప్రజా క్షేత్రంలోకి ప్రజా చైతన్య పోరుబాటలోకి వాళ్లను ఆహ్వానిద్దాం... ఆ వైపుగా కృషి చేయాలని కోరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)