వడ్డేపల్లి ఎంఈఓ నర్సింహులు సస్పెన్షన్
రిజిస్ట్రేషన్ లేకుండా పాఠశాల నిర్వహణకు అనుమతి..
విద్యార్థుల రికార్డుల బదిలీలో నిర్లక్ష్యం
జోగులాంబ గద్వాల 9సెప్టెంబర్ 2026తెలంగాణ వార్త ప్రతినిధి.
వడ్డేపల్లి. మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) నర్సింహులును సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఓ పాఠశాలను విద్యార్థులతో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం, ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు విద్యార్థుల విద్యా, బోనఫైడ్ రికార్డులు సక్రమంగా బదిలీ కాకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.పాఠశాల మార్పు జరిగినప్పటికీ విద్యార్థుల రికార్డులు కొత్త పాఠశాలకు సక్రమంగా అందకపోవడంతో తమ పిల్లల చదువులు, బోనఫైడ్ వివరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థుల విద్యా రికార్డుల నిర్వహణ, పాఠశాల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎంఈఓ నర్సింహులును సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ స్వయంగా ఒక ప్రముఖ పత్రిక కు వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన రికార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.