విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలి
తిరుమలగిరి 10 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సమాజంలో మంచి గుర్తింపు హోదా రావాలంటే చదువే శరణ్యం అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026 పదో తరగతి పరీక్షల్లో 500 కి పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవం మరియు అభినందన సభ మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఆర్ వి ఎస్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరై, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిభ చాటిన సుమారు 300 మంది విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా 'వెంపటి' గ్రామానికి చెందిన ఒక ప్రతిభావంతమైన విద్యార్థికి ఎమ్మెల్యే మందుల సామేలు రూ. 1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.
విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యం: ఎమ్మెల్యే మందుల సామేలు
అవార్డుల ప్రధానం అనంతరం ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్య పట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారానే వారు ఉన్నత విద్యాభ్యాసం వైపు అడుగులు వేస్తారని అన్నారు. ప్రస్తుత విద్యా విధానం, భారతీయ సంస్కృతి, విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలను క్లుప్తంగా వివరిస్తూ.. విద్యార్థులంతా భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
"అన్ని దానాల కంటే విద్యాదానం ఎంతో గొప్పది.
'విద్య లేకపోతే వింత పశువు' అన్న నానుడిని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. దేశానికే దిక్సూచి లాంటి ఉపాధ్యాయులే విద్యార్థులకు మొదటి గురువులు. మహనీయుల బాటలో పయనిస్తూ, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలన్నారు.
విద్యా రంగానికే ప్రథమ ప్రాధాన్యం..
నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా రంగానికే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జూనియర్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
ఈ అభినందన సభలో జిల్లా విద్యాధికారి అశోక్ నియోజకవర్గంలోని మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, తిరుమలగిరి మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుంకర జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధారావత్ జుమ్మిలాల్, మూల అశోక్ రెడ్డి, పేరాల వీరేష్ పత్తే పురం సుధాకర్, కుంభం సతీష్, బత్తుల శ్రీను, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.