మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ పరిశీలన

Mar 19, 2025 - 18:38
 0  3
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ పరిశీలన

జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బుధవారం మల్దకల్ మండలంలోని తాటికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ల్యాండ్ డెవలప్మెంట్, హార్టికల్చర్, రోడ్డు ఇరువైపుల మొక్కల నాటిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

   ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతమందికి పని కల్పించబడిందో, ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కూలీలు ఉదయం నుంచే పనిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పని ప్రదేశంలో నీడ, మంచినీటి వసతి, ఎండ ప్రభావం తగ్గించేందుకు ORS పాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పనుల పొడవు, వెడల్పు, లోతు కొలతలు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఫీల్డ్ అసిస్టెంట్లు వాటిని ఖచ్చితంగా రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనుల వివరాలు, కొలతలు, ఖర్చులను మెజర్‌మెంట్ బుక్ లో సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. కూలీకి సంబంధించిన చెల్లింపులు బ్యాంకు ఖాతాల్లో సక్రమంగా జమ అవుతున్నాయా? అని తెలుసుకుని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కూలీలకు సూచించారు.అర్హులందరికీ ఉపాధి హామీ పనులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా కూలీలకు ORS పాకెట్లు పంపిణీ చేసి, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించారు. హార్టికల్చర్ సంబందించిన 3 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన మొసాంబి పండ్ల తోటను పరిశీలించి, అధికారుల నుండి తోట నిర్వహణ, దిగుబడి, సాగు విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మరింత ఆదాయం లభించేందుకు తోటల్లో అంతర్ పంటలు వేసుకోవచ్చని సూచిస్తూ, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేసుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులను అనుసరించాలని తెలిపారు. తాటికొండ స్టేజి నుండి బింగిడొద్ది వరకు రోడ్డు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి, మొత్తం నాటిన మొక్కల వివరాలు తెలుసుకున్నారు. వేసవి నేపథ్యంలో మొక్కలకు తగినంత నీటి సరఫరా చేయడంతో పాటు, సమర్థవంతమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయ రెడ్డి, ఏపీఎం సుజాత, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333