రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి
జోగులాంబ గద్వాల 9ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18 వరకు అర్రైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ పై నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
గురువారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపి శివధర్ రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి రోడ్ సేఫ్టీ వీక్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో ఏటా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టాలు జరుగుతున్నయన్నారు. గత మూడు నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 330 మంది రహదారి ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారన్నారు. ఈ నేపథ్యంలోనే రహదారి ప్రమాదాల నివారణకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18 వరకు రోడ్ సేఫ్టీ పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజు వారీగా నిర్వహించే వివిధ అవగాహన కార్యక్రమాల గురించి తెలియజేశారు. గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీసి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలన్నారు. ఈనెల 13న రోడ్ సేఫ్టీ పై గ్రామస్థాయి కమిటీ ఎన్నిక కావాలన్నారు. 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలోనూ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున అర్రైవ్, అలైవ్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టును పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అన్నారు. పిల్లల చేత పెద్దలకు రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తే పరివర్తన వస్తుందని అభిప్రాయపడ్డారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.